దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు

రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ : దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నట్లు కేంద్ర‌ కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి గురువారం రాజ్యసభకు తెలిపారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ.. 2017-18లో జరిపిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో ఈ విషయం స్పష్టం అయినట్లు చెప్పారు. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ ధన్‌ పెన్షన్‌ పథకం కింద డిసెంబర్‌ 9నాటికి దేశంలో 45.83 లక్షల మంది కార్మికులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

18 నుంచి 40 ఏళ్ల‌ వయసు కలిగి ఉండి నెలసరి ఆదాయం 15 వేల రూపాయలు లోబడి ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ, ఎన్‌పీఎస్‌ వంటి ప్రభుత్వ పథకాలలో సభ్యులుకాని వారు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ ధన్‌ పెన్షన్‌ పథకంలో చేరేందుకు ఆర్హులని కేంద్ర‌మంత్రి వివరించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు నమోదైన 45 లక్షల మంది కార్మికులలో 31 లక్షల మంది కార్మికుల అకౌంట్లను ఆటో డెబిట్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా భారత్‌తోపాటు ప్రపంచం అంతా ప్రభావితమైనందున ఈ పథకం కింద కార్మికుల నమోదు కూడా మందగించిందన్నారు. కార్మికులకు ఊరట కల్పించేందుకు కోవిడ్‌ కాలంలో ప్రీమియం చెల్లించని వారికి పెనాల్టీని ఎత్తివేసినట్లు చెప్పారు.

ఏపీలో 32 ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్లు
భారత వాతావరణ విభాగం ఆంధ్రప్రదేశ్‌లో 32 ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్లు, 61 ఆటోమెటిక్‌ రెయిన్‌ గేజ్‌లను ఏర్పాటు చేసినట్లు శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. రాజ్యసభలో గురువారం ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 974 కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు తీరప్రాంతంలోనే ఉన్నాయి. ఉష్ణమండల తుపాన్లతో కోస్తా ప్రాంతం ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉంది. పెనుతుపాన్లు, ప్రచండమైన గాలులతో ఏర్పడే జలవిలయం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలో తరచుగా  పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందని కేంద్ర‌మంత్రి అన్నారు. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరం తుపాను సంబంధించిన విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు తుపాన్ల ముప్పు తప్పడం లేదని వివరించారు.

Back to Top