మీ ప్రతి కష్టం, ప్రతి బాధ తీరుస్తా.. 

రాజానగరం ప్రచార సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రతి కుటుంబానికి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల లబ్ధి

మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని పూర్తిగా అమలు చేస్తాం

మళ్లీ మోసపు హామీలతో 34 పేజీలతో చంద్రబాబు మేనిఫెస్టో

 

తూర్పుగోదావరి: పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశా. ఆ బాధలు విన్నా. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం, ప్రతి బాధ తీరుస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ సీపీ ప్రచార సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని మాట్లాడుతూ.. 

నాన్నగారి స్నేహితుడు, మా కుటుంబానికి ఆప్తుడు జక్కంపూడి రాంమోహన్‌రావు మంచి తనాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన ఉన్నప్పుడు మంచిరోజులు చూశాం. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన చూశాం. ఆ మంచి తనాన్ని, ఆ పాలనను చూసిన తరువాత ఈ జిల్లా పరిస్థితి ఎలా ఉందని నా పాదయాత్రలో ప్రజలు పడుతున్న ప్రతి బాధను వారి మాటల్లోనుంచి విన్నా.. వారి కష్టాలను నేను చూశా. ఆ ఆవేదనను నేను విన్నా.. మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. ప్రభుత్వం సాయం చేస్తుందని సాయం కోసం ఎదురుచూస్తూ.. సాయం ఎండమావి అయి ఇబ్బందులు పడ్డ ప్రతి కుటుంబానికి చెబుతున్నా.. మీ బాధలు నేను విన్నాను.. మీ కష్టాన్ని నేను చూశాను.. మీ అందరికీ నేను ఉన్నానని మాటిస్తున్నాను. పక్కనే గోదావరి ఉంటుంది. కానీ సాగునీరు ఉండదు. పక్కనే గోదావరి ఉంటుంది.. జిల్లాలో తాగునీరు కూడా సరిగ్గా ఉండదు. రైతులకు గిట్టుబాటు ధరలు కూడా రాని పరిస్థితి. రుణాలు మాఫీ కాకపోవడంతో రైతుల రుణాలు వడ్డీల మీద వడ్డీలు పెరిగి రెట్టింపయిన పరిస్థితి కనిపిస్తుంది. 

2018 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న ప్రభుత్వ పెద్దలు పోలవరం ప్రాజెక్టు పునాధి గోడలు దాటి ముందుకు కదలని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు మేలు చేయాల్సిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఎలా దోచుకోవాలనే ఆరాటంతో పనిచేయించారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లుగా పెంచుతున్నారు. నామినేషన్‌ పద్ధతిలో సబ్‌ కాంట్రాక్టర్‌లను తీసుకొస్తున్నారు. చివరకు ఆ ప్రాజెక్టు ఏ స్థాయిలో దోచారని చెప్పడానికి ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు సబ్‌ కాంట్రాక్టర్‌గా దోచుకున్న పరిస్థితులు ఇదే జిల్లాలో కనిపిస్తాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో దోపిడీ జరుగుతుంది. పురుషోత్తపట్నం వ్యవహారం చూసినా అదే కనిపిస్తుంది. పుష్కర, చాగలనాడు, వెంకటనగరం, కాటవరం, పెరిగడ్డ ఎత్తిపోతల పథకం ఉన్నా.. ఎప్పుడూ అవి పూర్తి స్థాయిలో పనిచేయని పరిస్థితి. ఆ పంపులకు రిపేర్లు చేయాలనే ఆలోచనలు కూడా ఈ ప్రభుత్వానికి పట్టవు. సక్రమంగా పంపులు పెట్టాలి. నీళ్లు ఇవ్వాలి. నీరు వచ్చే సమయానికి పంపులు పనిచేయాలనే కనీస ఆలోచనలు కూడా రావు. 

కడియం స్కీమ్‌ ద్వారా 48 గ్రామాలకు దివంగత మహానేత వైయస్‌ఆర్‌ తాగునీరు అందించారు. కడియం స్కీమ్‌కు మరో రూ. 10 కోట్లు ఖర్చు చేస్తే మరో 40 గ్రామాలకు నీరు అందుతాయని తెలిసినా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం అది చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి రాదు. కానీ.. చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో కాటవరం, మునికొడలి, ముగళ్ల, వంగలిపుడి ర్యాంపుల దగ్గర నుంచి జేసీబీలు పెట్టి వందల కొద్ది లారీలు పెట్టింది వందల కోట్ల రూపాయల ఇసుకను మన కళ్ల ముందే దోచేశారు. నీరు – చెట్టు అని పేదవాడికి మంచి చేయాల్సింది పోయి ఆ నీరు చెట్టులో కూడా ఈ ఒక్క రాజానగరం నియోజకవర్గంలోనే అక్షరాల వందల కోట్ల రూపాయల పైచిలుకు దోపిడీ జరిగింది. ఏ స్థాయిలో దోచేస్తున్నారో.. చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు. ఇసుకను, మట్టిని, కొండలను, గుట్టలను వదలకుండా దోచేస్తున్నారు. 

కొడకండ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయం పక్కనే కనిపిస్తుంది. ఆలయ కొండను కూడా తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారంటే.. దేవుడంటే చంద్రబాబు ప్రభుత్వానికి భయం, భక్తి ఏమైనా ఉన్నాయా.. రైతన్న పరిస్థితి చూస్తే వరికి కనీసం మద్దతు ధర రూ. 1750 పంట చేతికి వచ్చే సరికి క్వింటాల్‌కు రూ. 12 వందలు కూడా రాని పరిస్థితిలో రైతాంగం వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ. 17 వందలు సీజన్‌లో కనీసం రూ. 12 వందలు కూడా రాని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నారు. చెరకు ధర టన్నుకు రూ. 2500 కంటే ఎక్కువ రాని పరిస్థితి. పక్కన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో రూ. 3150 ఇస్తున్నారు. అదే పంట మన దగ్గర రూ. 25 వందలకు కూడా కొనని పరిస్థితి. సుబాబులు, జామాయిలు ధరలు చూస్తే రైతులకు కన్నీరు తెప్పిస్తున్నారు. నాన్నగారి హయాంలో టన్ను రూ. 65 వందలకు అమ్ముడుపోయిన రోజులు గుర్తు చేసుకుంటున్నారు. పది సంవత్సరాల కంటే మెరుగైన ధర ఉండాల్సింది పోయి రేటు రూ. 2500 పలుకుతుందని రైతు చెబుతుంటే గుండె తరక్కు పోతుంది. మీ ప్రతి బాధను నేను చూశా.. మీ ప్రతి సమస్యను నేను విన్నా.. మీ అందరికీ మాటిస్తున్నాను.. మీ అందరికీ తోడుగా ఉంటానని మాటిస్తున్నా.. 

పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్న తరువాత వాళ్ల జీవితాలు మార్చడం కోసం మంచి చేసి వారికి మొహంలో చిరునవ్వు చూసేందుకు వచ్చే ఐదేళ్లలో మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశాం. మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి కుటుంబానికి మేలు చేసేలా అంశాలు పెట్టాం. అక్షరాల ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల నుంచి రూ. 5 లక్షల వరకు ఏరకంగా లబ్ధి జరుగుతుందని మేనిఫెస్టో విడుదల చేశాం. మన ఎన్నికల ప్రణాళిక 2019లో అది కేవలం ఒక పేజీ మాత్రమే. మేనిఫెస్టోలో మోసాలు, అబద్ధాలు లేవు. ప్రతి పేదవాడికి చిత్తశుద్ధితో ఏం చేస్తామో పెట్టాం. ఎన్నికల ప్రణాళిక ఎల్లవేళలా మీకు కనిపించేలా రెండే పేజీలు పెట్టాం. ఐదు సంవత్సరాల్లో ప్రతి చోట కనిపిస్తుంది. ఇందులో చెప్పిన ప్రతి హామీని మీ కళ్ల ముందే పూర్తి చేస్తాం. మళ్లీ ఐదు సంవత్సరాల తరువాత ప్రతి మాటను నేను చేశాను.. 2024లో నాకు మళ్లీ ఓటేయండి అని అడుగుతాం. 

ఎన్నికల ప్రణాళికను చూపించి చంద్రబాబు చేస్తున్న మోసాలను ఒకసారి గమనించండి. నిన్న పొద్దున మన మేనిఫెస్టో విడుదల చేయగానే.. కొన్ని గంటల తరువాత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారు. 34 పేజీలతో కొత్త ఎన్నికల ప్రణాళిక ఇచ్చారు. అందులో సాక్షాత్తు 24 పేజీల్లో కొత్త వాగ్ధానాలు చేశారు. దాదాపు మళ్లీ 300 వాగ్ధానాలు చేశారు. ఇంతకు ముందు ఎన్నికల ప్రణాళిక 50 పేజీలు ఇచ్చాడు. 

2014 టీడీపీ మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాలు మాఫీ అన్నాడు. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాలు మాఫీ, బెల్టుషాపులు రద్దు, మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు వ్యవస్థ, ఆపదలో ఉన్న మహిళలకు సెల్‌ఫోన్ల ద్వారా ఐదు నిమిషాల్లో సాయం అందించగల రక్షణ వ్యవస్థ, యువతకు ఉద్యోగం, ఉపాధి, లేకపోతే రూ. 2 వేల నిరుద్యోగ  భృతి, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, పేదలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎన్టీఆర్‌ సృజల స్రవంతి పథకం రూ. 2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇంటింటికి సప్లయ్‌. అవినీతి రహిత సుపరిపాలన ఈ హామీల కింద చంద్రబాబు సంతకం. ఏ స్థాయిలో ఈ మోసాలు ఉన్నాయంటే.. ఎన్నికల ప్రణాళిక ఎక్కడ ఉందని టీడీపీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెతికితే.. ఎన్నికల ప్రణాళిక కనిపించకుండా మాయం చేశాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మాదిరిగా మోసం చేస్తూ 50 పేజీల మేనిఫెస్టోను చంద్రబాబు ఇచ్చారు. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రణాళికలో ఆయన చెప్పింది. ఎన్నికల ప్రణాళికలో ఆయన చెప్పిన ప్రతి మాట మోసమే. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఐదు సంవత్సరాల పాలన తరువాత ఏ ముఖ్యమంత్రి అయినా.. ఇదిగో నా మేనిఫెస్టో చెప్పినవన్నీ చేశాను.. నాకు ఓటేయండి అని అడగాలి. కానీ, 2019లో మళ్లీ 34 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. 

2019 టీడీపీ మేనిఫెస్టో: మిగతా హామీలన్నీ ప్రణాళిక బద్ధంగా ఐదు సంవత్సరాల్లో పూర్తిగా అమలు చేశారంట. చెప్పని అనేక అంశాలను నెరవేర్చడని దారుణంగా మోసం చేస్తూ 34 పేజీలతో కొత్త వాగ్దానాలు చేస్తూ.. ఏ మాత్రం సిగ్గలేకుండా దారుణంగా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి అన్యాయాస్థుడు మనకు కావాలా అని ఆలోచన చేయండి. ఏరకం కుట్రలు చేస్తున్నాడో మళ్లీ మీరే చూడండి. గత నెలరోజులుగా మీరు చూస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ జరగకూడదని, ప్రతి రోజుల ఆయనకు అమ్ముడుపోయిన టీవీల్లో, పత్రికల్లో పుకార్లు పుట్టిస్తూ.. చర్చ జరిగించే కార్యక్రమం చేస్తున్నాడు. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే.. డిపాజిట్లు కూడా రావని తెలుసు. కాబట్టే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. ఈ రోజు యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. చంద్రబాబు ఒక్కరితోనే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో, ఇంకా అమ్ముడుపోయిన అనేక టీవీ చానళ్లతో యుద్ధం చేస్తున్నాం. జరుగుతున్న ఈ కుట్రలను గమనించమని కోరుతున్నా.. గత నెలగా వారు ఉన్నది లేనట్లుగా.. లేనది ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ప్రతి రోజు ఒక కుట్ర, ఒక పుకారు చూస్తున్నాం. ఎన్నికల తేదీ వచ్చే సరికి కుట్ర తీవ్ర స్థాయిలోకి వెళ్లిపోతుంది. ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలోనూ రూ. 3 వేలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మీ అందరినీ కోరేది ఒకటే.. మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అన్నను, ప్రతి అవ్వా,తాతను కలవాలి. 

అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. అక్కా వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. నాలుగు రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. నాలుగు రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. చంద్రబాబు ఊరికి కనీసం 10 ఇళ్లులు కూడా కట్టించలేదు. నాలుగు రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లు కట్టడం చూశాం. మళ్లీ అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.

నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో జరిగే మంచిని ప్రతి ఇంటికి చేర్చండి. రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలిన కోరుతున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థిగా యువకుడు, ఉత్సాహవంతుడు, జక్కంపూడి రాంమోహన్‌రావు అన్న కొడుకు రాజాకు ఒక్క ఓటు వేస్తే వీరి ఇంట్లోని ముగ్గురు మీకు అందుబాటులో ఉంటారు. మీ అందరి చల్లని దీవెనలు రాజాపై ఉంచాలని కోరుతున్నాను. అదేవిధంగా యువకుడు, ఉత్సాహవంతుడు ఎంపీ అభ్యర్థిగా భరత్‌కు ఓటు వేసి గెలిపించాలి. చివరకు మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా..

 

Back to Top