ప్రత్యేక హోదా ఎప్పటికైనా సాధించి తీరుతాం

మేధోమథన సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ప్రత్యేక హోదాను ఎప్పటికైనా సాధించి తీరుతామని, ఈరోజు కాకపోయినా కేంద్రం మనపై ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుందని, వచ్చిన ఆ రోజున ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామనే మన ఆలోచన ముందుకు తీసుకువస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘మనపాలన – మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పరిశ్రమలు, పెట్టుబడులపై సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన మేధోమథన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా అంశం గురించి వివరించారు. 

‘రాష్ట్రం విడిపోయిన తరువాత మనరాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పకతప్పదు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్‌ స్టేషన్‌ ఇస్తామని మాటిచ్చి దాని తరువాత ఇవ్వకుండా పోయిన పరిస్థితి కళ్ల ముందే కనిపించాయి. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఇండస్ట్రీ ఇన్సెన్టివ్స్‌ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చిఉండేవి. కేంద్ర ప్రభుత్వం భారాన్ని పంచుకునేది. అప్పుడు ఇన్‌కంట్యాక్స్, జీఎస్‌టీ మినహాయింపులు ఇటువంటివి అనేకం వచ్చి ఉండేవి. వాటివల్ల ఇంకా పరిశ్రమలకు ప్రోత్సాహం ఎక్కువ ఉండేది. 

దురదృష్టవశాత్తు 2014–19 వరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా కూడా ప్రత్యేక హోదాను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. దాని తరువాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మన పార్టీ ఘన విజయాన్ని సాధించింది. 25కు 22 పార్లమెంట్‌ సీట్లు, 175 అ సెంబ్లీ సీట్లకు 151 సీట్లను స్వీప్‌ చేయగలిగాం. ఇటువంటి మెజార్టీ వచ్చినప్పుడు కేంద్రంలో వారికి సంపూర్ణమైన మెజార్టీ రాకపోయి ఉండి ఉంటే రాష్ట్రానికి బెనిఫిట్స్‌ వచ్చేవి. మనం ఎవరికి సపోర్టు చేయాల్సి వచ్చినా ప్రత్యేక హోదా డిమాండ్‌ను వారి ముందు పెట్టేవాళ్లం. దురదృష్టవశాత్తు అది జరగలేదు. కేంద్రంలో ఎన్డీయే సంపూర్ణ మెజార్టీ సాధించింది. కాబట్టి మనతో వారికి అవసరం.. పని కూడా లేకుండా పోయింది. 

ప్రత్యేక హోదా మళ్లీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో ఉన్నాం. కానీ, హోదా అడగడం మానేస్తే అది ఏ రోజూ మనకు రాదు అనే సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఈ రోజుకు కాకపోతే రేపయినా వస్తుంది. ఈరోజు కాకపోయినా కేంద్రం మనపై ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన ఆ రోజున ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామనే మన ఆలోచన ముందుకు తీసుకువస్తాం. ప్రత్యేక హోదా సాధించి తీరుతా’మని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. 
 

Back to Top