తాడేపల్లి: మరిది చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసం పోలీసు అధికారులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపణలు చేశారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకులు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని ఆయన ధ్వజమెత్తారు. పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కంటే చెల్లెలి భర్తకు మేలు చేసేలా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను కూలదోసే సమయంలో బాబుకు పురంధేశ్వరి సపోర్టు చేశారని దుయ్యబట్టారు. బాబు కోసం పురంధ్వేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని విమర్శించారు. ఏపీలో బీజేపీలో బలం ఉందా లేదా అనే విషయం అందరికీ తెలుసని పేర్ని నాని అన్నారు. బీజేపీ టికెట్లను పురంధేశ్వరి ఎవరికి ఇప్పించారో చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీలో ఒరిజినల్ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారంతా టీడీపీ నేతలనేనని అన్నారు. అమిత్ షా దగ్గరకు చంద్రబాబును పురంధేశ్వరి తీసుకెళ్లారని ప్రస్తావించారు. మరిది కళ్లల్లో ఆనందం కోసం పోలీసు అధికారులపై పురంధేశ్వరి ఆరోపణలు చేశారని విమర్శించారు. రామోజీరావు, చంద్రబాబు తప్పడు పనులు, పాపాలపై చర్యలు చేపట్టిన అధికారులపై పురంధేశ్వరి ఫిర్యాదులు చేశారు. 22 మంది నిజాయితీగల అధికారులపై ఫిర్యాదు చేస్తే ఈసీ ఎందుకు ప్రశ్నించలేదు. ఎవరిని ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయాలో పురంధేశ్వరి ఈసీకి లిస్ట్ ఇచ్చారు. బదిలీ చేసిన వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా పేర్లు ఇచ్చారు. జాబితా ఇవ్వడానికి ఆమె ఎవరు? తప్పుడు ఆరోపణలకు ఏమైనా ఆధారాలు చూపించారా? ఇది బరి తెగింపు కాదా? పురంధేశ్వరి కావాలనుకున్న అధికారులకు ఎంత ఇచ్చారో చెప్పాలి. నిజాయితీగా పని చేసిన ఐపీఎస్ అధికారులపై విషం చిమ్మడం దారుణం. పురంధేశ్వరి జాబితా ఇస్తే ఈసీ ఎందుకు మాట్లాడటం లేదు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పురంధేశ్వరి వైఖరిపై రేపు సీఈఓకి ఫిర్యాదు చేస్తామని పేర్ని నాని పేర్కొన్నారు.