హైదరాబాద్: తెలంగాణలో ఉద్యమ కారుడు, ప్రజా గాయకుడు గద్దర్ భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావులు నివాళులర్పించారు. గద్దర్ అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో గద్దర్ మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు జూపూడి ప్రభాకర్ తెలిపారు. ప్రజా గాయకుడు గద్దర్ దళితులు, పేదల పక్షాన పోరాటం చేసిన ఉద్యమకారుడని, అలాంటి పోరాటయోధుడిని ఈ సమాజం కోల్పోయిందన్నారు. ఆయన వదిలి వెళ్లిన ఆశయాలను శిష్యులు అందుకోవాలన్నారు. వైయస్ జగన్ ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఇక్కడికి రాలేకపోయారు. గద్దర్ కుటుంబ సభ్యులకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతిని, సంతాపం తెలిపారు. మంచి కళాకారుడిని కోల్పోయాం గద్దర్ మృతితో మంచి కళాకారుడిని కోల్పోయాం. జీవితమంతా ఆయన ప్రజా పోరాటాలకే అంకితం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాధగా ఉంది.. ప్రజా గాయకుడు గద్దర్ మృతి చెందడం బాధగా ఉంది. గడిచిన సంక్రాంతి సందర్భంగా ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. – సీదిరి అప్పలరాజు, మంత్రి