వెనకబడిన వర్గాలు తల ఎత్తుకొని తిరిగేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీ బెంబేలు

అందుకే దళితులపై దమనకాండ అంటూ ఈనాడు అడ్డగోలు రాతలు

ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే రామోజీకి పరాభవం తప్పదు

దళితులపై దమనకాండ జరిగింది బాబు హయాంలోనే..

దళితులను అడ్డుపెట్టుకుని మా ప్రభుత్వంపై బురదచల్లుతావా..?

టీడీపీ హయాంలో కారంచేడు, దళితుల ఊచకోత ఘటనలపై రామోజీ ఎందుకు కథనాలు రాయలేదు..?

గరగపర్రులో దళితుల వెలివేత, పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనలు రామోజీ కళ్ళకు కనిపించలేదా ..?

అచ్చెన్న మహిళను కాలితో తంతే.. మీకు ముచ్చటగా అనిపించిందా..?

చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం ఉండవల్లి శ్రీదేవి మాటలు

రాజకీయాల్లో అవకాశం కల్పించిన నాయకుడిని ఉండవల్లి శ్రీదేవి మోసం చేసింది

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజం

సచివాలయం: వెనకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైయస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వెన్నుదన్నుగా ఉంటున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ పరిపాలనలో భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. దళితులు తల ఎత్తుకొని తిరిగేలా సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారన్నారు. పల్లెల్లోకి వెళితే కుటుంబాలన్నీ మేమంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే అని చెబుతున్నాయన్నారు. పచ్చపత్రికలు పిచ్చిరాతలు మానుకోవాలని హెచ్చరించారు. సచివాలయంలో మంత్రి మేరుగ నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. 

మంత్రి మేరుగు నాగార్జున ఇంకా ఏమన్నారంటే..

రామోజీరావు, ఈనాడు పేపర్‌ పెట్టుకున్న తర్వాత ఇన్నేళ్లకు దళితులు గుర్తుకొచ్చారా..? ఈరోజు రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నట్లు కథనాలు రాయడానికి ఆయనకు సిగ్గుందా..? అని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో దళితులపై ఏ విధంగా దాడులు, అఘాయిత్యాలు, వెలివేతలు, జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసిన సంఘటనలపై కథనాలను ఎందుకు రాయలేదు రామోజీ..? ఇదేనా మీ జర్నలిజం విలువలు..?. కారంచేడులో దళితులపై దాడులు జరిగినప్పుడు.. అప్పుడు జరిగిన అగ్రవర్ణాల అహంకారం గురించి ఈనాడు ఎందుకు రాయలేదు..? ఆరోజు దళితులపై జరిగిన దమనకాండకు కారకులైన వారి గురించి ఇప్పుడు రాయొచ్చు కదా.. రామోజీరావు సొంత సామాజికవర్గానికి చెందిన వారు దళితులపై మారణకాండ జరుపుతున్నప్పుడు .. ఇది తప్పు అని ఎందుకు రాయలేదు..? అని ప్రశ్నిస్తున్నాను. 

బాబు, రామోజీ ముసుగుదొంగలు..
ఎందుకంటే.. తన రాతలతో చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి జరగాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఈనాడు ముసుగులో నువ్వు వ్యాపారాలు చేయాలి. మార్గదర్శి ఎవరిది..? అందులో వ్యాపార భాగస్వాములు ఎవరు..? ఎవరి డబ్బులతో రామోజీరావు వ్యాపారం చేస్తున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో.. ప్రస్తుతం సీఐడీ  ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. రేపు మార్గదర్శి కేసులో ఈనాడు రామోజీరావు ప్రధాన ముద్దాయి అవుతున్నాడని .. ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు.  అందుకే,  ఇప్పుడు దళితులపై దాడులంటూ.. తప్పుడు కథనాలు రాస్తున్నాడనేది పచ్చి నిజం. 
- మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల డొంక కదిలేకొద్దీ.. రామోజీకి బుర్ర పనిచేయడం లేదు. 
- మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో.. జనం సొమ్మును తన వేరే వ్యాపారాలకు విస్తరించి, చిట్స్ వేసిన ఖాతాదారుల జీవితాలతో చెలగాటమాడుతున్నది రామోజీనే.
- రామోజీ చిట్స్- చీటింగ్ బాగోతాన్ని సీబీసీఐడీ అధికారులు తవ్వి తీస్తుంటే.. ఆయనకు, ఆయనకు వకాల్తా పలుకుతున్న చంద్రబాబు, దుష్ట చతుష్టయానికి కడుపు రగిలిపోతుంది.

ఫిల్మ్ సిటీలో దళితుల భూములు కొట్టేసిన రామోజీరావు
రామోజీఫిల్మ్‌సిటీ నిర్మాణానికి సంబంధించి దళితుల భూముల్ని కబ్జా చేసినట్లు రామోజీరావుపై పలు కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పటికీ కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి ఈరోజు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు,  ఈ రాష్ట్రంలో ఎవరో దళిత డాక్టర్లపై దాడులు జరుగుతున్నట్లు తప్పుడు రాతలతో నీచమైన మనస్తత్వాన్ని రామోజీరావు ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇటువంటి దౌర్భాగ్యపు రాతలతో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ లకు రాజకీయంగా పట్టం కట్టాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలించేదే లేదు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక దొంగ అయితే.. ఆయన్ను భుజానెత్తుకుని విషపురాతలు రాసే రామోజీరావేమో గజదొంగ అని చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టే రాతలు మానుకోకపోతే ఈనాడు రామోజీరావుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాను. 

చంద్రబాబు హయాంలో దళితులపై అరాచకాలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితులు అలో లక్ష్మణా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులు, అఘాయిత్యాలు జరిగినప్పుడు పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిరిగి కేసులు పెట్టమని రోధిస్తే ఏ ఒక్కడూ పట్టించుకున్న దాఖలాల్లేవు. అచ్చెన్నాయుడు మహిళను కాలుతో తంతే ఎందుకు కేసు పెట్టలేదు..? గరగపర్రులో దళితులు వెలివేత కేసు ఏంచేశారు..? పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన కేసుకు సంబంధించి పెందుర్తి పోలీసుస్టేషన్‌ ముందు ధర్నాకు దిగితే.. ఆ కేసుల్ని ఏం చేశారు..? వాటిని ఎందుకు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు..?  ఈ ఘటనలపై ఈనాడులో వరుస కథనాలు ఎందుకు రాయలేదో.. రామోజీరావు సమాధానం చెప్పాలి..? ఇవన్నీ ఈనాడుకు ముచ్చటగా అనిపించాయా..? 

దళితుల మేలుపై చర్చకొస్తారా..?  
రాష్ట్రంలో ఈరోజు  గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతోంది. రాజ్యాంగబద్ధంగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానంతో సుభిక్షమైన పరిపాలన అందజేస్తుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా సంక్షేమపథకాలతో సంతోషంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత దళితుల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం గురించి మంచిగా ఆలోచించే ముఖ్యమంత్రి వచ్చారని సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతీ పేదోడి ఇంట్లో దేవుడుగా కొలుస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబుకు, రామోజీరావుకు కన్నుకుట్టే విషయమైంది. దళితుల రక్షణకు, వారి మేలుకు మేం బాధ్యతగా పనిచేస్తున్నామని దమ్ముగా చెబుతున్నాను. అడ్డగోలు రాతలకు, నీచమైన రాతలకు ఈనాడు వేదికగా ఉంది. దళితులకు ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో...  మీరు చర్చకు రాగలరా..?

అట్రాసిటీ అంటే అర్థ‌మేంటి..?
ఈనాడు మాత్రం ‘దళితులపై దమనకాండ’ అంటూ విషప్రచారానికి పూనుకుంటుంది. అసలు అట్రాసిటీ అంటే రామోజీరావు దృష్టిలో ఏంటి..? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీషుమీడియం తీసుకొచ్చి పేదపిల్లలకు చదువు చెప్పడాన్ని అట్రాసిటీ అంటారా..? రాజధాని ప్రాంతంలో భూముల్ని పేదలకు ఇస్తామంటే.. ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని టీడీపీ అడ్డుకోవడాన్ని అట్రాసిటీ అంటారా..? కొన్ని లక్షల కోట్లు డీబీటీ రూపంలో దళితులకు సంక్షేమపథకాల కింద నేరుగా మా ప్రభుత్వం అందజేస్తుంటే అది అట్రాసిటీనా..?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 68శాతం రాజకీయ పదవులిచ్చి అత్యున్నత స్థానాల్లో నిలబెట్టడాన్నిరామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తున్నాయా.?. పేదోడికి గూడును కల్పిద్దామని.. వారికి ఉచితంగా ఇంటి స్థలమిచ్చి రుణసాయంతో ఇల్లు నిర్మించడమే కాకుండా వారికి ఉపాధిచూపాలని తపనపడే ప్రభుత్వం మీకు అట్రాసిటీకి పాల్పడుతున్నట్లు కనిపిస్తుందా..?  పేదవాళ్లకు సాయం చేయడం అనేది నీకు, నువ్వు అండగా ఉండే నీ నాయకుడు చంద్రబాబుకు చేతగాదు. పేదవాళ్లను అక్కునజేర్చుకుని భావితరాల భవిష్యత్తుకోసం మా ప్రభుత్వం గొప్ప పరిపాలన అందిస్తుంటే.. అది రామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తుందా..?

దళితులు ఎప్పటికీ కూలోళ్ళుగానే బతకాలా రామోజీ..?  
ఎస్సీ, ఎస్టీలు పనివాళ్లుగా ఉంటే చంద్రబాబు, రామోజీరావు సామాజికవర్గమే పరిపాలన చేస్తూ దళితుల మీద పెత్తనం చే స్తారా..? దళితుల మేలు జరగడం అంటే..  ఈనాడు రామోజీరావు దృష్టిలో మేమంతా  కూలోళ్లుగానే బతకడమా..?  ఇలాంటి తప్పుడు రాతలు రాసేటప్పుడు .. బాధ్యత లేకుండా రాతలు రాసేటప్పుడు సిగ్గూశరం గుర్తుకురావా..? ఈనాడు పత్రికకు విలువలు, విశ్వసనీయత ఉండవా.? అని నిలదీస్తున్నాను. దివంగ‌త మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విలువల్ని పుణికిపుచ్చుకున్న మా నేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆనందంగా.. గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా బతుకుతున్నారు. ఇదే విషయాన్ని మేం గర్వంగా దమ్ముగా చెప్పుకుంటున్నాం. 

దళితులకు ‘బాబు’చేసిన మోసం గురించి ఎందుకు రాయవు..?
చంద్రబాబు  హయాంలో 5 ఏళ్ళలో, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.33,625.49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపితే.. ఆ డబ్బు దళితులకు దేనికోసం ఖర్చుచేశారో.. అందులో అవినీతి ఎంత జరిగిందో.. ఎంతమంది చేతులు మార్చుకున్నారో.. ఈ కుంభకోణాలపై కథనాలు రాసే దమ్ము రామోజీరావుకు ఉందా..? అని అడుగుతున్నాను. అదే మా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలనలో ఫిబ్రవరి మాసాంతానికి దళితుల సంక్షేమానికి రూ.51,293 కోట్లు ఖర్చుచేశాం. డీబీటీ ద్వారా ఒక్క పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయితే.. వీటిమీద రాతలు రాయడానికి చేతులు కదలడం లేదా రామోజీరావు..? అని అడుగుతున్నాను. 

తప్పుచేసింది కాబట్టే ఎమ్మెల్యే శ్రీదేవికి భయం

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తప్పు చేశారు కనుకనే ఈరోజు భయపడుతున్నారేమో.. ఆమె చంద్రబాబు వలలో చిక్కుకున్నారు. వైయ‌స్‌ఆర్‌సీపీ జెండాపై గెలిచి వెన్నుపోటు పొడిచి పక్క పార్టీల్లోకి వెళ్లిన వారి భవిష్యత్తు ఇప్పుడెలా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు శ్రీదేవి మాట్లాడుతున్న మాటలన్నీ చంద్రబాబు స్క్రిప్టుగానే చూడాలి. అనామకులను కూడా రాజకీయాల్లో ఉన్నత పదవులు కల్పించి నాయకుల్ని చేసిన ఘనమైన చరిత్ర డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర‌రెడ్డి కుటుంబానికి ఉంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మనసున్న మా నాయకుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి మమ్మల్ని ఎంతగానో ఆదరించి అక్కునజేర్చుకుంటే చంద్రబాబుకు కన్నుకుడుతుంది. అందుకే ఎమ్మెల్యే శ్రీదేవి లాంటి వారిని రాజకీయంగా ప్రలోభపెట్టి, తన పంచన చేర్చుకుంటున్నాడు. ఆమె మా పార్టీకి ద్రోహం చేసినందుకు మేమంతా బాధపడుతున్నాం.

Back to Top