డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే 'పోసాని' అరెస్ట్

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి మళ్ళించే యత్నం

మాజీ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం

రాజమహేంద్రవరం: ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి ప్రతిసారీ అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారని వైయస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమహేంద్రవరం రూరల్ పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల సందర్బంగా గవర్నర్ తో చెప్పించిన అబద్దాలు, ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు వైయస్ఆర్సీపీ ప్రశ్నలకు  సమాధానం చెప్పలేని స్థితి నుంచి బయటపడేందుకు తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను తెరమీదికి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ వేధింపులకు వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళిని నిన్న ఆఘమేఘాల మీద హైదరాబాద్ కు పోలీసులను పంపి అరెస్ట్ చేశారు. కానీ ఎఫ్ఐఆర్ లో మాత్రం ఈ రోజు తేదీ వేసి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై బీఎన్ఎస్ 111 సెక్షన్ ను ఇష్టం వచ్చినట్లు ప్రయోగించకూడదని న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. కావాలనే సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై ఒకటి కంటే ఎక్కువ కేసులు పెట్టి, అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ రోజుల తరబడి తిప్పి వేధిస్తున్నారు. ఈ రాష్ట్రంల మహిళలు, చిన్నారులపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతుంటే, శాంతిభద్రతలు లేకుండా పోతుంటే దానిని నియంత్రించేందుకు పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించకుండా, రాజకీయ వేధింపులు, కక్షసాధింపులకు వాడుతున్నారని చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. 

Back to Top