వైయస్ఆర్ జిల్లా: పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మందా సాల్మన్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనను ఖండిస్తూ, టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు (సింగమాల) తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ గారి ఆదేశాల మేరకు, రేపు 17 జనవరి 2026 (శనివారం) ఉదయం 10.00 గంటలకు కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా మారాయని, చట్టపాలన పూర్తిగా క్షీణించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువకుడు సాల్మన్ హత్యకు బాధ్యులైన దోషులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి వైయస్ఆర్ కడప జిల్లాలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ సెల్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష, తదితరులు పాల్గొని సంఘీభావం తెలపనున్నట్లు తెలిపారు.