తిరుపతి : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించకుండ కూటమి సర్కార్ ఆరు కోట్ల మంది ఆంధ్రుల్ని అవమానించిందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. అవతరణ దినోత్సవం ఎప్పుడు?.. భావితరాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించకపోవడంపై ఆర్కే రోజా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆమె ఒక సందేశం ఉంచారు. ‘‘మన చుట్టూ ఉన్న.. తెలంగాణకు అవతరణ దినం ఉంది. కర్నాటకకు అవతరణ దినం ఉంది. తమిళనాడుకు అవతరణ దినం ఉంది. ఒడిశాకు అవతరణ దినం ఉంది. కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం వలనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి అవతరణ దినోత్సవం అంటూ లేకుండా పోయింది. ‘‘మా జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాం. అయితే చంద్రబాబు ప్రభుత్వం జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవరం నిర్వహణ రద్దు చేసింది. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసేలా ఈ నిర్ణయం ఉంది అని ఆర్కే రోజా అన్నారు.