పల్నాడు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైయస్ భారతమ్మలు ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైయస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. శావల్యాపురం మండలం గంటావారిపాలెంలో నేడు శ్రీ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి ఉగాది పూజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేదపండితులు ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.