వైయస్ఆర్ జిల్లా: తన భర్తను నవంబర్ 11వ తేదీన అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నది పూర్తిగా అబద్ధమని సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి భార్య వర్రా కళ్యాణి చెప్పారు. ఈ మేరకు శనివారం వర్రా కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ‘కర్నూలు టోల్‌ప్లాజా వద్ద నవంబర్ 8వ తేదీన నా భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియో మీడియాకి విడుదల చేస్తున్నాను. మూడు రోజులు నా భర్తను చిత్రహింసలకు గురిచేసి తప్పుడు వాగ్మూలం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు కూడా రవీంద్రారెడ్డి చెప్పారు. నా భర్తకు జరిగిన అన్యాయం ప్రజలందరికీ తెలియాలి. అదుపులోకి తీసుకునే వరకూ పోలీసులకు వర్రా రవీంద్రారెడ్డి ఎవరో కూడా తెలియదు. మాస్కులు వేసి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పారని మెజిస్ట్రేట్ ముందు నా భర్త వాంగ్మూలం ఇచ్చారు. విపరీతంగా రవీంద్రారెడ్డిని కొట్టారని పక్కన ఉన్నవాళ్లు ఉదయ్,సుబ్బారెడ్డి చెప్తున్నారు. పోలీసులు తాము చెప్పినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని చిత్రహింసలు పెట్టారు. నా భర్తకు న్యాయం జరగాలి..స్వయంగా నేను గాయాలు చూశాను. అంత చిత్ర హింసలు పోలీసులు ఎందుకు పెట్టారు? వాళ్ళకు పై నుంచి ఉన్న ఒత్తిడి వల్లే ఇలా చిత్రహింసలు పెట్టారు. ఒప్పుకోకపోతే మీ భార్య,పిల్లలపై కూడా కేసులు పెడతామన్నారు. మా ఆయన ప్రశ్నించారంతే..అసభ్య పోస్టులు పెట్టలేదు. ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి నా భర్త పేరుపై 18 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు పెట్టాడు’అని వర్రా కళ్యాణి తెలిపారు.