తాడేపల్లి: కూటమి పాలనలో రాష్ట్రంలో అవినీతి మాఫియా విచ్చలవిడిగా రాజ్యమేలుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను ఏ విధంగా దోచుకుని, అవినీతి సంపాదన కూడబెట్టుకుందామన్న ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలు, వారి సంక్షేమం గురించి ఆలోచించే తీరిక లేదని మండిపడ్డారు. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు కరువుతో అన్నదాతలు అగచాట్లు పడుతుంటే, వారిని ఆదుకోవడానికి నిర్ధష్టమైన కార్యాచరణ లేని, కనీసం సమీక్ష కూడా నిర్వహించిన ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న ప్రభుత్వం: ముఖ్యమంత్రి సినిమా సెట్ లు ఏర్పాటు చేసుకుని ప్రసంగాలివ్వడం తప్ప.. సంక్షోభంలో ఉన్న వ్యవసాయం గురించి, రైతు సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. భారతదేశ చరిత్రలో రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రైతులు అతివృష్టి, అనావృష్టితో ఇబ్బంది పడుతుంటే... వ్యవసాయశాఖపై ఒక్క సమీక్ష కూడా జరపలేదు. రైతుల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో లేడు. ఇక వ్యవసాయశాఖ మంత్రి అయితే ఆ శాఖను నిర్వహిస్తున్నాడా ? లేదా ? కూడా తెలియడం లేదు. అసలు వ్యవసాయశాఖ పనిచేస్తుందా ? లేదా ? అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది. మద్ధతు ధర ఇవ్వకుండా వరి పంటను పూర్తిగా గాలికొదిలేశారు. ఇక మిగిలిన మిర్చి, మామిడి, ప్రత్తి, కోకో, పొగాకు, బొప్పాయి ఇలా ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేదు. కేవలం ప్రకటనలకే ప్రభుత్వం పరమితమవుతోందే తప్ప... రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. భారీ వర్షాలు కురుస్తుంటే... పంట ఏ మేరకు నష్టపోయిందన్న అంచనాలు లేవు. మరోవైపు వర్షాభావ పరిస్థితులన్న ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి, ప్రత్యామ్నాయ మార్గాలేంటి అన్న ఆలోచన, కార్యాచరణ ప్రణాళిక కూడా కరువైంది. ఇది అత్యంత దుర్మార్గం. దోపిడీ, అఘాయిత్యాలే ప్రభుత్వ ప్రాధాన్యంశాలు: దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, దాడులు, తప్పుడు కేసులు, ఇసుక, మట్టి, లిక్కర్, మైనింగ్ మాఫియా ఇవే ఈ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు. కుక్కపిల్ల, సబ్బుబిల్ల, అగ్గిపుల్ల కాదేదీ కవిత కనర్హం అని మహాకవి చెప్పినట్లు... చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక, మట్టి, లిక్కర్ ఇలా కాదేదీ దాచుకోవడానికి, దోచుకోవడానికనర్హం అన్నట్టు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు దోచుకోవడమే పరమావధిగా ఉన్నారు. రైతుల గురించి, ప్రజలకిచ్చిన హామీలు గురించి, అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. రైతులకు యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్యమిది: రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పచ్చ పత్రికల్లోనే ఎరువులు ఏమైనట్లు ? అన్న వార్త ఎరువులు ఏ విధంగా పక్కదారి పడుతున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, అనంతరపురం, నంద్యాల, కృష్ణ, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎరువులు సమస్య ఎక్కువగా ఉంది. రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వలేకపోతే... పంట నాణ్యత దెబ్బతిని రైతులు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కనీస అవసరం ఉన్నచోట్ల కూడా ప్రభుత్వం యూరియా సరఫరా చేయలేకపోతుంది. దీనికి ప్రదాన కారణం ప్రయివేటు దుకాణాలకు, వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల ఇవాళ బ్లాక్ మార్కెట్ లో యూరియా ఒక బస్తాకు రూ.200 అదనంగా ఖర్చు పెట్టి కొనాల్సిన దౌర్భాగ్య పరిస్ధితులు నెలకున్నాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా 12.70 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు పంపిణీ చేశాం. విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు అన్నీ రైతులు గ్రామం దాటి వెళ్లాల్సిన అవసరం రాకుండా ఆర్బేకేల దగ్గరే ఏర్పాటు చేసాం. దీనివల్ల రైతులు పనిమానుకుని ఎరువులు కోసం క్యూలైన్లో పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతి బస్సా యూరియా రవాణా ఖర్చు తగ్గి రూ.30 నుంచి రూ.50 వరకు ఆదా అయింది. దీనివల్ల రూ.80 కోట్ల వరకు రైతులకు ఆదా అయింది. ఇవాళ వాటన్నింటినీ పక్కనపెట్టారు. మా ప్రభుత్వ హయాంలో యూరియా కొరత లేకుండా చేయడానికి ముందే ఆలోచించి ప్రతి జిల్లాలో యూరియా బఫర్ స్టాక్ నిల్వ ఉంచాం. రైతులకు మొక్కుబడి సేవలు: ఈ ప్రభుత్వ హయాంలో రైతు సేవా కేంద్రాలు మొక్కుబడిగా మారిపోయాయి. వాటి ద్వారా రైతులకు ఏ విధమైన సాయం అందించకుండా.. రైతుల తరహాలో వాటిని కూడా సంక్షోభంలోకి నెట్టివేశారు. ఎరువులు కొరతతో రైతులు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇవాళ రాష్ట్రానికి కేటాయించిన యూరియా సగం కూడా మన రాష్ట్రానికి చేరలేదని జాతీయ పత్రికల్లో సైతం వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఎరువులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కేటాయించిన ఎరువులు ఇవ్వడంలో ఎందుకు ఈ ప్రభుత్వం విఫలమైంది ? యూరియా ఎందుకు లభించడం లేదు? కారణం మీరు ప్రయివేటు వర్తకులు దగ్గర ముడుపులు తీసుకుని, వారికి యూరియా కట్టబెట్టారు. దీంతో ప్రయివేటుగా ప్రతిబస్తాకు రూ.200 వరకు అదనంగా చెల్లించి రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో చంద్రబాబు రైతులకు సమాధానం చెప్పాలి? కూటమి పాలనలో అడుగడుగునా అన్నదాతల అగచాట్లు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ రోజూ, ఏ ఒక్క రైతు ఎరువులు కోసం క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రైతులు ఎరువులు, విత్తనాల కోసం రోడ్డెక్కడమే? కట్ట యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్ లో 16.76 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వమే నివేదిక తయారు చేసింది. మా దగ్గర సమృద్ధిగా ఎరువులు ఉన్నాయని ఒకవైపు చెబుతారు. మరోవైపు మా దగ్గర 6.45 లక్షల టన్నుల స్టాక్ మాత్రమే ఉందని భిన్నమైన స్టేట్ మెంట్ ఇస్తారు. తీరా ఇంతవరకు రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా చేసిన ఎరువులు చూస్తే కేవలం 65 వేల టన్నులు మాత్రమే. మరోవైపు మార్కె ఫెడ్ గోదాముల్లో కేవలం మరో 55వేల టన్నుల ఎరువులు మాత్రమే నిలువ ఉంచారు. అంటే 16.76 లక్షల టన్నుల ఎరువుల్లో నామమాత్రంగా ఓ 1.20 లక్షల టన్నుల మాత్రమే నిలువ ఉంచి మిగిలిన సరుకును ఏ హోల్ సేలర్ కి ఇచ్చారు. ఏ విధంగా దోచుకుంటున్నారు?. రైతులకు అసలైన ధరకే ఎరువులిచ్చే సొసైటీలు, మార్క్ ఫెడ్, రైతు సేవా కేంద్రాలను పక్కనపెట్టి ఇవాళ నేరుగా ప్రయివేటు డీలర్లకిచ్చి వారిదగ్గర ముడుపులు తీసుకుంటున్నారు. రైతు సంక్షేమం కోరుకున్నట్టైతే.. అదనపు ధర లేకుండా ప్రభుత్వం నిర్దేశించినట్టు రూ.266.50 కే ఇవ్వాల్సిన యూరియాను ఇవాళ రూ.350 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారంటే రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారో అర్ధం అవుతుంది. ఇలా అన్ని రకాలుగా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వమిది. ఒకవైపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలను, పక్కనున్న తెలంగాణా, కర్ణాటకలో ఇస్తున్న పథకాలను కాపీ కొట్టి న చంద్రబాబు ..ప్రజలను మోసం చేయాలన్న ఆలోచనతో వాటన్నింటినీ ప్రకటించాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ మర్చిపోయి...ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గులేదు. ఇచ్చిన హామీలేవీ చెయ్యకుండానే ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి అన్నీ చేసేశామని చెబుతుంటే... ప్రజలు నవ్వుతారు అన్న ఆలోచన కూడా లేదు. నిస్సిగ్గుగా కన్నార్పకుండా అబద్దాలు చెబుతున్నాడు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఖజనాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే మిగిల్చిపోయాడు. ఆ టైంలో అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు నాలుగు విడతల్లో రూ.12,500 చొప్పున రూ.50 వేలు ఇస్తామని చెప్పి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని రూ.13,500 పెంచి ఐదు విడతలకు పొడిగించి రూ.67,500 రైతులకు పెట్టుబడి సాయం అందించారు. ఖరీప్ ప్రారంభం ఎప్పుడు, రబీ ఎప్పుడు, రైతులకు ఏ విధంగా సాయం చేయాలన్నదానిపై క్యాలెండర్ విడుదల చేశారు. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు రైతులకు కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తానని చెప్పాడు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని బాండ్లు పంచి ఇచ్చి.. ఇవాల కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు నేను రూ.14వేలు కలిపి ఇస్తానని చెప్పాడు. తీరా అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. తొలి ఏడాది పూర్తిగా రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టి... రెండో ఏడాది కూడా సెట్ వేసి, రైతు వేషం కట్టి రూ.5వేలు మాత్రమే ఇచ్చాడు. అడిగితే మా దగ్గర డేటా లేదని సాకులు చెబుతున్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతుభరోసా అందించాం. ఇవాళ కూటమి ప్రభుత్వం 7 లక్షల మంది రైతులకు సాయం అందించకుండా వాతలు పెట్టింది. రైతులు పంటలు వదిలేసి పెట్టుబడి సాయం కోసం అధికారులు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి వైయస్ఆర్‌సీపీ దాదాపు రూ. 7800 కోట్లు ఖర్చుపెట్టి.. వివధ రకాల పంటలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. లాభ, నష్టాల గురించి ఆలోచించకుండా గిట్టుబాటు ధర రాని పంటలకు రైతు నష్టపోకూడదని మేమే కొనుగోలు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి, పత్తి పంటలకు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతుంటే మార్కిఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి.. వాటికి అన్ని రకాలుగా పరిమితులు విధిస్తున్నారు. క్వాలిటీ ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పి... రైతుల పంటను తిరస్కరిస్తున్నారు. ఉద్యానవన పంటలు, వ్యవసాయ పంటలకు సంబంధించి ఒక్కదానికీ గిట్టుబాటు ధర కల్పించిన దాఖలాలు లేవు. ఉచిత పంటల బీమా చూస్తే... వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతుల తరపున పూర్తి బీమా ప్రీమియం ప్రభుత్వే చెల్లించింది. ప్రధానమంత్రి ఉచిత ఫసల్ బీమా పథకం కింద రైతు, రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన ప్రీమియమ్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పాం... కానీ యూనివర్సిలైజేషన్ కింద అందరికీ ఈ పథకం ఇవ్వండని అడిగితే కేంద్రం కుదరదు అని చెప్పింది. ఆ సమయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు నష్టం చేకూర్చే ఈ బీమా పథకంలో ఉండకూడదని బయటకు వచ్చి.. మూడేళ్లలో రాష్ట్ర ఖజానా నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం, రైతు ముగ్గురి ప్రీమియమ్ భరించాం. ఐదేళ్లలో క్రమం తప్పకుండా రూ.2987 కోట్లు ఒకే విడతలో చెల్లించాం. నియోజకవర్గానికి ఒక అగ్రిటెస్టింగ్ ల్యాబులు పెట్టాం. జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేశాం. ఆర్బీకేలు పూర్తిగా అస్తవ్యస్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 250 పై చిలుకు ఆత్మహత్యలు చేసుకున్నారంటే .. రైతుల పట్ల మీరు తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలే కారణం. వ్యవసాయశాఖ మంత్రిని తప్పించాలి: తక్షణమే రైతు సమస్యలను తీర్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యూరియా కొరత వెంటనే తీర్చాలి. భారీ వర్షాలకు నీట మునిగిన పంట నష్టాన్ని అంచనా వేయడంతో పాటు, అనావృష్టి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు, మంత్రుల అవినీతి కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలి. ఇవాళ వ్యవసాయశాఖ మంత్రి మీద, మంత్రి పేషీ మీజ ఆగ్రోస్ జీఎం రాసిన లేఖకు సమాధానం చెప్పారా? విచారణ చేయించారా ? అధికారులను ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తున్నారో తెలుస్తోంది. ఎప్పుడైనా ఈ స్ధాయిలో అవినీతి విన్నామా? ఈ స్దాయిలో అవినీతి చేస్తూ.. రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు. రైతులకు నాణ్యమైన ఉపకరణాలు ఇవ్వకుండా కమిషన్లకు కక్కుర్తి పడి, నాసిరకం పరికరాలు కొనుగోలుకు దిగజారారా ? ఎంత దారుణమని ప్రభుత్వాన్ని నిలదీశారు. అందదరూ కలిసి ఉమ్మడిగా కలిసి దోచుకుంటున్నారు, కాబట్టి విచారణ, చర్యలు లేకుండా దాచిపెడుతున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వ్యవసాయశాఖ మంత్రిని తొలగించి.. విచారణ జరిపించాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.