తాడేపల్లి: వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఆదర్శంగా తీసుకుంటామని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ వైయస్ జగన్‌ను టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఓటర్లలో చైతన్యం తీసుకురావడం అందరి బాధ్యత అన్నారు. బీసీలను టీడీపీ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబువన్నీ కూడా దుర్మార్గపు ఆలోచనలే అన్నారు. మేం భయపెడుతున్నామని దుష్ర్పచారం చేస్తున్నారని ఖండించారు. ఏదో విధంగా అన్నింటిని అడ్డుకోవాలన్నదే టీడీపీ ఆలోచన అన్నారు. మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సీఎం వైయస్ జగన్ చేసిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అంశాలు వేరైనా ఓటర్లు, వారి అభిమానం, వారి ప్రాధాన్యత ఏ పార్టీ మీదా ఉందని చెప్పడానికి ఒక అవకాశం వచ్చింది. స్థానిక సంస్థలు కాబట్టి సహజంగానే స్థానిక అంశాలు కొత్త ప్రభావం చూపుతాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ పదవులు పార్టీ చిహ్నంపై జరుగుతాయి. దీన్ని అన్ని పార్టీలు చాలెంజ్‌గా తీసుకుంటాయి. వైయస్‌ఆర్‌సీపీ ఇప్పుడే కాదు..పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొన్నాం. ఇది ప్రజలను నమ్ముకున్న పార్టీ, ప్రజల్లో మమేకమైన పార్టీ. లక్ష్యసాధన క్రమంలోనే ప్రాణాలు కోల్పోయిన వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో పుట్టిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలపై విశ్వాసంతో పోరాటం చేశాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఎన్నికలకు వెళ్లాం. ఎక్కడా కూడా భయపడలేదు.ఈ రోజు కూడా అదే విధానంలో ముందుకు వెళ్తున్నాం. ఈ ఎన్నికలకు మాకు కూడా హఠాత్తుగా వచ్చినవే. ఈ నెలలో ఎన్నికలు జరుగకపోతే మున్సిపాలిటీలు, పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.5 వేల కోట్లు రావు కాబట్టి ఎన్నికలు అనివార్యం అయ్యాయి.గత నవంబర్‌లో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండేది. కోర్టులో ఈ అంశం ఉండటంతో కొంత ఆలస్యమైంది. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడంతో కోర్టులో జాప్యం జరుగుతూ వచ్చింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతాప్‌రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఈ ఆలస్యం జరిగింది. నిజానికి మా పార్టీకి ప్రచారం చేసుకునేందుకు ఎక్కువ సమయం కావాలి. ఎందుకంటే మేం ప్రచారం చేయడానికి బోలెడన్ని అంశాలు ఉన్నాయి. గతంలో దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలోకి రాగానే తొలి రెండు, మూడు నెలల్లోనే మేనిఫెస్టోలని హామీలన్ని పూర్తి చేయలేదు. కేవలం ఒక్క వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే అది చేయగలిగింది. వైయస్ జగన్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు. సమాజంలో మార్పులు తెచ్చే విధంగా పాలన చేస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి సీఎం వైయస్ జగన్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ, అందరిని సమన్వయం చేసుకోవాలంటే అక్కడే ఉండాలి. ఎక్కువ రోజులు ప్రచారం జరిగితే దానిపై విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇలాంటి చర్యలకు ఫుల్ స్టాఫ్ పెడుతూ..ప్రచారానికి ఒక్క వారం సమయం ఇచ్చాం. డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది. దీన్ని అందరూ హర్షించాలి. అందరూ ఇందుకు సహకరించాలి. ఈ ప్రయత్నం వైయస్ జగన్ ప్రభుత్వం చేసింది. దానికి చట్టరూపం ఇచ్చింది. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవాలనే వారికి ఈ అంశంతో భయం పుడుతుంది. ఓటర్లను చైతన్యం చేయాల్సింది పోగా..చంద్రబాబు విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చారు. డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే ఎన్నికలు అయిపోయిన తరువాత కూడా చర్యలు తీసుకుంటామనే భయంతో పోటీ చేయలేని పరిస్థితి క్రియేట్ చేశారు. ఇది కొత్తది ఏమీ కాదు. మేం కొత్తగా చేసిది ఏంటంటే డబ్బు, మద్యం పంపిణీ చేయకూడదని చట్టం చేశాం. ఇలాంటి వాటిని గౌరవిస్తే మంచి ఫలితాలు వస్తాయి. చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. దిక్కుమాలిన ఆలోచనలతో మాట్లాడుతున్నారు. కామన్‌సెన్స్‌తో ఎవరు ఆలోచించినా అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి చట్టం చేయాలని అనుకోదు. 2014 ఎన్నికలు ఒకసారి గుర్తు చేసుకుంటే..జనరల్ ఎన్నికలు వస్తున్న సమయంలో హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకువచ్చారు. వైయస్‌ఆర్ కుటుంబంపై ఆధారపడి నడుస్తున్న మా పార్టీని దెబ్బతీసేందుకు ఆ రోజు చంద్రబాబు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. అయినా మేం వెనుకడుగు వేయలేదు. సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొన్నాం. నలభై ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే పార్టీ, 14 ఏళ్లు సీఎంగా అనుభవం ఉన్న నాయకుడి నాయకత్వంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడైనా టీడీపీ తరఫున అభ్యర్థులు నిలబడకపోతే రెండో తరం రంగంలోకి దిగాలని చంద్రబాబు పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తూ ఆ సాకు మాపై నెట్టడం అంతకంటే దివాళకోరుతనం ఏమీ ఉండదు. తొమ్మిది నెలల్లో ఘోరంగా విఫలమైందని మీరే అంటున్నారు. ఖజానా అంతా డొల్లా చేశారని ఆరోపించారు. మా పథకాలు తీసేశారని అంటున్నారు. రాష్ట్రమంతా అమరావతిని కోరుకుంటున్నారని అంటున్నారు. ఇలాంటి అంశాలు ఉన్నాయి. ఓటర్ల వద్దకు ఈ అంశాలను తీసుకెళ్లండి. మా సీఎం వైయస్ జగన్ చేసిన పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నాం. ఎక్కడా కూడా డబ్బు, మద్యం ఉండకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. ఒక వ్యవస్థలో మార్పు రావడానికి ఈ ఎన్నికలను పెద్ద అవకాశంగా తీసుకుందాం. ప్రజాస్వామ్యంలో పార్టీ మీద, విధానాలపై, సిద్ధాంతాలపై ఓట్లు వేయాలి. డబ్బుకు లొంగితే ప్రజాస్వామ్యం విఫలప్రయోగం అవుతుంది. ఇన్నాళ్లు ఇది ఒక ఆలోచనగానే ఉంది. మొట్ట మొదటి సారిగా నిజమైన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపుదామని వైయస్ జగన్ ఈ ప్రయోగం చేస్తున్నారు. అధికార పార్టీకి ఇది ఒక పెద్ద పరీక్షే. సీఎం వైయస్ జగన్‌కు ముక్కు సూటి రాజకీయం మాత్రమే తెలుసు. మా నాయకులు కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు ఇంటింటా పర్యటించి వైయస్ జగన్ అమలు చేసిన పథకాలను వివరిస్తారు. ఏడు రోజుల్లో ఎక్కడ రౌడీయిజం, దోపిడీ ఉంటుందో అర్థం కావడం లేదు. బీసీల రిజర్వేషన్ల మీద టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో కోర్టులో అఫిడవిట్ వేసింది. వారు 50శాతం చాలు అన్నారు. మేం మాత్రం 59.29 శాతం కావాలని ప్రతిపాదనలు చేశాం.దీనిపై టీడీపీ నేతలే సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఎలాగైనా ఎన్నికలు ఆపాలని ప్రయత్నం చేశారు. ఎన్నికలు జరుగకపోతే కేంద్రం నుంచి నిధులు రావు..ఆ నెపాన్ని మాపై వేయాలని చంద్రబాబు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ బీసీల విషయంలో ఢృడనిశ్చయంతో ఉన్నారు. ముందే అనుకున్నాం కాబట్టి బీసీలకు అదనంగా పార్టీ తరఫున 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రమంతటా 10 శాతం అదనంగా సీట్లు ఇస్తున్నాం. అందులో కూడా టీడీపీ పోటీ. బీసీలకు మేలు చేసేందుకు ఏ పార్టీ అయితేనేమి. మహిళలకు సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉంది. మేం రాష్ట్రంలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ఎవరు ఎవర్ని బెదిరిస్తున్నారో? చంద్రబాబే చెప్పాలి. చంద్రబాబు తోక పత్రికలే ఈ సారి పోటీ చేయకపోవడమే మంచిదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. లేని భయాన్ని సృష్టిస్తూ చంద్రబాబు ఏవేవో మాట్లాడుతున్నారు. భయంకరంగా జరుగబోయే ఓటమికి ముందే గ్రౌండ్ తయారు చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు కొడుకే ఓడిపోయారు. ఓటమిని ఓన్ చేసుకునే దమ్ము లేదు. రాజకీయ వ్యభిచారం మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టు పార్టీ టీడీపీతో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికలకు, ఈ ఎన్నికలకు మధ్య తేడా ఏంటి?. వైయస్ జగన్ తన పాలనలో ఎక్కడ తప్పు చేశారో చెప్పలేకపోతున్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వడం తప్ప? జీతాలు పెంచడం తప్ప..ఏదో చెప్పండి. స్పందించే ప్రభుత్వం ఇది. దిశ యాక్ట్ పెట్టడం తప్ప..ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం తప్ప..?. ఏ వర్గాన్ని పట్టించుకోలేదో చెప్పాలి. మా నాయకుడు పార్టీ నాయకులకు పరీక్ష పెట్టారని, డబ్బు, మద్యం ఉండకూడదని సీఎం సూచించారు. ఇది ప్రతిపక్షాలకు అనుకూలమైన వాతావరణం. ఈ పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తినే టార్గెట్‌గా పెట్టుకున్నారు. టీడీపీ అవసాన దశలో ఉందని, దిగజారుడు రాజకీయాలు, దిక్కుమాలిన ఆరోపణలు మానుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.