తాడేపల్లి: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైయస్ఆర్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని.. కార్మిక, ప్రజా సంఘాలతో కలిసి ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్దమని వైయస్ఆర్‌టీయుసీ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వల్లే గత ఐదేళ్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్లాంట్ కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేంద్రంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేయించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఇంకా ఏమన్నారంటే... స్టీల్ ప్లాంట్‌లో 32 విభాగాల ప్రైవేటీకరణ: ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని చెప్పి ఓటేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకేస్తున్నా పట్టించుకోవడం లేదు. సెప్టెంబర్ 9, 2025 నాటికి స్టీల్ ప్లాంట్ లో 32 విభాగాల ప్రైవేటీకరణ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 20 వేల మంది ఉద్యోగులు కలిగిన ఈ ప్లాంట్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్లాంట్ ను నిర్వీర్యం చేయడంతో పాటు కార్మికులను తొలిగించుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీఆర్ ఎస్ కింద ఇప్పటివరకు 1150 మంది ఉద్యోగులను తొలగించగా... తాజాగా నోటీసులిచ్చి మరో 1000 మందిని వీఆర్ఎస్ ఇచ్చి తొలగించాలని చూస్తున్నారు. ఏడాదిలోనే దాదాపు 8-9 వేల మంది అన్ని రకాల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటికీ పూర్తి జీతాలు చెల్లించడం లేదు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో ఎవరూ ఉండకూడదన్న లక్ష్యంతో క్వార్టర్స్ లో ఉండే సిబ్బందికి గతంలో సబ్సిడీ మీద 49 పైసలకే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తే.. నేడు యూనిట్ ధరను ఏకంగా రూ.8 కి పెంచారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అండగా వైయస్ఆర్ టీయూసీ: స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉద్యమానికి వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ మొదటి నుంచి అండగా నిలబడి మద్దతిస్తూ వచ్చింది. నాటి సీఎం వైయస్ జగన్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్న కార్మికులకు అండగా నిలిచారు. ఉద్యోగులను పిలిపించి వారితో నేరుగా మాట్లాడారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేశారు. అప్పును ఈక్విటీగా మార్చమని కేంద్రానికి లేఖ రాశారు. ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగుల మీద కేసులు నమోదు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలలుగా స్టీల్ ప్లాంట్ కార్మికులపై వేధింపులు ఎక్కువైపోయాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఎదురుగా 1300 రోజులుగా ఉద్యోగులు ఆందోళనకు వేదికగా నిలిచిన టెంట్ ను కూడా ఎత్తేయించారు. ఆందోళనకు చేయడానికి వీల్లేదని హెచ్చరిస్తూ అక్కడే పోలీస్ పోస్టు ఏర్పాటు చేశారు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అలాంది దుశ్చర్యలకు పాల్పడలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లేస్తే ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు ఒక్కసారైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంతో మాట్లాడి ఒప్పించలేకపోయారు. కార్మికుల నుంచి ఒత్తిడి పెరగడంతో రూ.11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించి హడావుడి చేశారు. కానీ అందులో కేవలం రూ.7వేల కోట్లు ఇచ్చారు. దీనిలో రూ.500 కోట్లు వీఆర్ ఎస్ తీసుకున్న ఉద్యోగుల ప్యాకేజీ కోసం వాడగా, మిగిలిన డబ్బు బ్యాంకులకు చెల్లిస్తున్నారు. ఈ ప్యాకేజీ వల్ల కార్మికులకు ఒరిగిందేమీ లేదు. వైయస్ఆర్‌సీపీ డిమాండ్లు: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 32 విభాగాల ప్రైవేటీకరణ కోసం టెండర్లు పిలుస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకులకు కట్టాల్సిన అప్పులను ఈక్విటీల కిందకి మార్చాలి. స్టీల్ ప్లాంట్‌కి సొంతంగా గనులు కేటాయించాలి. కాంట్రాక్టు కార్మికుల తొలగింపులను ఆపేసి వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా నియమించాలి. గనులు పుష్కలంగా ఉన్న సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేయాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. లీవ్ ఎన్ క్యాష్ మెంట్, ఇంటెన్సివ్ లు, ఎల్ టీసీ, ఎల్ ఎల్ టీసీలు తొలగించారు. వెంటనే పునరుద్ధరించాలి. ఉద్యోగులు దాచుకున్న రూ. 150 కోట్ల డబ్బును తక్షణం ప్లాంట్ యాజమాన్యం చెల్లించాలి.