ఏపీలో సచివాలయాలు సూపర్‌.. 

వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వానికి కేంద్రమంత్రి మురుగన్‌ ప్రశంసలు
 
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల గడప వద్దకే చేర్చడం బాగుంది

దళారీ వ్యవస్థ ప్రమేయం లేకుండా ప్రజలకు మేలు చేస్తున్నారు

దిశ యాప్‌ను బటన్‌ నొక్కి పరిశీలించిన కేంద్ర మంత్రి

సెకన్ల వ్యవధిలో కంట్రోల్‌రూమ్‌ నుంచి ఫోన్‌ కాల్‌ 

దీంతో చర్యలు బాగున్నాయంటూ కేంద్ర మంత్రి అభినందన

కాకినాడ: ఏపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకెంతో మేలు చేస్తోందని కేంద్ర మత్స్యకార, పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ ప్రశంసించారు. బుధవారం ఆయన కాకినాడలో పర్యటించి.. 36వ డివిజన్‌ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రతి 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌ను, ప్రతి డివిజన్‌కు ఓ సచివాలయాన్ని ఏర్పాటు చేసి.. వాటికి కార్యదర్శులను నియమించి.. వ్యవస్థను సమర్థంగా నడిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. దళారీ వ్యవస్థకు దూరంగా.. సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే చేరుస్తుండటం వ్యక్తిగతంగా కూడా తనకెంతో నచ్చిందని చెప్పారు.

అంతకుముందు 36వ డివిజన్‌ సచివాలయంలో విధుల్లో ఉన్న మహిళా పోలీస్‌ ఫోన్‌ నుంచి దిశ యాప్‌ పనితీరును ఆయన పరిశీలించారు. ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కగా.. సెకన్ల వ్యవధిలో దిశ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఫోన్‌ రావడంతో.. కేంద్ర మంత్రే దానికి జవాబిచ్చారు. ‘నేను కేంద్ర మంత్రి మురుగన్‌ను, దిశ యాప్‌ పనితీరును పరిశీలించేందుకే ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కాను’ అని వారికి తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. దిశ యాప్‌తో పాటు కంట్రోల్‌ రూమ్‌లు, ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు, సిబ్బందిని ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించడం అభినందనీయమన్నారు. కేంద్ర మంత్రి వెంట కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేయర్‌ సుంకర శివప్రసన్న తదితరులున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top