‘కరోనా’ కారణంగానే శ్రీవారి దర్శనాలు నిలిపివేత

యథా ప్రకారమే స్వామివారికి పూజలు నిర్వహిస్తాం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగానే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనాలు నిలిపివేశామని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, దయచేసి అందరూ సహకరించాలని కోరారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నియంత్రణకు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కరోనా వైరస్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదైనా ఏపీలో మాత్రం అతితక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు. 

దేశ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా ఉధృతం అవుతున్న నేపథ్యంలో వైరస్‌ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి విద్యాసంస్థలు, సినిమా హాల్స్, మాల్స్, ప్రధాన దేవాలయాలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. తిరుమలకు నిత్యం 70 నుంచి 90 వేల మంది భక్తులు వస్తుంటారని, వారికి వైరస్‌ సోకకుండా ముందస్తు చర్యగా స్వామివారి దర్శనాలను నిలిపివేశామని వివరించారు. దేవాలయాల్లో స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. 
 

Back to Top