ఏపీలో ఎలాంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేదు

దాడుల, విధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలి

ఢిల్లీలో వైయ‌స్ఆర్ సీపీ ధ‌ర్నాకు శివ‌సేన నేత, ఎంపీ సంజ‌య్ రౌత్‌ మ‌ద్ద‌తు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గత 45 రోజులుగా నరమేధం కొనసాగుతోందని, ఈ రాజకీయ కక్ష సాధింపు దేశానికే మంచిది కాద‌ని శివ‌సేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజ‌య్ రౌత్ మండిప‌డ్డారు. ఢిల్లీలో వైయ‌స్ఆర్ సీపీ నిరసన కార్యక్రమానికి సంజ‌య్ రౌత్ హాజ‌రై ఫొటో గ్యాలరీని సందర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నెల‌కొన్న కూట‌మి ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని స్పష్టం చేశారు. 

సంజయ్‌ రౌత్‌ ఏమన్నారంటే..
మా మిత్రుడు వైయస్‌ జగన్‌కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ, ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో గత 45 రోజులుగా నరమేధం కొనసాగుతోంది. ఈ రాజకీయ కక్ష సాధింపు ఏదైతే ఉందో.. అది దేశానికే మంచిది కాదు. దేశంలో కేంద్ర హోం మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ ఉంటే.. వెంటనే స్పందించాలి. ప్రత్యేక బృందాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి పంపాలి. అక్కడ జరుగుతున్న దాడుల, విధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలి. ఈ చిత్రాలు, వీడియోలు చూసిన తరవాత.. మేము ఒక విషయం స్పష్టం చేయదల్చాము. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేదు. అందుకే మేము వైయ‌స్ జగన్‌కి, ఆయన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. వారి పోరాటానికి అండగా నిలబడతాం.

Back to Top