పూలే ఆశయాలు, కలలను సాకారం చేస్తున్న  సీఎం వైయ‌స్  జగన్‌ 

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుక‌లు 

తాడేపల్లి:‘పూలే గారి ఆశయాలు, కలలను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సాకారం చేస్తున్నార‌ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో 139 కులాలు ఉంటే, వాటికి గుర్తింపు ఇస్తూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 672 మంది డైరెక్టర్లను నియమించార‌ని తెలిపారు. 
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల సంక్షేమం కోసం పని చేసిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నివాళలర్పించారు. పూలే విగ్రహానికి పూలమాల సమర్పించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు జోగి రమేష్, విడదల రజని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో పాటు, పార్టీ నేతలు పలువురు ఆయనకు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ..:
    ‘పూలే గారి ఆశయాలు, కలలను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సాకారం చేస్తున్నారు. రాష్ట్రంలో 139 కులాలు ఉంటే, వాటికి గుర్తింపు ఇస్తూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 672 మంది డైరెక్టర్లను నియమించారు. ఆ విధంగా అన్ని కులాల వారి ఆత్మగౌరవాన్ని సీఎం నిలబెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఒక తాటిపైకి తెచ్చి, ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఒక రుజుమార్గంలో నడుస్తోంది. కరోనా వల్ల కష్టకాలం వచ్చినా కూడా, నిరుపేదలకు అవసరమైన రేషన్‌ సరఫరా చేస్తున్నాం. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని, కార్యక్రమాన్ని ఆపలేదు. ఇప్పుడు బలహీనవర్గా శకం ప్రారంభమైంది. అందరూ ఏకమై జగన్‌ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఎందుకంటే ఆయన హయాంలో అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతోంది. పూలే ఆశయ సాధకుడు పాలకుడయ్యాడు. అందులో నేనూ భాగస్వామి అయినందుకు సంతోషిస్తున్నాను’.
    ‘సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రతి రోజూ పూలే గారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారు. అందుకే ఆయన అందరికీ మార్గదర్శి. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడం కోసం విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. అందుకే ప్రజలంతా ఆలోచించాలి. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్‌ గురుమూర్తిని వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా ఈ ఎన్నికలో నిలబెట్టారు. ఆ విధంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్, మరోసారి సామాన్యుల గురించి అనుక్షణం ఆలోచిస్తారని రుజువైంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంతా ఏకమై తిరుపతి ఉప ఎన్నికలో డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించాలి’.

జంగా కృష్ణమూర్తి. ఎమ్మెల్సీ:
– ‘సామాజిక తత్వవేత్తగా, సంస్కరణ వాదిగా మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని కొనసాగించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం శ్రమించారు. ఆనాడు ఉన్న వెనుకబాటుతనం, వివక్షకు కారణాలు వెతికి, వాటి నిర్మూలన కోసం ప్రయత్నించారు. ఆయన కేవలం ఒక వర్గానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదు. ఒక సామాజిక తత్వవేత్త. స్త్రీ అభ్యుదయ వాది. ఆయనను ఆదర్శవాదిగా తీసుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, సమాజంలోని అన్ని వర్గాలు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు’.

విడదల రజని, ఎమ్మెల్యే:
– ‘మహాత్మా జ్యోతిరావు పూలే మహిళల సాధికారత కోసం ఎంతో పరితపించారు. సరిగ్గా ఇప్పుడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కూడా పూలే బాటలోనే నడుస్తున్నారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అలాగే నామినేటెడ్‌ పదవుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు, మహిళలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ విధంగా జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారు’.

జోగి రమేష్, ఎమ్మెల్యే:
– ‘ఆనాడు జ్యోతిరావు పూలే చూపిన బాటలో మహానేత వైయస్సార్‌ నడిచారు. అందుకే సామాన్యులు, నిరుపేదలు కూడా బాగా చదువుకోవాలని ఆయన తపించారు. ఆ దిశలో పథకాలు అమలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే బాటలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పని చేస్తున్నారు. మంత్రి పదవులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు పూర్తి ప్రాధాన్యం ఇచ్చారు. స్పీకర్‌గా ఒక బీసీకి అవకాశం ఇచ్చారు. చివరకు జనరల్‌ స్థానాల్లో కూడా బీసీలను కూర్చోబెట్టారు. అలా ఇప్పుడు విజయవాడ మేయర్‌గా ఒక బీసీ మహిళ ఉన్నారు’.
 

Back to Top