బెంగుళూరు: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మార్చి 3, 4 తేదీల్లో జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగుళూరులో రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. బెంగుళూరులో జరిగిన జీఐఎస్ రోడ్ షోకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. దేశ ఆర్ధిక ప్రగతిలో ఏపీ కీలక భూమిక పోషిస్తోంది.దేశం నుంచి జరిగిన ఎగుమతుల్లో ఏపీ నుంచి 4.6 శాతం మేర ఉన్నాయి.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు.
పరిశ్రమలకు కేటాయించేందుకు 49 వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. దీనికి అదనంగా లక్ష ఎకరాల భూమి పరిశ్రమల కోసం కేటాయించామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా 3 పారిశ్రామిక కారిడార్లు ఏపీలో ఉన్నాయి. ఈ కారిడార్లల్లో 48 వేల ఎకరాల భూమి కూడా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. కోవిడ్ పరిస్థితులు దాటుకుని ఏపీ 11.46 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. కియా, బ్రాండిక్స్, ఆపాచే లాంటి విదేశీ సంస్థలు ఏపీలో పని చేస్తున్నాయి. శ్రీసిటీలో 28 దేశాలకు చెందిన వేర్వేరు కంపెనీలు పారిశ్రామిక ఉత్పత్తిలో ఉన్నాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.9 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిందని మంత్రి వివరించారు.
కొత్తగా 3 పోర్టుల నిర్మాణంతో ఏపీలో పోర్టుల సంఖ్య 10కి చేరుతుంది. పోర్టులు సిద్ధం అయితే ఏపీ నుంచి జరిగే ఎగుమతులు 10 శాతానికి చేరతాయని అంచనా వేస్తున్నాం. పోర్టు ఆధారిత ఉత్పత్తి పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యమని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వివిధ రంగాల వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని అందించేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధి సంస్థలూ ఏర్పాటు చేశాం. పరిశ్రమలు అతితక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునేలా వివిధ చర్యలూ చేపట్టాం. ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.