మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హతే లేదు మండిపడ్డ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు ఏదీ? మహిళలకు ఉచిత బస్సు ఉసే లేదు ఆడబిడ్డ నిధికి బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యం తల్లికి వందనంకు కూడా అరకొర కేటాయింపులే దీపం పథకం కూడా పూర్తి అమలు చేయడం లేదు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వైయస్‌ఆర్‌సీపీ హయాంలోనే మహిళలకు న్యాయం మహిళల ఆర్థిక స్వావలంభనకు చేయూత ప్రతి మహిళకు అన్నగా అండగా నిలిచిన వైయస్ జగన్ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పష్టీకరణ తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాడేపల్లి: అసెంబ్లీ వేదికగా మహిళా సాధికారత గురించి సీఎం చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలను నమ్మించి మోసం చేస్తున్న చంద్రబాబుకు మహిళా సాధికారతపై మాట్లాడే అర్హతే లేదని అన్నారు. వైయస్ జగన్ హయాంలోనే రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వావలంభన సాధ్యపడిందని అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ఎన్నికల్లో మహిళలకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు వాటిని పూర్తిగా విస్మరించారు. గతంలో వైయస్ జగన్ గారు స్కూళ్ళలో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించేందుకు గానూ అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చారు. దానిని చూసి కాపీ కొట్టి తల్లికి వందనంను కూటమి పార్టీలు ప్రకటించాయి. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ పథకాన్ని అమలు చేయకుండా నీరుగారుస్తున్నారు. తల్లికి వందనంకు ఏడాదికి వాస్తవానికి రూ.13వేల కోట్లు అవసరం కాగా తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరంకు బడ్జెట్‌లో రూ.8200 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న 2024-25 సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. హామీల అమలుకు ఎగనామం పొరుగు రాష్ట్రాలను చూసి కూటమి పార్టీలు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అక్కడి ప్రభుత్వాలు అమలు చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలు అవుతున్నా మహిళలకు ఉచిత బస్సు అనే ఊసే ఎత్తడంలేదు. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో 18-60 సంవత్సరాల లోపు ఉన్న వారికి ప్రతినెలా రూ.1500 ఇస్తామంటూ ప్రకటించి, ఈ రోజుకూ వారికి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీపం పథకంకు కావాల్సింది రూ.4 వేల కోట్లు అయితే బడ్జెట్‌లో కేటాయించింది చూస్తే రూ.2439 కోట్లు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లు ఉన్న బిపిఎల్ కుటుంబాలు 1.48 కోట్లు. ఈ ఏడాది ఒక్క సిలెండర్ మాత్రమే 90 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు. యాబై ఏళ్ళకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. కానీ దీనిని ఎక్కడా అమలు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగింటి మహిళల పార్టీ అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు రూ.3 నుంచి 10 లక్షల వరకు సున్నావడ్డీ రుణాలు ఇస్తామని అన్నారు. అవి ఎప్పుడు ఇస్తారో చంద్రబాబు ప్రకటన చేయాలి. రాష్ట్రంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని అన్నారు. మిగిలిన 2.49 కోట్ల మంది ఆడబిడ్డలకు ఎలా న్యాయం చేస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. గతంలోనూ మహిళలను మోసగించారు 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రూ.14వేల కోట్లు రుణమాఫీ అంటూ హామీ ఇచ్చి మొండిచేయి చూపించారు. 2016 అక్టోబర్ నుంచి సున్నావడ్డీకి కూడా ఎగనామం పెట్టారు. ఆనాడు మోసం చేసి, తాను మారిపోయాను అంటూ మహిళల కోసం కొత్త హామీలు ప్రకటించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఆనాడు వైయస్ జగన్ గారు దిశ యాప్‌ను తీసుకువస్తే, దానిని చంద్రబాబు పేరుమార్చి శక్తి యాప్ అంటూ ఇప్పుడు హంగామా చేస్తున్నారు. వైయస్ జగన్ గారు తీసుకువచ్చిన వ్యవస్థలను కాపీ కొడుతున్నారు. వ్యక్తిత్వహననంకు పాల్పడుతున్నారు తల్లికి, చెల్లికి వైయస్ జగన్ గారు ఆస్తిలో వాటా ఇవ్వలేదంటూ అసెంబ్లీలో వ్యక్తిత్వహననంకు పాల్పడేలా చంద్రబాబు మాట్లాడటం దారుణం. చంద్రబాబు తన ఆస్తిలో తన సోదరికి, తమ్ముడికి ఎంత పంచి ఇచ్చారో వెల్లడించాలి. చివరికి ఆయన తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని కూడా కొడుకు నారా లోకేష్ పేరు మీద రాయించారు. వాటి గురించి కూడా ప్రజలకు చెప్పాలి. మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకే సాధ్యం. మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహించిన వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహించింది. వారిని ఆర్థిక, రాజకీయ, సామజికంగా ప్రగతి వైపు నడిపించింది. చేయూత ద్వారా ప్రతి మహిళలకు ఏటా రూ.18,750 అందించి వారిని ఆర్థిక స్వావలంభన వైపు నడిపించారు. ఆసరా ద్వారా నాలుగు విడతలుగా 2019 ఏప్రిల్ వరకు ఉన్న మహిళల అప్పును వారి ఖాతాలకు జమ చేశారు. 32 లక్షల మంది మహిళలకు ఇళ్ళస్థలాలు ఇచ్చారు. 22 లక్షల పక్కాగృహాలు నిర్మించి ఇచ్చారు. ప్రతి మహిళకు ఒక ఆస్తిని సమకూర్చలనే లక్ష్యంతో పనిచేశారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్స్క్ లో మహిళలకు యాబై శాతం కేటాయించారు. స్థానిక సంస్థల పదవులను కూడా యాబైశాతం మహిళలకే ఇచ్చారు.