వైయస్‌ జగన్‌ మంచి పాలన అందిస్తారు

టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జై రమేష్‌ 

చంద్రబాబు సీఎం కావడానికి సహకరించా

2001 నుంచి టీడీపీకి దూరంగా ఉన్నాను

చంద్రబాబు వైఖరితో విరక్తి చెందా

వైయస్‌ జగన్‌ మాట ఇస్తే..దాని మీద నిలబడతారనే నమ్మకం ఉంది

హైదరాబాద్‌:  వైయస్‌ జగన్‌ ఘన విజయం సాధించి మంచి పాలన అందిస్తారని టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జై రమేష్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో వైయస్‌ జగన్‌ను కలిసిన రమేష్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభంజనంలా వైయస్‌ జగన్‌ గాలి వీస్తుందని, తప్పక ముఖ్యమంత్రి అవుతారని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో అత్యధిక సీట్లతో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. వైయస్‌ జగన్‌ మాట ఇస్తే దాని మీద నిలబడతారనే నమ్మకం ఉందన్నారు. 

తెలుగు జాతిని అవమానించేలా చంద్రబాబు పాలన సాగుతుందని రమేష్‌ విమర్శించారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో విపరీతమైన అవినీతి జరుగుతుందన్నారు. ఇంత అవినీతి జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు. ప్రతి పనికి 20 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ రకంగా రాష్ట్ర జీడీపీలో టీడీపీ నేతలు సొంతానికి లాక్కుంటున్నారని, రాష్ట్ర ప్రజలకు మిగిలేది ఏంటని ప్రశ్నించారు.  ఒక్కొక్క టీడీపీ నేత రూ.200 కోట్లకు పైగానే దోచుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 

టీడీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అవమానకరంగా పాలన సాగిస్తుందని రమేష్‌ మండిపడ్డారు. 2001 నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. రాజకీయంగా తనను చంద్రబాబు నిరాశపరిచారన్నారు. 1999లో గన్నవరం అసెంబ్లీ, విజయవాడ పార్లమెంట్‌ ఈ రెండు సీట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. అప్పటి నుంచి టీడీపీపై విరక్తి చెందానని చెప్పారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలకు ఆకర్శితుడిని అయినట్లు చెప్పారు. చేసిన వాగ్ధానాలు నెరవేర్చుతారని నమ్ముతున్నానని చెప్పారు. టీడీపీకి 30 ఏళ్ల పాటు సేవ చేశానని, ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి తాను సాయం చేశానని తెలిపారు. అహర్నిశలు టీడీపీకి సేవ చేశానని, ఆ పార్టీ నుంచి ఆశించలేదన్నారు. త్వరలోనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. 

 

Back to Top