పళ్లు ఇచ్చే చెట్టుమీదే రాళ్లేస్తున్నారు

ప్రతిపక్షం కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది

ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగాం

వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నాం

ఇసుక వారోత్సవాలు పెట్టి.. వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దాం

కార్మికులకు పనులు దొరకడం లేదన్నది అవాస్తవం

ఒక్క లారీ ఇసుక కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదు

‘స్పందన’ సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

 

సచివాలయం: వ్యవస్థలన్నింటినీ గత ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. వాటిని పూర్తిగా రిపేర్‌ చేస్తున్నాం. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఇసుక తవ్వకాలు, పంపిణీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారు. పళ్లు ఇచ్చే చెట్టు మీదే రాళ్లు వేస్తున్నారని ఇసుక వ్యవహారంపై సీఎం వ్యాఖ్యానించారు.

‘ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగామని గర్వంగా చెప్పగలం. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు వస్తున్నాయి. వర్షాలు కురవడం రైతులకు మంచిదే. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదే. కానీ రాబంధుల మాదిరిగా మనపై రాళ్లు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోంది. వరదల వల్ల 90 రోజుల్లో ఇసుక ఆశించిన స్థాయిలో తీయలేకపోతున్నాం.

వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నాం. ఇసుక వారోత్సవం అని కార్యక్రమం కూడా పెడతాం. వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దాం. ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా వెళ్లకూడదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహారా ఉండాలి. డీజీపీ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాలి. మనం ఎంత బాగా పనిచేసినా మనపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అందుకే మనం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.

భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు పని దొరకడం లేదన్నది సరికాదు. గతంలో అవినీతి మాఫియాతో ఇసుకను తరలించేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే ఇసుక రవాణా జరుగుతుంది. ఇప్పుడు మరింతగా కార్మికులకు పనులు లభిస్తాయి. పట్టా భూములున్న రీచ్‌ల్లో తప్ప మిగతా చోట్ల ఇసుక తీయాలని చెప్పాం. గ్రామ సచివాలయాల్లో ఎవరైనా చలానా కట్టి 20 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్‌ ద్వారా ఇసుక తరలించవచ్చు. పనులు కావాల్సిన వారు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక రీచ్‌ల్లో పనులు చేసుకోవచ్చు. వరదలు తగ్గగానే రీచ్‌ల్లో ఎవరు పనులు అడిగినా ఇవ్వాలి. ప్రభుత్వ ఆధీనంలోనే ఇసుక రవాణా జరుగుతుంది కాబట్టి పేదలకు మరింత మంచే జరుగుతుంది. ప్రతిపక్షం కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంది. కౌలు రైతులకు సాయం చేశాం కాబట్టి పనులు కల్పించే అవకాశం ఉంటుంది. వరదల కారణంగా 267 రీచ్‌లకు 69 చోట్ల ఇసుక తీస్తున్నారు. నవంబర్‌కు వరదలు తగ్గుతాయి.. ఇసుక అందుబాటులోకి వస్తుంద’ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు.

 

Read Also: డిసెంబర్‌ 3న ‘వైయస్‌ఆర్‌ లా నేస్తం’

తాజా ఫోటోలు

Back to Top