రేయ్‌.. మాధవ్‌.. నిన్ను చంపుతాం 

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ‘అధికార’ జులుం

చంపుతామని టీడీపీ.. ఊరొదిలి పెట్టమని పోలీసులు

కౌంటింగ్‌ రోజు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇంటిపై టీడీపీ రాళ్ల దాడి

చంపుతామంటూ పొలికేకలు..

గన్‌మెన్లు నిలువరించే ప్రయత్నం చేసినా బరితెగింపు

ఇంట్లో ఉన్న గోరంట్ల మాధవ్‌ కాలికి గాయం

వారం అవుతున్నా పురోగతి లేని కేసు దర్యాప్తు

మరోపక్క ఊరొదిలి వెళ్లిపొమ్మని మాధవ్‌పై పోలీసుల ఒత్తిడి 

ససేమిరా అంటున్న మాజీ ఎంపీ

కార్యకర్తలు అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉంటుంది: మాధవ్‌

 అనంత‌పురం : రేయ్‌.. మాధవ్‌.. నిన్ను చంపుతాం అంటూ టీడీపీ నాయకులు, ఊరొదిలి వెళ్లిపోవాలంటూ పోలీసు అధికారులు నిన్నటి వరకు ఎంపీ అయిన గోరంట్ల మాధవ్‌పై అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ రోజున అనంతపురం నగరంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. 
‘రేయ్‌ మాధవ్‌ నిన్ను చంపుతాం’ అంటూ కేకలు వేస్తూ రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటికి వారం అవుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులపై అధికార పార్టీ నుంచి పెద్దఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పైగా, నిన్నటి వరకు ఎంపీ అయిన మాధవ్‌నే ఊరొదిలి వెళ్లి­పోవాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేయడం గమనార్హం. అయితే, ఇందుకు మాధవ్‌ ససేమిరా అంటున్నారు. కార్యకర్తలకు అండగా ఇక్కడే ఉంటానని కరాఖండిగా చెబుతున్నారు.

ఆరోజు ఏమి జరిగిందంటే..
ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్‌ జరిగింది. మధ్యాహ్నానికి రాష్ట్రంలో కూటమి మెజార్టీ సీట్లు గెలుచుకోవడంతో  టీడీపీ నాయకులు, కార్యకర్త­లు రెచ్చిపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమ­యంలో నగర శివారులోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇంటి వద్ద కొందరు టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. ఇంటి మీద రాళ్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో మాధవ్‌ దంపతులు ఇంట్లోనే ఉన్నారు. ఇంటిపై భాగంలోని అద్దాలు పగిలిపోయాయి.

ఒక రాయి మాధవ్‌ కుడికాలి పాదం వద్ద బలంగా తాకడంతో గాయమైంది. చుట్టుపక్కల వాళ్లు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లకు తలుపులు వేసుకున్నారు. మాధవ్‌ గన్‌­మెన్లు నిలువరించే ప్రయత్నం చేసినా ఉపయోగం లేక­పో­యింది. ‘రేయ్‌.. మా ప్రభుత్వం వస్తోంది. మాధ­వ్‌­గాడిని చంపుతాం. నీకు ఎవరు దిక్కు వస్తారురా’ అంటూ కేకలు వేశారు. 

పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ‘నిన్ను ఎప్పటికైనా హత­మారుస్తాం’ అంటూ వెళ్లిపోయారు. ఎస్పీ గౌత­మి­శాలి స్వయంగా ఘటనా­స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అల్లరిమూకలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కానీ కేసులో ఇప్పటిదాకా ఎలాంటి పురోగతీ లేదు.

ఊరొదిలి పోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు : మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌
తనను ఊరు వదిలి పోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ చెప్పారు. మంగళవారం సాయంత్రం ఇద్దరు సీఐలు తన నివాసానికి వచ్చి ఈ విషయం చెప్పారని తెలిపారు. అనంతపురం డీఎస్పీ కూడా ఇదే రకమైన ఒత్తిడి చేస్తున్నారన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలిపెట్టి వెళ్లబోనని, తమ పార్టీ కార్యకర్తల కోసం అండగా ఉంటానని స్పష్టంచేశారు. అవసరమైతే తనను అరెస్టు చేసుకోవాలన్నారు. 

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని టీడీపీ సద్వినియోగం చేసుకుని వారికి మంచి చేయాలి కానీ ఇలా ఇళ్లపై దాడులు చేయడం హేయమని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా కౌంటింగ్‌ రోజు నుంచే గ్రామాల్లో దాడులకు తెగబడుతున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడు­లకు తట్టుకోలేక చాలా మంది ఊళ్లు వదిలారని, కార్యకర్తలెవరూ అధైర్యప­డొద్దని, పార్టీ పూర్తిస్థా­యిలో అండగా ఉంటుందని చెప్పారు. పార్టీ అధినేత సూచనలతో త్వరలోనే బాధితులను కలిసి భరోసా ఇస్తామన్నారు.

Back to Top