ఇళ్ల పట్టాల దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేయాలి 

స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్‌ సమీక్ష

మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే బ్యాంకర్లు రుణాలు

పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటివిడతలో 15.6 లక్షల ఇళ్లు

ఆప్షన్‌ -3ని ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభం

 తాడేపల్లి : నెల రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టుల్లో పెండింగ్‌ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు లే అవుట్ల వారీగా వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెండింగ్‌ దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేయాలని తెలిపారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌​ పథకంలో రిజిస్ట్రేషన్‌ పట్టాలిచ్చే కార్యక్రమం డిసెంబర్‌లోగా చేయాలన్నారు. లే అవుట్లలో విద్యుత్‌, నీటి వసతిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. వారానికొకసారి ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్లు సమీక్ష చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

హౌసింగ్‌:
నెల రోజుల్లో ఈ కేసులన్నీ పరిష్కారమవుతాయని ఆశిస్తున్నానని సీఎం వైయస్ జగన్‌ తెలిపారు. పెండింగ్‌ కేసుల్లో 395 కేసులు తాత్కాలిక స్టేలు ఉన్నాయని చెప్పారు. వాటిపైన కూడా దృష్టిపెడితే.. పేదలకు మేలు జరుగుతుందని, లే అవుట్‌ వారీగా, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్‌ చేశామని అన్నారు. ప్రభుత్వం తయారు చేసిన యాప్‌లో ఈ వివరాలన్నింటినీ ఉంచాలని తెలిపారు. లే అవుట్ల వారీగా వివరాలు తెలపాలని అధికారులను సీఎం వైయస్ జగన్‌ ఆదేశించారు. దాని వల్ల మిగిలిన ప్లాట్లను కొత్తగా లబ్ధిదారులకు కేటాయించడానికి వీలు కలుగుతుందన్నారు. మిగిలిపోయిన 12.6 శాతం మ్యాపింగ్‌ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. ఇళ్ల పట్టాల కోసం పెట్టుకున్న దరఖాస్తుల్లో పెండింగు ఉంటే వెంటనే వెరిఫికేషన్‌ పూర్తిచేయాలన్నారు. 

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
వారికి ఇదివరకే ఉన్న లే అవుట్లలో 45,600 మందికి, ప్రభుత్వ లే అవుట్లలో 10,851 మందికి  డిసెంబర్‌లో పట్టాలు అందించాలన్నారు. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్‌లో చేయాలని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్‌ అయ్యాయని, అక్టోబరు 25 నాటికల్లా బిలో బేస్‌మెంట్‌ లెవల్‌ ఇళ్లను బేస్‌మెంట్‌లెవల్‌పై స్థాయికి తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

ఆప్షన్‌ -3ని ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు అక్టోబరు 25 నుంచి మొదలుపెట్టడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులతో కలిపి గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారని, ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలన్నారు. లే అవుట్లలో నీటి వసతిని ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు. మిగిలిపోయిన లే అవుట్లలో విద్యుత్తు, నీటి వసతిని కల్పించడంపై దృష్టిపెట్టాలని అధికారునుల ఆదేశించారు. సిమెంటు, బ్రిక్స్, ఐరన్‌ స్టీల్, మెటల్‌.. వాటి వినియోగం విపరీతంగా పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని తెలిపారు. ఆప్షన్‌ –3 ఎంచుకున్న ప్రాంతాల్లో 1.75 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని తెలిపారు. బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారికి రుణాలు అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. 

కలెక్టర్లు వారానికి ఒకసారి ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేయాలన్నారు. సంబంధిత శాఖలతో కలిపి సమీక్ష చేయాలన్నారు. మున్సిపాలిటీ స్థాయిలో, మండలాల స్థాయిలో, పంచాయతీల స్థాయిలో, లే అవుట్‌ స్థాయిల్లో కూడా సంబంధిత అధికారులు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై రివ్యూ చేయాలన్నారు. అలా చేయగలిగితేనే వేగంగా నిర్మాణాలు సాగుతాయని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తేనే అక్కడ సమస్యలు ఏంటో తెలుస్తాయన్నారు.  పెద్ద లే అవుట్లలో నిర్మాణసామగ్రిని ఉంచడానికి, సైట్‌ ఆఫీసులకోసం గోడౌన్లను నిర్మించాలని తెలిపారు. ఉపాధిహామీ పనుల కింద ఈ గోడౌన్లను నిర్మించాలని సీఎం పేర్కొన్నారు. 

ఉపాధి హామీ
సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, బీఎంసీయూలు, డిజిటల్‌ లైబ్రరీల పనులు చురుగ్గా సాగాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం ఇవ్వని బిల్లులకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తోందని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికంగా ఖర్చు చేశామని తెలిపారు. నిధులకు ఇబ్బంది లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన కూడా దృష్టి పెడుతున్నామని తెలిపారు. కలెక్టర్లు ఈ పనులపై దృష్టిపెట్టి ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఏపీడీసీ వైస్ చైర్మన్, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయతీరాజ్‌ కమిషనగర్‌ గిరిజాశంకర్, డీఐజీ (దిశ) బి రాజకుమారి, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఇతర  ఉన్నతాధికారులు హాజరయ్యారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top