తిరుపతి: టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధి వివాదాలకు, తప్పిదాలకు కేంద్రంగా మారిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. టీటీడీలో జరుగుతున్న తప్పిదాలను ప్రశ్నిస్తే హైందవ ద్రోహులుగా ముద్రించడం బీ ఆర్ నాయుడుకి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. చంద్రగ్రహణం రోజున స్వామివారి సిబ్బంది కాకుండా టీటీడీ చైర్మన్ ఛానెల్ ప్రతినిధి మహాద్వారం దగ్గరున్న ఇత్తడి గ్రిల్స్ తాళాలు వేయడం ఘోర తప్పిదమని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ ఆర్ నాయుడు తన ప్రసార మాధ్యమాల ద్వారా ఎంత బెదిరించినా ఆయన చేసిన అక్రమాలను, తిరుమలలో జరుగుతున్న తప్పిదాలను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ● స్వామివారి సేవల్లో ఘోర తప్పిదం.... శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రధమ సేవకుడిగా ధర్మానికి, ఆచారానికి కట్టుబడి ఉంటూ, హిందూ ధర్మ పరిరక్షణే బాధ్యతగా పనిచేస్తానని బీ ఆర్ నాయుడు ప్రమాణాలు, భీషణ ప్రతిజ్ఞలు చేశారు. కానీ ఆయన టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తిరుమల కొండ మీద అనునిత్యం ఏదో ఒక రకమైన వివాదం జరుగుతూనే ఉంది. ఆ వివాదాలను, తప్పిదాలను ప్రశ్నిస్తున్న మా మీద హైందవ ద్రోహులుగా ముద్రించడం బీ ఆర్ నాయుడుకు పరిపాటిగా మారింది. సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద, పూర్వ అధ్యక్షుడిగా నా మీద మరింత దాడులకు దిగుతూ పొరపాటు మీద పొరపాటు చేస్తున్నారు. చంద్రగ్రహణం రోజున స్వామివారి ఆలయాలు మూసివేయడం అన్నది తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. మొన్నటి చంద్రగ్రహణం రోజున స్వామివారి ఆలయ మహాద్వారం తర్వాత ఉండే ఇత్తడి గ్రిల్స్ తాళాలు వేసే పనిని టీటీడీ సిబ్బంది కాకుండా... బీఆర్ నాయుడుకి చెందిన టీవీ5 ఛానెలో పనిచేస్తున్న వ్యక్తి చేశాడు. తన ఛానెల్ లో పనిచేస్తున్న వ్యక్తితో ఈ పనిచేయించడం ద్వారా బీ ఆర్ నాయుడు ఏ విధమైన సంకేతం ఇవ్వదల్చుకున్నారు. మీరిచ్చిన అహం, మీరున్నారు మాకేమీ కాదన్న ధైర్యంతో మీ సంస్ధలో పనిచేస్తున్న వ్యక్తి ఈ పనికి పాల్పడ్డారు. ఇది చాలా తప్పిదం. తాను ఈ పనిచేయలేదని ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా... వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ వ్యవహారాల్లో బీ ఆర్ నాయుడు సొంత మనుషులకు ఏం పని ? ఇటీవల కాలంలో స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం టీటీడీ బోర్డుకు చెందిన ఓ సభ్యుడు మహాద్వారం తర్వాత ఉండే ఇత్తడి గ్రిల్ నుంచి బయటకు వస్తానంటే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అలా వెళ్లడానికి వీల్లేదని నిర్భంధించారు. అది పెద్ద వివాదంగా కూడా మారింది. అది ఎంత ప్రాధాన్యత కలిగిన పాయింట్ అనడానికి ఇదే నిదర్శనం. అలాంటి స్థలంలో బీ ఆర్ నాయుడు గారి మనిషి నవ్వుతూ వీడియో తీసుకుంటున్నాడు. బీ ఆర్ నాయుడు గారేమో నేను టీటీడీ వాహనాలు వాడను, అక్కడ నీళ్లు కూడా తాగను అని చాలా మాట్లాడుతుంటారు. కానీ స్వామివారికి అపచారం చేస్తూ మీరు, మీ సొంత సిబ్బంది వ్యవహరించిన తీరు హైందవుల గుండెల మీద తన్నినట్టుంది. మీ సొంత ఛానెల్ లో ముఖ్యుడు, ఆలయంలో కులశేఖరపడి ఇవతల ఉంటూ మీకు కావాల్సినవారందరికీ దర్శనాలు చేయించడంతో పాటు హారతి ఇవ్వడం నుంచి ఏమేం చేయాలో డైరెక్షన్ ఇస్తూ సాధారణంగా అక్కడున్న అడిషనల్ ఈవో చెప్పే మాటలు కూడా తానే అంటూ దర్శనాలు చేయిస్తున్నాడు. ఇది అక్కడి అధికారులే ఫిర్యాదు చేస్తున్నారు. మీరా ధర్మాన్ని, సాంప్రదాయాలను పరిరక్షించేది ? ● దీనికేం సమాధానం చెప్తారు ? నిత్యం జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి పరమ నీచులు అని మాట్లాడే మీరు.. చంద్రగ్రహణం రోజున నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తి మీ మనిషి కాదా? మీ ఛానెల్ లో తిరుమల ప్రతినిధిగా పనిచేస్తున్న శ్యామ్ నాయుడు కాదా? లోకేష్, అనిత వంటి వివిధ మంత్రులతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలతో అతను దిగిన ఫోటోలు చూస్తుంటే శ్యామ్ నాయుడు మీ సంస్ధలో ఉద్యోగిగానే కాకుండా టీడీపీ కార్యకర్తగా కూడా పనిచేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇది మిమ్నల్ని చూసుకుని ఆ ధైర్యంతో మమ్నల్ని ఏ విజిలెన్స్ సిబ్బంది, గార్డులు ఆపలేరు, ఏం చేయలేరు అన్న దైర్యంతో చేసిన బరితెగింపు కాదా ? మీరు మా మీద ప్రకటల ద్వారా దాడి చేయవచ్చు, అంతు చూస్తామని బెదిరించవచ్చు, కానీ వీటికేం సమాధానం చెప్తారు? ● ఇదీ మీ అక్రమాల చిట్టా... మీ కుమారుడు సారధ్యంలో ఉన్న జూబ్లీహిల్స్ సొసైటీలో నార్సంగి దగ్గర మంచిరేవుల ప్రాంతంలో ప్లాట్లు ఇస్తామని రూ.90 కోట్లు ఇస్తామని వసూలు చేశారు. దానికి ఏ రకమైన ప్రభుత్వ, రేరా అనుమతులు లేవని తెలిసినా మీకున్న ఆర్ధిక, మీడియా బలంతో ఈ వసూల్లకు పాల్పడలేదా? మీరు రూ.500 కోట్ల మీద కన్నువేస్తే. రేరా మీ కుమారుడు బి.రవీంద్రనాధ్ అధ్యక్షతన ఉన్న జూబ్లీహిల్స్ సొసైటీ పై రూ.18.50 లక్షల ఫైన్ విధించింది. గతంలో నరేంద్రనాథ్ చౌదరి గారి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ సొసైటీ అత్యుత్తమంగా విరాజిల్లితే.. మీరు ఆ సొసైటీని కబలించిన తర్వాత అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ● కళ్యాణాలకు రేట్లా ? ఇదేమి ఘోరం టీటీడీలో మీరు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఆర్ధిక సాయం చేసిన కొన్ని సంఘాలు శ్రీవారి కళ్యాణం జరపాలని అనుకున్నారు. జర్మనీ తెలుగు అసోషియేషన్ వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్ ఆర్ టి ఎఫైర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్స్ సలహాదారుగా పనిచేస్తున్న వేమూరి రవికుమార్ కి వినతి పత్రం ఇచ్చారు. సెప్టెంబరు 6వ తేదీ నుంచి 16 చోట్ల ఐర్లాండ్, ఇంగ్లండ్, యూరప్ వంటి చోట్ల శ్రీవారి కళ్యాణం జరపాలని అడిగారు. దానికి బీ ఆర్ నాయుడు గారు తన బలంతో వెంటనే అంగీకరించారు. వాస్తవానికి శ్రీవారి కళ్యాణాలు శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే కాకుండా బయట కూడా జరపడం ద్వారా పేదవాళ్లకు స్వామివారి సేవలు అందుబాటులోకి రావాలన్న సంకల్పం మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి అనుమతితో నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే మొదలుపెట్టాం. తొలిసారిగా సూళ్లూరుపేట దళిత వాడలో ప్రారంభించారు. వైఖానస సాంప్రదాయం ప్రకారం అనేక ప్రాంతాల నుంచి వస్తున్న విజ్ఞుప్తుల మేరకు ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన నగరాలతో పాటు అనేక దేశాల్లోనూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 27న హేంబర్గ్ లో జరగనున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొనదల్చిన వారు 116 యూరోలు చెల్లించాలని, శ్రీనివాస కళ్యాణానికి 81 యూరోలు,విశేష కళ్యాణానికి 516 యూరోలు అని రేట్లు పెట్టారు. వాస్తవానికి గతంలో వివిధ దేశాల్లో ఉన్న స్థానికులు చందాలు వేసుకుని అక్కడ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ కాగా... తొలిసారిగా స్వామివారి సేవలకు రక,రకాల రేట్లు నిర్ణయించారు. ఇది చాలా దారుణం. అంటే గతంలో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఇచ్చిన ఫండ్స్ ను ఇలా శ్రీవారి కళ్యాణాలు నిర్వహించడం ద్వారా సంపాదించులనుకుంటున్నారా ? భక్తిభావం నిజంగా మీలో ఉంటే స్వచ్ఛంధంగా డబ్బులు వేసుకుని కార్యక్రమం నిర్వహించడమో లేదంటే కొంతమంది కలిసి గ్రూపుగా ఏర్పడి డబ్బులు వేసుకుని కార్యక్రమం చేయడం అనవాయితీగా వస్తోంది. కానీ ఇలా మీ అనుమతితోనే టిక్కెట్లు వసూలు చేసుకుని కార్యక్రమం చేయడం ఏ రకంగా ధర్మ ప్రచారం అవుతుంది బీ ఆర్ నాయుడు గారూ? ● ధనవంతుల ఇళ్లల్లో పూజలా? మీరు చైర్మన్ గా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కానీ, మరెక్కడైనా కనీసం ఒక్కచోటైనా శ్రీవారి కళ్యాణం నిర్వహించారా? కానీ శ్రీ వేంకటేశ్వర స్వామి అర్చకులను తీసుకుని వెళ్ళి ధనవంతుల ఇళ్లల్లో మీ అనుమతితో లక్ష్మీ పూజలు మాత్రం జరుపుతున్నారు. ఇవి చాలా బాధాకరమైన విషయాలు. మీరు మా మీద దాడి చేసే కొద్దీ మీరు చేస్తున్న అక్రమాలు అన్నీ ఒక్కొక్కటీ బయటపెడుతూనే ఉంటామని భూమన కరుణారెడ్డి స్పష్టం చేశారు. బీ ఆర్ నాయుడు ధర్మద్రోహానికి పాల్పడుతూ, అవినీతి పనులు చేస్తూ,తనకున్న ప్రసార మాధ్యమాల బలంతో నీతిపరులుగా ముద్రవేసుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా... పోరాటం మాత్రం ఆగదని తేల్చి చెప్పారు.