గుంటూరు : మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో సీఎం వైయస్ జగన్ ఉన్నారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో శనివారం వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు జరిగే మెగా జాబ్‌మేళాను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల తమ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి, వైజాగ్‌లలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలకు విశేష స్పందన వచ్చిందని, రెండుచోట్ల 347 కంపెనీలు పాల్గొనగా, 30 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే, ఏఎన్‌యూలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో 26 వేల ఉద్యోగాలను భర్తీచేసేందుకు ప్రైవేటు రంగంలోని వివిధ రకాల సంస్థలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇందుకు వైయస్ఆర్ సీపీ జాబ్ పోర్టల్‌లో 97వేల మంది నిరుద్యోగ యువత నమోదు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో తిరుపతి, వైజాగ్, గుంటూరు జిల్లాల్లో మెగా జాబ్‌మేళాలను నిర్వహిస్తున్నామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. జాబ్‌మేళాకు విశేష స్పందన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. తొలిరోజు మేళా ముగిసిన అనంతరం ఆయన పలువురికి కంపెనీల ఆఫర్ లెటర్లు అందజేశారు. తొలిరోజు 142 కంపెనీలు పాల్గొనగా మొత్తం 7,473 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. తొలిరోజు 31 వేల మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారన్నారు. ప్రజా మద్దతు లేనివారికే పొత్తులు కావాలి వైయస్సార్‌సీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరంలేదని విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. ఎవరికైతే ప్రజల మద్దతు లేదో వారే పొత్తుల కోసం పాకులాడుతున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనేందుకు విçపక్షాలన్నీ కలిసి రావాలని చంద్రబాబు శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇతరులపై ఆధారపడే తత్వం, వారిని మోసగించి వెన్నుపోటు పొడిచే నైజం చంద్రబాబుదేనన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రూ.11.5 లక్షల ప్యాకేజీ తొలిరోజు ఉద్యోగాలకు ఎంపికైన వారిలో లోమా ఐటీ సొల్యూషన్ కంపెనీ కల్యాణి అనే యువతికి అత్యధికంగా వార్షిక ప్యాకేజీ కింద రూ.11.5 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత సీఎఫ్‌ఎల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్, క్లస్టర్ మేనేజర్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థికి రూ.5.47 లక్షల ప్యాకేజీ ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ: జాబ్‌మేళాల్లో ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థులు ఏ మాత్రం నిరాశ చెందొద్దు. మీకు ఉద్యోగం వచ్చే వరకు వైయస్సార్‌సీపీ మీ వెంటే ఉంటుంది. మీకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణనిస్తాం. అలాగే ఈ జాబ్‌మేళాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయి. అవసరం అయితే పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి, నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు తీసుకుని, వాటిని రికార్డుల్లో పెట్టుకుని, కంపెనీలతో మాట్లాడి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది అని శ్రీ విజయసాయిరెడ్డి వివరించారు.ఆ తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొందరికి ఆయన స్వయంగా ఆఫర్ లెటర్లు అందజేశారు.