ఇటు డైవర్షన్‌.. అటు వైయ‌స్ఆర్‌సీపీపై కక్ష సాధింపు

ఆ దిశలోనే కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్స్‌. కాన్సిపిరసీ థియరీ

ఇదే సీఎం చంద్రబాబు ఏడాదిన్నర దారుణ పరిపాలన 

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి. 

అన్నింటా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం

అన్ని వర్గాలకు అన్యాయం. అస్సలే లేని సంక్షేమం

సమస్య వచ్చినప్పుడల్లా డైవర్షన్‌ పాలిటిక్స్‌

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర

ఆ దిశలోనే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు..

పరకామణి చోరీ కేసు. లిక్కర్‌ స్కామ్‌ అంటూ కేసు

డైవర్షన్‌తో పాటు, వైయ‌స్ఆర్‌సీపీపై కక్ష సాధింపు

సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

ఏ ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసులు

ఎవరో ఒకరిని అరెస్టు చేయడం. బెదిరించడం

ఆ తర్వాత వాంగ్మూలాలు నమోదు చేయడం

వాటి ఆధారంగా టార్గెట్‌లిస్ట్‌లో ఉన్న వారిపై కేసులు

ఆ విధంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు

అదే చంద్రబాబు నమ్ముకున్న కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీ

సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి

ఏడాదిన్నర పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు

ఏం చేశామో చెప్పుకోలేకనే ఇదంతా 

పెట్టుబడుల పేరుతో విశాఖలో.. రాజధాని పేరుతో అమరావతిలో

భూముల కేటాయింపు, కాంట్రాక్టుల్లో భారీ అవినీతి 

వాటినే అభివృద్ధిగా చూపుతూ అదే పనిగా ప్రచారం

చంద్రబాబు మోసాలను ప్రజలంతా గుర్తించారు

అందుకే కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన

ప్రెస్‌మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ 

తాడేపల్లి:    టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో చేసిందేమీ లేక, ఏం చేశామో చెప్పులేక.. వైఫల్యాలు బయటపడినప్పుడు, అవినీతితో ఇరుకున పడినప్పుడల్లా టార్గెట్‌ వైయ‌స్ఆర్‌సీపీ నినాదం భుజానికెత్తుకుని తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఇటు డైవర్షన్‌.. అటువైయ‌స్ఆర్‌సీపీపై కక్ష సాధింపు.. ఆ దిశలోనే కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్స్‌తో కాన్సిపిరసీ థియరీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. అందులో నుంచి వచ్చినవే  తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు, పరకామణి చోరీ కేసు. లిక్కర్‌ స్కామ్‌ వంటి కేసులు అని వెల్లడించారు. అలా డైవర్షన్‌ పాలిటిక్స్‌తో పాటు, వైయ‌స్ఆర్‌సీపీపై కక్ష సాధింపు ధోరణితో ఈ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
    ఏ ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసులు నమోదు చేసి ఎవరో ఒకరిని అరెస్టు చేయడం, బెదిరించడం.. ఆ తర్వాత వాంగ్మూలాలు నమోదు చేయడం.. వాటి ఆధారంగా టార్గెట్‌లిస్ట్‌లో ఉన్న వారిపై కేసులు పెడుతూ, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కక్ష సాధిస్తున్నారని.. అదే సీఎం చంద్రబాబు నమ్ముకున్న కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీ అని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఆ కేసులో ఏ ఆధారాలతో సిట్‌ విచారణ?:
    2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్‌ చేసే వాళ్లం. కానీ, ఏనాడూ మేము కక్షపూరితంగా వ్యవహరించలేదు. 
    ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంటూ, ఏ ఆధారాలతో సిట్‌ ద్వారా విచారణ చేయిస్తుందో అర్ధం కావడం లేదు. 2019–24 మధ్య వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేస్తున్న సిట్, 2014–19 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపైనా విచారణ చేస్తే అసలు నిజాలు తెలుస్తాయి. 2019–24 మధ్య కేజీ నెయ్యి రూ.320 చొప్పున సేకరిస్తేనే కల్తీ అన్న నాయకులు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.270 కే సేకరించినప్పుడు కల్తీ జరిగినట్లు కాదా? ప్రభుత్వాలు మారినా టీటీడీలో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవస్థల ప్రకారమే టెండర్ల నిర్వహణ, క్వాలిటీ చెకింగ్‌ జరుగుతుంది. 
    పరకామణి చోరీ అంటూ కేసు పెట్టి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను ఇరికించే ఉద్దేశంతోనే విచారణ పేరుతో ఏవీఎస్‌వో సతీష్‌ కుమార్‌ను సిట్‌ వేధించింది. ఆ బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మేం మాట్లాడితే.. ఆధారాలు లేకుండానే హత్యగా ప్రచారం చేసిందే కాకుండా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులే చంపించారని మాపై బురదజల్లారు.

కక్ష సాధింపులో భాగమే కల్తీ లడ్డూ వ్యవహారం:
    తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను నిజం చేసి వైయ‌స్ఆర్‌సీపీనాయకులను ఇరికించడంలో భాగంగానే రోజుకొక కొత్త పాత్రలను సృష్టించి ప్రవేశపెడుతున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సాక్షాత్తూ సుప్రీంకోర్టు సీరియస్‌ కావడంతో, మాట మార్చి వెజిటబుల్‌ ఆయిల్, రసాయనాలు కలిపి కల్తీ చేశారని ప్రజలను నమ్మించడానికి ఎక్కడెక్కడి నుంచో ఉత్తర భారత్‌కు చెందిన వారిని నిందితులుగా చేర్చి విచారణ పేరుతో కొత్త కథలు అల్లుతున్నారు. 2019–24 మధ్య తిన్న తిరుమల లడ్డూ కల్తీ నెయ్యితో చేశారని ప్రజల మెదళ్లలోకి నాటడమే లక్ష్యంగా భయంకరమైన కుట్రలకు తెర తీస్తున్నారు. రాజకీయ కక్షల కోసం నిర్లజ్జగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, శ్రీవారి ప్రతిష్టను పణంగా పెడుతున్నారు.
    2019–24 మధ్య 20 కోట్ల లడ్డూలు కల్తీ చేశారంటే ఎలా? కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న లడ్డూ వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని నాడు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ ఏ ఆధారాలతో ఇలాంటి ఆరోపణలు చేస్తూ, సిట్‌ ద్వారా విచారణ చేస్తున్నారో అర్థం కావడం లేదు. 

రిజెక్ట్‌ చేసిన నెయ్యిని ఎలా వాడారు?:
    నెయ్యి  క్వాలిటీ చెక్‌ చేసే విధానాలు 2019–24 మధ్య ఉన్నాయి. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఉన్నాయి. క్వాలిటీ చెక్స్‌ పాసవ్వని, ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను ఆరోజున వెనక్కి పంపారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనూ వెనక్కి పంపారు. కానీ వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందని ఐదేళ్ల పీరియడ్‌లో మాత్రమే విచారణ ఎలా చేస్తారు?.
    టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలైలో క్వాలిటీ చెక్‌ తర్వాత నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్‌ చేసి వెనక్కి పంపారని చెబుతున్నారు. వెనక్కి పంపిన నెయ్యిని తిరిగి తీసుకొస్తే వాడినట్టు సిట్‌  రిపోర్టులో ఉంది. అలాంటప్పుడు రిజెక్ట్‌ చేసిన నెయ్యినే కూటమి ప్రభుత్వంలో ఎలా వాడారు? టీడీపీ హయాంలో జరిగిన తప్పుకి చంద్రబాబు బాధ్యత తీసుకోరా?.

అధికారులు అప్పుడూ, ఇప్పుడూ ఉన్నారు:
    అధికారులు తప్పు చేశారంటున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఉన్న అధికారులే అప్పుడు ఉన్నారు. గతంలో టీడీపీ హయాంలో పనిచేసిన అధికారులే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనూ పనిచేశారు. టీటీడీలో అన్ని ఒక సిస్టమాటిక్‌ గా దశాబ్ధాలుగా జరుతున్నవే కదా. ఒక్కసారిగా మారిపోయిందేమీ కాదు కదా?.
    కాగా, ఇప్పుడు కేజీ నెయ్యి రూ.700 కు సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా ల్యాబ్‌లో క్వాలిటీ చెక్‌ చేస్తే అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సిందే.  నెయ్యి వాసన చూసి నిర్ధారించలేం కదా. ఒకవేళ అధికారులు రిపోర్టులను ట్యాంపర్‌ చేసుంటే దానికి ఎవరు బాధ్యులు? గత టీడీపీ హయాంలో ఎలాగైతే ఈవోలు, టీటీడీ చైర్మన్, బోర్డు, ల్యాబ్‌ సిబ్బంది, పర్చేజింగ్‌ కమిటీలు నిర్ణయం తీసుకుని ఉంటాయో.. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనూ అదే జరిగింది. వీటి మీద విచారణ ఎందుకు చేయడం లేదు. 

అన్నీ డైవర్షన్‌ పాలిటిక్స్‌. ఎందుకంటే..:
    ఏడాదిన్నర పాలనలో చేసిందేమీలేక, ఏం చేశామో చెప్పుకోలేక ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా టార్గెట్‌ వైయ‌స్ఆర్‌సీపీ నినాదం భుజానికెత్తుకుని అక్రమ కేసులు పెట్టి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. టీడీపీ కూటమి పాలనలో బయట పడిన నకిలీ మద్యం కేసును కూడా వైయ‌స్ఆర్‌సీపీ మెడకే చుట్టి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి కేసులు నమోదు చేయడమో లేదా అనుమానాలున్నాయని కట్టుకథలు సిద్ధం చేసి కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. 
    లిక్కర్‌ స్కామ్‌లో ఇన్నాళ్లుగా విచారణ చేస్తున్న ప్రభుత్వం ఏం సాధించినట్టు? న్యాయస్థానాల దగ్గర విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని నెలల తరబడి మా నాయకులను జైలుపాలు చేస్తున్నారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు ఒకవైపు మా పార్టీపై కక్ష సాధింపులకు దిగడం, మరోవైపు తప్పుడు ప్రచారాలతో మా పార్టీ బురదజల్లి ప్రజల్లో చులకన చేయడం లక్ష్యంగా పని చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం కూడా అందులో భాగంగా జరుగుతున్న తతంగమే. 

అది నియమాలకు విరుద్ధం కాదా?:
అయినా మేము రాజకీయం చేయలేదే?:

    ఎస్‌ బ్యాంకులో రూ.1300 కోట్లు టీటీడీ నిధులు ఎలా జమ చేశారు? ప్రైవేట్‌ బ్యాంకులో 10 శాతానికి మించి టీటీడీ నిధులు డిపాటిట్‌ చేయకూడదనే నిబంధన ఉంది. కానీ టీటీడీ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి ఎస్‌ బ్యాంక్‌ అనే ప్రైవేట్‌ బ్యాంకులో రూ.1300 కోట్లకు పైగా జమ చేశారు. వైవీ సుబ్బారెడ్డి గారు చైర్మన్‌ అయ్యాక దాన్ని మార్చి జాతీయ బ్యాంకుల్లోకి మార్చారు. ఎస్‌ బ్యాంకులో డిపాటిజ్‌ చేసిన దానికి చంద్రబాబే కారణమని మేం ఆరోపించామా?.
    నాటి టీటీడీ బోర్డు చేసిన తప్పును అప్పటి సీఎం చంద్రబాబు మీద మేం రుద్ది కుట్ర రాజకీయాలు చేశామా?  ఒకే బ్యాంకులో రూ. 1300 కోట్లు డిపాజిట్‌ చేశారంటే ఎంత కమిషన్‌ పుచ్చుకుని ఉంటారోనని మేం అనుకుని లోతుల్లోకి వెళ్లి ఉంటే.. ఏమయ్యేది?  కానీ మాకు ప్రజలకు చేయాల్సిన పనులు చేతుల నిండా ఉన్నాయి కాబట్టి వాటిలో మునిగిపోయాం. ఇప్పటి మాదిరిగా ఆరోపణలు చేసి అనుమానాలతో తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు టీటీడీ కేసులో చంద్రబాబును ఇరికించలేదు కదా? అరెస్ట్‌ కూడా చేయలేదు కదా?. స్కిల్‌ స్కామ్‌లో అన్నీ పక్కా ఆధారాలతో దొరికారు కాబట్టే, ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

లాయర్‌కు రూ.8 కోట్ల ఫీజు!:
    చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వాదించిన లాయర్‌ సిద్దార్థ లూథ్రాని తీసుకొచ్చి  వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల మీద బనాయించిన అక్రమ కేసులన్నీ ఆయనకే అప్పజెప్పారు. ఆయన కూడా వేరే పనులేవీ పెట్టుకోకుండా ఏపీ ప్రభుత్వం కోసమే పూర్తిగా పని చేస్తున్నట్లు ఉంది. ఒక్క రోజు ఆయన కోర్టుకు హాజరైతే ఏకంగా రూ.10 లక్షల ఫీజు చెల్లిస్తున్నారు. దానికి ఆయన క్లరికల్‌ ఫీజు మళ్లీ అదనంగా ఇస్తున్నారు. అలా ఆయనకు ఇప్పటి వరకు రూ.8 కోట్లకు పైగా జనం సొమ్మును ఈ ప్రభుత్వం ఫీజు కింద చెల్లించింది. అంటే కక్ష సాధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

పరకామణి కేసు. లబ్ధి ఎవరికి?:
    పరకామణిలో చోరీ కేసులో రాజీ వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో చూశారా? పరకామణి చోరీ కేసులో రవికుమార్‌ అనే ఉద్యోగి 75 వేల డాలర్ల విదేశీ నగదుతో పట్టుబడ్డాడు. దానికి సంబంధించి లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. దానికి బదులుగా రూ.14 కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి ఇచ్చాడు. ఇది సాంకేతికంగా రైటా? రాంగా? అనేది కోర్టులు చూసుకుంటాయి. అంతే కానీ ఈ రాజీ వల్ల ఎవరైనా లబ్ధి పొందారా అనేది చూడాలి. ఆ రవికుమార్‌వి లేదా, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎవరైనా వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన నాయకుల పేర్ల మీదకు బదిలీ అయ్యాయేమో చూడాలి. అలా చూడకుండా కేవలం వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అక్రమంగా ఇరికించడమే లక్ష్యంగా ఆరోపణలు చేయడం, ఏవీఎస్‌వో సతీష్‌ కుమార్‌ను విచారణకు పిలిచి వేధించారు. సిట్‌ అధికారులు విచారణ పేరుతో పెట్టిన వేధింపులతోనే సతీష్‌కుమార్‌ మరణించారు.

అప్పుడూ ఇప్పుడూ అవే వ్యవస్థలు:
    తిరుమల లడ్డూ విషయంలో ఎలాగైతే ప్రభుత్వాలు మారినా టీటీడీకి చెందిన అవే వ్యవస్థలు పనిచేస్తూ వచ్చాయో, లిక్కర్‌ కేసులోనూ అంతే జరిగింది. డిస్టిలరీలన్నీ టీడీపీ హయాంలో ఉన్నవే. వాటన్నింటికీ సీఎంగా చంద్రబాబే అనుమతిచ్చాడు. బ్రాండ్‌లు కూడా అవే ఉన్నాయి. ఎక్సైజ్‌ అధికారులు టెస్ట్‌ చేసి ఆమోదించిన తర్వాతే బ్రాండ్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. దశాబ్దాలుగా అమల్లో విధానాన్నేవైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కూడా పాటించాం. 
    మరి, నాడు చంద్రబాబు హయాంలో చేసింది కరెక్ట్‌ అయితే వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో జరిగింది కూడా కరెక్టే కదా.. దీనికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. కానీ కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చి వైయ‌స్ఆర్‌సీపీ మీద బురద జల్లడమే లక్ష్యంగా అక్రమ కేసులతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు.

కేసుల క్లోజర్‌ కుట్ర:
    సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగంతో కేసులు క్లోజ్‌ చేయించుకునే కుట్ర చేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు ఆధారాలతో దొరికిపోయాడు. షెల్‌ కంపెనీలు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు అధికారులు ఆధారాలు సేకరించాకనే అరెస్ట్‌ చేశారు. బార్లకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసి దాదాపు రూ.5 వేల కోట్లు లబ్ధి చేకూర్చాడు. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించి వారికి మేలు చేశాడు. దాని మీద సిట్‌ విచారణ చేసి ఆధారాలు సేకరిస్తే.. దానిపై విచారణ ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటకు రావాల్సింది పోయి, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేసులన్నీ మాఫీ చేస్తున్నాడు.
    ప్రజలిచ్చిన అధికారాన్ని వైయ‌స్ఆర్‌సీపీని భూస్థాపితం చేయాలనే పగతో వాడుకుంటున్నాడు. తన మీద ఉన్న కేసులను ఎత్తివేయడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. అధికారం చేతికొచ్చిన ఈ 18 నెలల కాలంలో ఆయన చేసింది ఈ రెండు పనులే. చంద్రబాబు కన్ఫెషన్, కాన్స్‌పిరసీ థియరీ ప్రకారం వెళ్లుంటే అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే చంద్రబాబుని అరెస్ట్‌ చేసే వాళ్లం. దానికి కేసే అసవరం లేదు. 120–బి కుట్ర పన్నారని కేసు పెట్టి ఉండొచ్చు. సీఆర్‌డీఏ ల్యాండ్‌ అలాట్‌మెంట్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం, లిక్కర్‌ స్కాం, అసైన్డ్‌ ల్యాండ్‌ స్కాం గురించి అందరికీ ముందే తెలుసు. కానీ నాటి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు విచారణ పూర్తిస్థాయిలో జరిగి నిజాలు వెలుగులోకి రావాలనే ఉద్దేశంతో చివరి వరకు వేచి చూశారు. 
    ఈ పద్ధతిలో చేయడానికి ఏమీ లేవు కనుక అక్రమ కేసుల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అరెస్ట్‌ చేస్తున్నారు. తనపై ఉన్న కేసుల్లో అధికారులను ప్రలోభపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పించుకోవాలని చూస్తున్నాడు. తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు భయపడిపోతున్నాడు. రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక అన్నీ మళ్లీ బయటకు తీస్తాం. 

అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే:
    చంద్రబాబు తల్లి అమ్మన్నమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే. లోకేష్‌ పక్కనే ఉన్నాడు కాబట్టి ఆ కథనే చాగంటి గారు మరో రకంగా చెప్పారు. కుట్రలు బయటపడనంతకాలం అధికారాన్నిఎంజాయ్‌ చేయడమే చంద్రబాబు లక్ష్యం. సూక్ష్మంలో మోక్షం. అడ్డదారులే బెస్ట్‌ అనేది చంద్రబాబు నైజం. ఈరోజు తన పాలనలో అదే చూపిస్తున్నాడు. వ్యవస్థల మీదున్న పట్టుతో జనాన్ని ఇంప్రెస్‌ చేయాలని చూస్తున్నాడు. కానీ ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయడం సాధ్యమయ్యే పనికాదు.

దోపిడీని అభివృద్ధిగా ప్రచారం చేస్తే నమ్మేస్తారా?:
    గూగుల్‌ డేటా సెంటర్‌ కి సంబంధించి అదానీ పేరెత్తితో వైయస్‌ జగన్‌ గారికి క్రెడిట్‌ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు కిక్కురుమనడం లేదు. చంద్రబాబు అండ్‌ కో చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటివరకు కోటి కోట్ల పెట్టుబడులు రావాలి. కానీ ఇన్‌సెంటివ్స్‌ పేరుతో కోట్ల విలువైన విశాఖ భూములను ఎకరం 99 పైసలకే అప్పనంగా కట్టబెట్టేస్తున్నాడు. వందల ఎకరాలు ధారాదత్తం చేస్తున్నాడు. కంపెనీలు, పెట్టుబడుల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. దానికి ప్రతిగా వారి నుంచి భారీగా లబ్ధి పొందుతున్నాడు. అప్లికేషన్‌ పెట్టగానే ఊరూ పేరు లేని కంపెనీలకు వందల కోట్ల విలువై భూములు ఎలా ఇస్తున్నట్టు? కిక్‌ బ్యాగ్స్‌ వస్తున్నాయనేది నిజం కాకపోతే ఓపెన్‌ ఆక్షన్‌ పెట్టేవాడు.
    డెవలప్‌డ్‌ సిటీ కాబట్టి విశాఖలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా  ముందుకొస్తారు. అలాంటప్పుడు హైదరాబాద్‌లో మాదిరిగా ఆక్షన్‌ పెట్టాల్సింది. ఇంతకన్నా దారుణమైన దోపిడీ ఉంటుందా? ఒకపక్క అమరావతి అభివృద్ధి కోసం లక్షల కోట్లు అప్పులు చేస్తూ కాంట్రాక్టు పనులను ప్రపంచంలోనే ఎక్కవ ధరలకు కట్టబెడుతున్నాడు. విశాఖ భూములను పప్పు బెల్లాల మాదిరిగా 99పైసలకు అప్పజెప్పేస్తున్నాడు. ఇవన్నీ చూసిన వారు ఎవరైనా చంద్రబాబు రాష్ట్ర అభివద్ధికి చేస్తున్నాడని అనుకుంటారా.. అభివద్ది పేరు చెప్పి దోచుకుంటున్నాడని అర్థం కాదా?  ఇదే హెరిటేజ్‌ ఆస్తులైతే ఇస్తాడా? చదరపు అడుగు రూ.10 వేలకు పనులు కట్టబెడతాడా? 

రైతులకు నాడు ఇచ్చిన భద్రత, భరోసా ఇప్పుడు లేదు:
    టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం చేశామని చెప్పుకోవడానికి వారి దగ్గర ఒక్కటీ లేదు. కానీ దగా చేశాడని చెప్పడానికి చాలా అంశాలున్నాయి. ఈ ఏడాదిన్నరలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర అనేది వచ్చిందా? మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ అనేది జరిగిందా అంటే అదీలేదు. ఉచిత పంటల బీమా అనేది లేదు. దీని కారణంగా ఏకంగా 60 లక్షల మంది రైతులు నష్టపోయారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో రైతులకు ఇచ్చిన భద్రత, భరోసా అనేది ఇప్పుడు లేదు.
    మొంథా తుపాన్‌ వచ్చి రైతు నష్టపోతే కనీసం ఎన్యుమరేషన్‌ కూడా జరగలేదు. 2014–19 మధ్య ఎలాగూ ఆయన ఆలోచన చేయలేదు. కనీసం వైయ‌స్ఆర్‌సీపీహయాంలో చేసిన పనులైనా కొనసాగించి ఉంటే రైతులు బాగుండేవారు. పుండు మీద కారం చల్లినట్టు వరి వేస్తే క్యాన్సర్‌ వస్తుందని హడలెత్తిస్తున్నాడు. వ్యవసాయం ఎందుకు అన్నట్టు రైతుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రైతన్నా మీకోసం.. అని వస్తామంటున్నారు. అధికారులను, ఎమ్మెల్యేలను నిలదీయడానికి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. రైతులు భగభగ మండిపోతున్నారు. వెంటబడి తరుముతారు. తెలిసి తెలిసి రైతుల్ని వేధిస్తూ కూడా బాగా  చేసేశామని చెప్పడమంటే క్రూరత్వానికి పరాకాష్ట.  

దానిపై ఎందుకంత కడుపు మంట?:
    తెలంగాణలో బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం మాకేంటి
వైయస్‌ జగన్‌ సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో జనాన్ని తరలించారని ప్రచారం చేయడానికి తలకాయ ఉండాలి. 2014 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే వైయ‌స్ఆర్‌సీపీకి 7శాతం ఓట్లు వచ్చాయి. అయినా తెలంగాణ రాజకీయాలు వద్దనుకుని వచ్చిన మాకు బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆంధ్రా నుంచి తెలంగాణ వరకు ఎవరైనా ర్యాలీ చేస్తారా? ఏపీలో అయినా సరే వైయస్‌ జగన్‌ గారి ముందు బల ప్రదర్శన చేసుకునే అవకాశం నాయకులకు కూడా లేదు. ఆయన వస్తున్నారంటే కార్యకర్తలే స్వచ్ఛందంగా తరలివస్తారు.   
    ఈ కడుపు మంటకి ఎన్ని డ్రమ్ముల జెలసిల్‌ తాగుతారో 
ఎవరో రప్పా రప్పా అని ప్లకార్డు పట్టుకుని వచ్చాడంటే దానికి మా ఎంకరేజ్‌మెంట్‌ ఏముంటుంది? అలాంటప్పుడు చంద్రబాబు దగ్గర జరిగేవి చాలా చూపించగలం. అది సినిమాలో ఒక డైలాగ్‌. మళ్లీ మేం అధికారంలోకి వస్తామని చెప్పడానికి అలాంటి ప్లకార్డులు పట్టుకుని ఉంటారు. దాన్ని పట్టుకుని లబలబా కొట్టుకోవడం ఏంటి? 88 దాటితే మమ్మల్ని రప్పారప్పా ఆడిస్తారు. దేవర మమ్మల్ని కాపాడమని సుప్రీంకోర్టు జస్టిస్‌ని వేడుకోవడం ఏంటి? ఇంకొకడు ఏకంగా వైయస్‌ జగన్‌ని ఎన్కౌంటర్‌ చేసేయాలని అంటాడు. వీళ్లకు ఎన్ని డ్రమ్ముల జెలసిల్‌ తాగితే కడుపు మంట చల్లారుతుందో మరి. రప్పా రప్పా అంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని చేస్తామని చెప్పడమే. చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా వైయస్‌ జగన్‌ గారిమీదున్న అభిమానాన్ని పొందలేరని తెలుసుకోవాలి. 

కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన:
    వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల వలన ఇటు విద్యార్థులు, అటు రాష్ట్ర ప్రజలకు ఇద్దరికీ మేలు జరుగుతుంది. అలాంటి వాటిని ప్రైవేటుపరం చేస్తామంటే ప్రజలంతా ఎందుకు ఊరుకుంటారు? పభ్రుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మద్ధతు పలుకుతున్నారు. ఈ స్పందన చూశాకైనా చంద్రబాబు వెనక్కి తగ్గడం లేదంటే, మళ్లీ ఎలాగూ అధికారంలోకి రాలేమని డిసైడ్‌ అయినట్టున్నాడు. ఒక్క మెడికల్‌ కాలేజీల విషయంలోనే కాకుండా అన్ని అంశాల్లోనూ ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాన్ని ప్రతిబింబిస్తూ కోటి సంతకాల సేకరణలో రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కోటి సంతకాల సేకరణ ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీచేసిన ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా నిలిచిపోతుంది. 

ఒక్క ఇల్లు కట్టించకపోయినా క్రెడిట్‌ చోరీ:
    వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో పూర్తి చేసిన ఇళ్లను కూటమి ప్రభుత్వంలో ఇచ్చినట్టు చెప్పుకోవడం దారుణం. పేదల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా క్రెడిట్‌ చోరీకి పాల్పడటం సిగ్గుచేటు. జగనన్న కాలనీల్లో ఒక్క పని కూడా జరగడం లేదు. పెండింగ్‌ పనులు పూర్తి చేయలేదు. టీడీపీ హయాంలో పెండింగ్‌ పెట్టిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశాం. అంతేకాకుండా లబ్ధిదారులు 20 ఏళ్లు లోన్లు కట్టేలా చంద్రబాబు నిబంధనలు పెడితే, వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఒకే ఒక్క సంతకంతో రూపాయికే ఇళ్లు దక్కేలా చేశారు. 
    వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో పూర్తయిన 3 లక్షల ఇళ్లను తాను కట్టినట్టు చెప్పడం కన్నా క్రెడిట్‌ చోరీ ఇంకోటి ఉండదు. రాబోయే రోజుల్లో దీనిపైనా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపడతాం. 

మాకు ప్రచారం ముఖ్యం కాదు:
    పని చేయడం బాధ్యతగా ఫీలయ్యాం కాబట్టే ప్రచారం చేసుకోలేదు. ప్రభుత్వంలో భాగంగా రోజువారీ కార్యక్రమాలను చేస్తూ వచ్చాం. ఐదేళ్లూ అన్ని వర్గాలకు ఎప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తూ పోయాం. ఇదంతా మా బాధ్యతగా ఫీలయ్యాం కాబట్టే దాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకోలేక పోయాం.
    కానీ చంద్రబాబు మాత్రం చేయనవి కూడా చేసినట్టు చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టే మా ఉద్యమాలకు అపూర్వ స్పందన వస్తోంది. మీడియా, సోషల్‌ మీడియా ప్రచారంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇన్‌ఫ్లూయెన్సర్లను పెట్టి, పెయిడ్‌ ప్రచారంతో మామీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడే కానీ ప్రజలకు మంచి పాలన అందించే ప్రయత్నం చేయడం లేదు. మళ్లీ తమకు మంచి రోజులు వస్తాయని ప్రజలు ఆశాభావంతో ఉన్నారని, అందుకే తమ పార్టీని విశేషంగా ఆదరిస్తున్నారని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

Back to Top