కర్నూలు : ‘రాయలసీమ ద్రోహి చంద్ర బాబు. ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి పట్టిన పెద్ద శని’ అని రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు గంగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారన్నారు. అలాంటి వ్యక్తి నేడు ప్రాజెక్టుల సందర్శనకు రావడం వింతగా ఉందన్నారు. జిల్లాకు వచ్చే ముందు ఈ ప్రాంతానికి చేసిన మేలు ఏమిటో ఆయన ప్రజలకు చెప్పి రావాల్సింది అన్నారు. తమిళనాడుతో ఉన్న ఒప్పందం మేరకు తెలుగు గంగ ప్రాజెక్టును దివంగత ఎన్టీఆర్ తీసుకొస్తే వైఎస్‌ఆర్ ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రిగా రైతాంగానికి సాగునీరు అందించేందుకు మహానేత వైఎస్‌ఆర్ తపించారన్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఏ చెరువుకు నీరందించలేదన్నారు. ఆయన హయాంలో కరువు కాటకాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందిపడ్డారన్నారు. డోన్, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోని 68 చెరువులను నీటితో నింపేందుకు పనులు పూర్తి చేసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిది అన్నారు. రూ.వేల కోట్లతో వేదవతి, ఆర్‌డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేస్తానని గత ఎన్నికల ముందు జీఓ ఇచ్చిన బాబు ఏం చేశారో చెప్పాలన్నారు. కరోనా విపత్తులోనూ ప్రజలకు తాగు, సాగు నీటికి కష్టాలు లేకుండా చూసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ముచ్చమర్రి లిఫ్ట్ ఇరిగేషన్‌ను దివంగత సీఎం వైఎస్‌ఆర్ ప్రారంభించారన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మోటర్లను పట్టిసీమ కోసం ఎత్తుకెళ్లిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఒక్కరే ప్రాజెక్టులను సందర్శించడం వల్ల ప్రయోజనం లేదని, తమను ఆహ్వానిస్తే ఆయా ప్రాజెక్టులకు వైఎస్‌ఆర్, సీఎం జగన్ చేసిన కృషిని చెబుతామన్నారు. బాబును ప్రజలు నమ్మరు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీవై రామయ్య మాట్లాడుతూ చంద్రబాబు 14ఏళ్లు అధికారంలో ఉండి ఏ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపొందించారో ప్రజలకు చెప్పాలన్నారు. వ్యవసాయమే దండగన్న ఆయనకు ప్రాజెక్టులను సందర్శించే అధికారం ఎక్కడిదన్నారు. మహానేత వైఎస్‌ఆర్ జలయజ్ఞం పేరుతో రూ.60వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మిస్తే.. చంద్రబాబు కనీసం మోటర్లు సైతం ఏర్పాటు చేయలేదన్నారు. అలాంటి వ్యకి నేడు ప్రాజెక్టుల సందర్శనకు వస్తే ప్రజలు నమ్మరన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఆర్భాటం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధిని సమానంగా తీసుకెళ్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై 80శాతం మంది ప్రజలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారని చెప్పారు. సొంత నియోజకవర్గం కుప్పంకు నీరివ్వలేని చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన యాత్ర చేపట్టడం హాస్యస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 కాలంలో రూ.146కోట్లు ఖర్చు చేస్తే, 2019–23 మధ్య తమ ప్రభుత్వం రూ.448.98 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీన్ని బట్టి ఎవరి హయాంలో ప్రాజెక్టుల అభివృద్ధి ఎక్కువ జరిగిందో తెలుస్తుందన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వరరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం. సుభాష్ చంద్రబోస్, పార్టీ నాయకులు సీహెచ్ మద్దయ్య, ధనుంజయ ఆచారి, విజయ పాల డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి, కార్పొరేటర్ శ్వేతారెడ్డి పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ కృషి ఎనలేనిది ముచ్చుమర్రి ప్రాజెక్టు పూర్తికి వైఎస్‌ఆర్ కృషి ఎనలేనిది. సరిగ్గా 5 శాతం పనులు కూడా చేయని చంద్రబాబు ఆ ప్రాజెక్టును సందర్శించడం విడ్డూరం. కాటన్ అర్థర్ తరువాత మహానేత వైఎస్‌ఆర్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. – నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ప్రాజెక్టులకు ఏం చేశారో చెప్పాలి మహానేత వైఎస్‌ఆర్ జలయజ్ఞం పథకం కింద గాలేరునగరి, ఎస్‌ఆర్‌బీసీని అభివృద్ధి చేస్తే.. చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చెప్పకుండా ప్రాజెక్టుల సందర్శన చేయడం తగదు. బాబు అధికా రంలో ఉంటే వర్షాలు రావని పేరు. అందుకే ఆయనను 2019 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. –బనగానపల్లెఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలో ఆయన ప్రాజెక్టులకు ఏదో చేసినట్లు నటిస్తున్నారు. ఆయన ఎన్ని ఎత్తులు వేసినా అధికారంలోకి రారు. – ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి బాబు గురించి జనానికి తెలుసు రైతుల సంక్షేమం కోసం నాడు మహానేత వైఎస్‌ఆర్, నేడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన ఏ లక్ష్యంతో యాత్ర చేస్తున్నారో ప్రజలకు తెలుసు. –కేడీసీసీబీ చైర్‌పర్సన్ విజయమనోహరి మభ్యపెట్టేందుకే పర్యటనలు ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టేందుకు రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ యాత్రలు, పర్యటనలు చేస్తున్నారు. వీరు ఎన్ని కుటల్రు పన్నినా, మాయమాటలు చెప్పినా జనం నమ్మరు. – కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్