శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ ఉండ‌దు

ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తాం

రాష్ట్ర హోంమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తానేటి వ‌నిత‌

స‌చివాల‌యం: రాష్ట్ర‌ హోంశాఖ మంత్రిగా తానేటి వనిత బాధ్యతలు చేపట్టారు. స‌చివాల‌యంలో త‌న చాంబ‌ర్‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం హోంమంత్రిగా తానేటి వ‌నిత బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనంత‌రం మంత్రికి ప‌లువురు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వ‌నిత‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని, న్యాయం, చట్టం వివక్ష లేకుండా అందిస్తున్న ప్రభుత్వంలో.. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామన్నారు. పోలీస్ శాఖలో మూడు ఏళ్లుగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చారని గుర్తుచేశారు. 

టెక్నాలజీ వినియోగంలోనూ ఏపీ పోలీస్ విభాగం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింద‌ని హోంమంత్రి తానేటి వ‌నిత అన్నారు. రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తామ‌ని, మహిళలపై నేరాల నియంత్రణకు కృషిచేస్తాన‌న్నారు. `దిశ` చట్టం కేంద్రంలో పెండింగ్‌లో ఉన్నా అందులోని అంశాలను అమలు చేస్తున్నామ‌ని వివ‌రించారు. `దిశ` యాప్ ద్వారా 900 మందికిపైగా ఆడపిల్లల్లను కాపాడామ‌ని, పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, ఫ్రెండ్లీ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అమలును కొనసాగిస్తామ‌న్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తామ‌న్నారు.

Back to Top