కొత్తపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇరిగేషన్ శాఖ వైఫల్యం, వేసవి కెనాల్ క్లోజర్ పనుల్లో జరిగిన అవినీతే ప్రధాన కారణమని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఒకవైపు వేల ఎకరాల్లో వరి నారుమళ్లు, పంటలు నీట మునిగిపోతుండగా, మరోవైపు శివారు ప్రాంతాల్లో సాగునీరు అందక భూములు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రైతులకు కనీస సాగునీరు కూడా అందించలేకపోయిందన్నారు. వేసవి కాలంలో కాలువల పూడికతీత, తూముల శుభ్రపరిచే పనులు, మట్టి అడ్డంకుల తొలగింపు వంటి నిర్వహణ పనులు సక్రమంగా చేయకపోవడంతోనే ఖరీఫ్ సీజన్‌లో ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. 11 వేల క్యూసెక్కుల నీటితో సాగాల్సిన ప్రాంతంలో 14,700 క్యూసెక్కులు విడుదల చేసినా చివరి ఆయకట్టుకు నీరు చేరకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వేల ఎకరాల్లో నారుమళ్లు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ఇప్పుడు పంటలు వేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శివారు ప్రాంతాల్లో సాగునీరు లేక భూములు ఎండిపోతుండటంతో రైతులు రెండు వైపులా నష్టపోతున్నారని చెప్పారు. ఇరిగేషన్ మంత్రి సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించకుండా, నీరు ఉన్న ప్రాంతాల్లో ఫోటోషూట్లతో కాలం గడిపారని విమర్శించిన జగ్గిరెడ్డి, ప్రచారం కంటే రైతుల సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. వాడపల్లి వద్ద రూ.2.90 కోట్లతో నిర్మించిన సైఫన్ వల్ల ముంపు సమస్య తగ్గలేదని, ఆ పనుల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలువల నిర్వహణలో జరిగిన అవినీతిపై జిల్లా కలెక్టర్‌కు అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారన్న వార్తలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ప్రభుత్వం విడుదల చేశామని చెబుతున్న నిధులు ఎక్కడ ఖర్చయ్యాయో ప్రజలకు వెల్లడించాలని సవాల్ విసిరారు. రైతులకు యూరియా అందించడంలో, సాగునీరు కల్పించడంలో, తాగునీటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఖరీఫ్ పంటలు మునిగిపోయిన రైతులకు వెంటనే పూర్తి స్థాయి నష్టపరిహారం ప్రకటించాలని, ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, రైతులను మోసం చేయడం మానేసి సాగునీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చిర్ల జగ్గిరెడ్డి హెచ్చరించారు.