అగ్రిగోల్డు బాధితుల‌కు బాస‌ట‌గా రేపు భారీ ధ‌ర్నా 

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, అంజాద్‌బాషా
 

 వైయ‌స్ఆర్ జిల్లా : అగ్రిగోల్డు బాధితుల‌కు బాస‌ట‌గా రేపు జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట భారీ ధ‌ర్నా నిర్వ‌హిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, అంజాద్‌బాషా, మేయ‌ర్ సురేష్‌బాబు తెలిపారు. బుధ‌వారం వారు విలేక‌రుల‌తో మాట్లాడారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ చంద్రబాబుకు ఉక్కు పరిశ్రమ గుర్తుకు వచ్చిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాద్‌ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో అంటకాగిన చంద్రబాబుకు ఉక్కుపరిశ్రమ గుర్తుకు రాలేదని, విభజన హామీల అమలు కోసం ఏనాడైనా నిలదీసారా?అని ప్రశ్నించారు. ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, శ్వేత పత్రాలతో ప్రజలకు పూర్తి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దోపిడీ అరాచకాలను ప్రజలు గమిస్తున్నారన్నారు. వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ఈ సందర్భంగా రవీంద్రనాద్‌ ధన్యవాదాలు తెలిపారు.

ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమేనని సురేష్‌బాబు అన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకొని నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టింది చంద్రబాబేనని, ముఖ్యమంత్రిగా ఆయన అన్ని రంగాల్లో విఫలమయ్యారని విమర్శించారు. జనవరి 9న ఇచ్చాపురంలో జరిగే ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 

పచ్చ చొక్కాలకే నిరుద్యోగ భృతి..
పచ్చ చొక్కాలు వేసుకున్న వారికే నిరుద్యోగ భృతి ఇస్తున్నారని కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా తెలిపారు. జాబు కావాలంటే బాబు కావాలి అన్న చంద్రబాబు నాలుగేళ్లుగా ఒక్క  ఉద్యోగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. నాడు సోనియాగాంధీని ఇష్టం వచ్చినట్లు తిట్టి, ఇప్పుడు సిగ్గు లేకుండా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని ముసుగులో లక్షల కోట్ల రూపాయలను తెలుగు తమ్ముళ్లు దండుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు దుష్ట పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని, ఆయనను ఏ ఒక్కరు నమ్మే స్థితిలో లేరన్నారు.

Back to Top