హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో గెలుపుపై వంద శాతం ధీమాతో ఉన్నామని, ఎంతమంది కూటమిగా వచ్చినా సగం ఓట్లు కూడా ఆ పార్టీలకు పడవని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సజ్జల మాట్లాడుతూ.. కూటమిపై, ప్రతిపక్ష నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీతో వైఎస్ జగన్‌కు ఉంది ప్రభుత్వ సంబంధమే. కేంద్రం, రాష్ట్రం అన్నట్టుగానే బీజేపీతో ఇంతకాలం అనుబంధం కొనసాగించాం. వాస్తవానికి బీజేపీ నుంచి మాకెప్పుడో ఆఫర్ ఉంది. ఎన్డీయేతో వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లేవాళ్లం. కానీ, ఎవరితో పొత్తు వద్దని నిర్ణయించుకున్నాం గనుకే దూరంగా ఉన్నాం. నలుగురితో కలిసి పోటీచేస్తే తర్వాత తేడాలొస్తాయ్. చంద్రబాబులా పొత్తునుంచి బయటికొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడలేమని సజ్జల చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదన్న సజ్జల.. ఆయన్ని చూస్తే జాలేస్తుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలపై పవన్‌కు ఒక క్లారిటీ అంటూ లేదు. అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా? అని సజ్జల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండబోదని సజ్జల అంచనా వేశారు. ఈ క్రమంలో సంచలన ప్రకటన చేశారు. రాజకీయ లక్ష్యాలే తప్ప.. వైయస్ కుటుంబంలో గొడవలేం లేవు. షర్మిల పట్ల అన్నగా వైయస్ జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అయితే.. రాజకీయంగా షర్మిలే తప్పటడుగులు వేశారని సజ్జల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 87శాతం మందికి సంక్షేమం అందించాం. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు మాకే పడతాయి. ప్రజలపై మాకు ఆ నమ్మకం ఉంది. కూటమిగా ఎంతమంది కలిసొచ్చినా విజయం మాత్రం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.