వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై ఎస్‌ఐ దాష్టీకం

గుంటూరు: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుల అడుగులకు మడుగులొత్తి వైయ‌స్సార్‌సీపీ కార్యకర్తలపై వేధింపులు, దాడులకు పాల్పడుతూ వచ్చిన కొందరు పోలీసులు ఇంకా అదే తీరు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా డోకిపర్రులో జరిగిన ఈ ఉదంతం ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకి వెళితే.. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వైయ‌స్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని కొందరు చిన్న గొడవను ఆసరాగా చేసుకుని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ప్రోద్బలంతో రౌడీషీట్‌ తెరిపించారు. అప్పట్లో టీడీపీకి చెందిన రౌడీషీటర్లు ఏడాదిపాటు స్టేషన్‌కు రాకపోయినా పోలీసులు వదిలేశారు.  ప్రస్తుతం శ్రీరాములు ప్రతి ఆదివారం స్టేషన్‌కు వెళ్లి సంతకాలు పెడుతున్నారు.

అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఒక కానిస్టేబుల్‌తో సన్నిహితంగా ఉంటూ శ్రీరాములు పేకాట ఆడిస్తున్నాడని ఎస్‌ఐకి చెప్పించాడు. శ్రీరాములు సంతకం చేసేందుకు ఆదివారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా.. ఆ సమయంలో ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ జీపులో వచ్చీ రావడంతోనే బూతులు తిడుతూ.. మరో కానిస్టేబుల్‌ చేత శ్రీరాములు మెడ వంచి, చేతులు వెనక్కు విరిచి పిడిగుద్దుల వర్షం కురిపించారు. తాను మధుమేహంతో బాధపడుతున్నానని, కిడ్నీ పేషెంట్‌నని శ్రీరాములు చెప్పినా ఎస్‌ఐ ఆలకించలేదు. ఇటీవల కిడ్నీ ఆపరేషన్‌ చేయించుకున్న శ్రీరాములు ఎస్‌ఐ కురిపించిన పిడిగుద్దులతో స్పృహ కోల్పోయారు. అతడిని గ్రామంలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఇంటికి తీసుకెళ్లి ప్రయివేటు వైద్యుడితో చికిత్స చేయిస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌ బయట అందరూ చూస్తుండగా తనపై ఎస్‌ఐ దాడి చేశారని, తనకు ఆత్మహత్యే శరణ్యమని శ్రీరాములు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై గుంటూరు సౌత్‌ డీఎస్పీ ఎం.కమలాకరరావును వివరణ కోరగా.. ఎస్‌ఐ దాడి చేసిన విషయం తమ దృష్టికి రాలేదన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. 
 

Back to Top