విశాఖపట్నం:ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అండగా ఉంటామని, కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని హామి ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఉత్తరాంధ్రా ప్రజలకు, ఉక్కు ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు నాయుడు కేరాఫ్ అడ్రస్ అని.. కేవలం తన కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసం ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇది ముమ్మూటికీ ఉత్తరాంధ్రాకు తీరని ద్రోహమని.. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు అట్టర్ ప్లాప్ కావడంతో... చంద్రబాబు ఆ కోపాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులపై చూపిస్తున్నారని ఆక్షేపించారు. ఉత్తరాంధ్రాలో ఖరీదైన భూములను ఇప్పటికే తమ వారికి పప్పుబెల్లాల్లా కట్టబెట్టిన చంద్రబాబు కన్ను.. ఇప్పుడు లక్షల కోట్ల ఖరీదైన స్టీల్ ప్లాంట్ భూములపై పడిందని... అందుకే ప్రైవేటీకరణకు మద్ధతిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా... వైయస్.జగన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ పోరాటం చేస్తుందని కే కే రాజు స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ● కూటమి పెట్టుబడుల సదస్సు అట్టర్ ఫెయిల్... కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖలో సీఐఐ సమ్మిట్ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా ఈ సమ్మిట్ లో వచ్చే పెట్టుబడులు గురించి, చంద్రబాబు సంపద సృష్టి గురించి, దేశ, విదేశాల్లో సైతం పర్యటించి ఆయన తనయుడు లోకేష్ ని రాజకీయంగా పైకి లేపే ప్రయత్నం చేశారు. దీని కోసం మొంధా తుపాన్ లో ప్రజల కష్టాలను సైతం పట్టించుకోలేదు. తుపాన్ లు వస్తుంటాయి, పోతుంటాయి అదేమంత పెద్ద విషయం కాదన్న రీతిలో వ్యవహరించిన ప్రభుత్వ తీరును ప్రజలందరూ గమనించారు. రెండు రోజులు జరిగిన పెట్టుబడుల సదస్సుపై... కొంతమంది ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కూటమి సానుభూతిపరులైన వ్యాపారులు సైతం పెదవివిరుస్తున్నారు. వీరంతా ప్రభుత్వం ఆశించిన మేరకు సదస్సు విజయవంతం కాలేదు... ప్రభుత్వ హడావుడి తప్ప నిర్దేశించుకున్న లక్ష్యంలో కనీసం 50 శాతం పెట్టుబడులు కూడా రాలేదని చెబుతున్నారు. దానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు సమ్మిట్ లో విశాఖ ఉక్కు గురించి అసహనంతో మాట్లాడిన మాటలే నిదర్శనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు అనే మాట వెంటే గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. కాళ్లు కడిగి కన్యాదానం చేసి, రాజకీయంగా భవిష్యత్తును ప్రసాదించిన ఎన్టీరామారావు గారికి 1995లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకున్నప్పటి నుంచి.. ఇవాల్టి వరకు ప్రతి ఎన్నికల ముందు ప్రజలకు తియ్యనైన మాటలతో నమ్మించి... తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజలను వంచించడం చంద్రబాబు నైజం. అదే ఆయన రాజకీయం. ● లక్షల కోట్ల ఖరీదైన స్టీల్ ప్లాంట్ భూములపై చంద్రబాబు కన్ను... అదే విధంగా 2024 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కుకు సంబంధించి మాట్లాడిన మాటలు అందరూ చూశారు. వాటన్నింటినీ మర్చిపోయి... నిన్న స్టీల్ ప్లాంట్ ను తెల్లఏనుగుతో పోల్చుతూ... ప్లాంట్ కార్మికులే నష్టాలకు కారణం అని మాట్లాడారు. ఒకవైపు ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అన్న నినాదంతో వేలాదిమంది రైతులు, వేలాది ఎకరాల భూములను ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం త్యాగం చేయడంతో పాటు, 32 మంది ప్రాణత్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కును సాధించుకుంటే... ఇవాళ చంద్రబాబు నాయుడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారు. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు. అంతటితో ఆగకుండా... నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు వింటుంటే.... అసలు స్టీల్ ఫ్లాంట్ ను ప్రైవేటీకరించడమే కాకుండా... విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంచుతారా? లేదా? అన్న సందేహం కలుగుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రాలో ఉన్న కోట్ల రూపాయల ఖరీదు చేసే భూములను.. పెట్టుబడుల పేరుతో పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్న చంద్రబాబు నాయుడు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ భూములపై కన్నేసి.. ప్లాంట్ ను నిర్వీర్యం చేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. ● ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమయ్యాయి... చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి నేతలను సూటిగా ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో మీరు చెప్పిన మాటలేంటి? పచ్చి అబద్దాలు, తియ్యని మాటలు చెప్పి.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీస చిత్తశుద్ధి లేకుండా, ఏకపక్షంగా స్వార్ధపూరిత రాజకీయాలకు మీ వైఖరే నిదర్శనం. విశాఖ ఉక్కుపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న రామ్మోహన్ నాయుడు విపరీతంగా ప్రగల్భాలు పలికారు. డబుల్ ఇంజన్ సర్కారు ఆధ్వర్వంలో స్టీల్ ప్లాంట్ కు కేప్టివ్ మైన్స్ కేటాయిస్తామన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీని ఒప్పించి... పూర్తిగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం.. ఆ మేరకు కేంద్రంలో ఒప్పందం చేసుకున్నామని మాట్లాడారు. కానీ ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారు. ఈప్రాంత ప్రజలను కూటమి నేతలు ఎంత చులకనగా చూస్తున్నారంటే... జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పార్టీ ప్లీనరీ సమావేశం పెట్టి... పదే, పదే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకూడదు.. మోదీ, అమిత్ షాలు చాలా బిజీగా ఉంటారు. వాళ్లకు కొద్దిగా బ్రీఫ్ చేస్తే సరిపోదుంతని మాట్లాడతారు. మరోవైపు సీఎం చంద్రబాబేమో... పెట్టుబడులు సదస్సు ఫెయిల్ కావడంతో మీ ఆవేశాన్ని, అహంకారాన్ని ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల మీద చూపిస్తూ... వారిమీద నిందలు వేస్తున్నారు. మీకు కేంద్ర ప్రభుత్వం మీ మీద ఆధారపడి నడుస్తున్నా మీరు కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితిలో లేరు. మీరు 2014-19 వరకు దోచుకుని, దాచుకున్న మీ అవినీతి, గతంలో మీ మీదున్న కేసుల నేపథ్యంలో, మీ ఆస్తులను కాపాడుకోవడానికి విశాఖ ఉక్కు, ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నారు. ● మీ లొసుగులు కోసం రాజీ... స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నికల ముందు మీరు చెప్పినదేమిటి.. ఇవాళ మీరేం చెబుతున్నారని పాత్రికేయుల ప్రశ్నిస్తే మీకు బుద్ధుందా అని వారిపైనా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పనిచేయకుండా పడుకుంటే ఎలా లాభాల్లోకి వస్తుందంటూ కార్మికుల మీద నోరు పారేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పాలన మరిచి మొద్దు నిద్రపోతుంది. అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలను గాలికొదిలి... వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఇచ్చిన హామీలు అమలుచేయలేక... ఆడలేక మిద్దెలను ఓడిపోమ్మన్నట్టు... మీడియాపై విరుచుకుపడుతున్నారు. ఇవాళ చంద్రబాబుకు కేంద్రంతో లొసుగులు, లావాదేవీలు లేకపోతే.. ఏపీ రాష్ట్ర భవిష్యత్తు కోసమే మీరు కేంద్రంతో పొత్తు పెట్టుకున్నట్లైతే... విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మీ మద్ధతు ఉపసంహరించుకుంటామని చెప్పండి. తక్షణమే కేంద్రం దిగి వస్తుంది. అవన్నీ మర్చిపోయి.. సమస్యను పక్కదోవ పట్టించడం కోసం.. అధికార అహంకారంతో మాట్లాడుతున్న మీ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పెట్టుబడుల పేరుతో మీరు ప్రజలను మోసం చేస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... ఉత్తరాంధ్రా ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనుకుంటే.. ఆంధ్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడ్డానికి చిత్తశుద్ధితో పనిచేయండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగేలా మేం బీజేపీపై ఒత్తడి తెస్తామని, స్టీల్ ప్లాంట్ కి సొంత ఘనులు తీసుకొచ్చి తీరుతామని, ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పదే, పదే హామీ ఇచ్చారు. ఎన్నికలకు మందు అనేక హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లను నెరవేరుస్తూ ప్లాంట్ ప్రవైటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతోపాటు, కార్మికులపై మీరు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. ప్లాంట్ ను 32 విభాగాలుగా విభజించి ప్రైవేటీకరణ కోసం పిలిచిన టెండర్లను కూడా రద్దు చేయాలి. ఇంకా మొదలుకాని మిట్టల్ ప్లాంట్ కు నా చొరవతోనే సొంత గనులు కేటాయించారని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కుకు ఎందుకు సొంత గనులు కోసం ప్రయత్నించడం లేదని కే కే రాజు నిలదీశారు. కార్మికులకిచ్చిన హామీ మేరకు ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కేకే రాజు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసారు. స్టీల్ పరిరక్షణ సమితి రూపొందించే కార్యాచరణ ప్రణాళికకు అండగా ఉంటామని కే కే రాజు తేల్చి చెప్పారు.