విశాఖ: మూడు రాజధానుల నినాదంతో సాగర తీరం మార్మోగుతోంది. వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర ప్రాంతం గర్జించింది. తరతరాలుగా వెనుకబాటుకు గురవుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలన రాజధాని కావాలని, రావాలని కోరుతూ వికేంద్రీకరణకు మద్దతుగా జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహిస్తున్న `విశాఖ గర్జన` ఉవ్వెత్తున ఎగసింది. విశాఖ గర్జనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విశాఖ గర్జనలో పాల్గొనేందుకు వర్షంలోనూ జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై విశాఖ, జై ఉత్తరాంధ్ర నినాదాలతో విశాఖ నగరం దద్దరిల్లుతోంది. వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకున్నమూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖ గర్జనలో పాల్గొన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. విశాఖలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైయస్ఆర్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగుతోంది. రాజకీయాలకతీతంగా భారీ ప్రదర్శన చేపట్టగా దీనికి అన్ని వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఈ మేరకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తరతరాల వెనుకబాటు తనంపై ఒక్కటైన ఉత్తరాంధ్ర ప్రజానీకం వికేంద్రకరణతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నినదిస్తున్నారు.