పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో టీడీపీ గూండాగిరి మరోసారి బయటపడింది. రామాపురం గ్రామ ఎంపీటీసీ అకూరి వెంకటరెడ్డిపై రోడ్డుపై వెళ్తుండగా కారులో వచ్చిన టీడీపీ గూండాలు అడ్డగించి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో అకూరి వెంకటరెడ్డి చేయి, కాలు విరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రజాప్రతినిధులపైనే ఇలాంటి దాడులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సూచిస్తోందని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని దాడులు, బెదిరింపులు పెరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పల్నాడు జిల్లాలో ఇటీవల వైయస్ఆర్‌సీపీ దళిత నాయకుడు మందా సాల్మన్‌ను టీడీపీ గూండాలు హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే ఇప్పుడు మరో దాడి జరగడం ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. చట్టం చేతుల్లోకి తీసుకునే ధైర్యం టీడీపీ గూండాలకు ఎలా వస్తోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాని ఫలితంగానే ఇటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయని వైయస్ఆర్‌సీపీ ఆరోపించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే శాంతిభద్రతలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని, లేకపోతే ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తారని హెచ్చరించారు. ఈ ఘటనపై వెంటనే నిష్పక్షపాత విచారణ జరిపి, దాడికి పాల్పడిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.