నరసరావుపేట: రాష్ట్రంలో దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు చివరికి చికెన్ అమ్మకాలను కూడా వదలడం లేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట లోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన అనుయాయుడు చికెన్ బాషా ద్వారా చికెన్ విక్రయాలపై ఆంక్షలు పెట్టి, జేబులు నింపుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం దాచేపల్లిలో బాషా మాత్రమే చికెన్ విక్రయాలు చేస్తాడని, ఆయన చెప్పిన ధరలకే ప్రజలు చికెన్ కొనుగోలు చేయాలంటూ హుకుం జారీ చేశారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని అన్ని చికెన్ షాప్‌లను మూయించి, అధిక రేట్లకు చికెన్ అమ్మకాలను చేయిస్తూ ప్రతినెలా లక్షల రూపాయలు దండుకునేందుకు సిద్దయ్యారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... చరిత్రలో ఎప్పుడూ జరగని అవినీతి కూటమి ప్రభుత్వంలో జరుగుతోంది. కూటమి ఏడాది పాలనలోనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రంలో అవినీతిలోనూ విడ్డూరాలు జరుగుతున్నాయి. అవినీతికి ఇది అర్హం అనేలా అన్నింట్లోనూ తెలుగుదేశం నాయకులు దోచేసుకుంటున్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో గ్రామాలను పట్టణాలుగా అభివృద్ధి చేస్తే, కూటమి ప్రభుత్వంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ పేకాట క్లబ్బులు నడుపుతున్నారు. గురజాడ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుడు చికెన్ భాష ఆధ్వర్యంలో చికెన్ దందా జరుగుతోంది. ఎమ్మెల్యే అండచూసుకుని చికెన్ వ్యాపారం చేసే వారందర్నీ బెదిరించి దుకాణాలు కూడా తెరవనీయడం లేదు. పోలీసులను పురమాయించి కేసులు పెడతామని చికెన్ వ్యాపారుల్ని బెదిరించి వేధిస్తున్నారు. రాష్ట్రమంతా చికెన్ కేజీ రూ. 90లకి అమ్మితే వీరు మాత్రం రూ.120లకి అమ్ముతున్నారు. రోజుకి 2 వేల కోళ్లు అమ్మి రోజుకి రూ. 50 వేలు నెలకు రూ. 15 లక్షలు, ఏడాదికి రూ.2 కోట్ల వరకు ఒక్క దాచేపల్లి మండలంలోనే సంపాదిస్తున్నారు. చికెన్ దోపిడీలో వారి ప్లాన్ విజయవంతం కావడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇలాగే చికెన్ దోపిడీకి ప్లాన్ చేశారు. ఏడాదికి రూ. 10 కోట్లు సంపాదించవచ్చని ప్రణాళిక రచిస్తున్నారు. అవినీతి చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయండి: ఇలాంటి మాఫియాను నడిపించడానికే ప్రజలు చంద్రబాబుని సీఎం చేశారా? కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటేసింది ఇందుకేనా? అన్ని రంగాల్లో సిండికేట్లుగా తయారై ప్రజలను దోచుకుంటే సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఇప్పటికే లిక్కర్, ల్యాండ్, శాండ్, మైనింగ్ దోపిడీ ముఠాలతో పాటు పేకాట క్లబ్బులతో రాష్ట్రం నాశనమైపోతుంటే కొత్తగా చికెన్ దందాలను ప్రోత్సహించడం ద్వారా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం పంపాలనుకుంటున్నారో చెప్పాలి. ఇలాంటి విష సంస్కృతి సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ సంతోషంగా వ్యాపారాలు చేసుకున్నారు. తక్షణమే ఈ అరాచకాలపై పోలీసులు దృష్టి సారించి ముగింపు పలకాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నష్టపోయిన వారిని పిలిపించి వారికి న్యాయం చేయాలి. ప్రైవేటు వ్యాపారాలు కూడా మీరే చేయాలనుకుంటే అధికారంలో ఉన్నోళ్లే వ్యాపారాలు చేయాలని అసెంబ్లీలో చట్టం చేయండి. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలను సహించనని మీడియాకి చంద్రబాబు లీకులివ్వడం కాదు, దమ్ముంటే ఒక్కరిపైనైనా చర్యలు తీసుకోవాలి. వార్డు గెలవలేక 500 ఓట్లు తీసేయించారు: కూటమి నాయకుల పాలనపై ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చింది. ప్రజలు తమను చీదరించుకుంటున్నారని ప్రభుత్వం కూడా గ్రహించింది. అందుకే చిన్నపాటి జెడ్పీటీసీ ఎన్నికలు కూడ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ఈ ప్రభుత్వం భయపడిపోతోంది. స్వేచ్ఛగా ఓటేసేలా చూడాల్సిన పోలీసులే రిగ్గింగ్ చేయడం కన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? దాచేపల్లిలో ఒక వార్డుకి ఉప ఎన్నిక జరగబోతోంది. 2022లో జరిగిన ఎన్నికల్లో ఈ వార్డులో 1500 లకు పైగా ఓట్లుంటే ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికకు 500 ఓట్లు తీసేసి 1100 ఓటర్ లిస్టును ప్రచురించబోతున్నారు. గెలవడం కోసం ఇంతలా దిగజారిపోవాలా? ఇవన్నీ చూస్తుంటే ఏపీలో పరిస్థితులు బీహార్ కన్నా దిగజారిపోయాయని అర్థమవుతోంది. వైయస్ఆర్‌సీపీ ప్రజల మద్దతుతో విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటే, టీడీపీ మాత్రం ప్రజామోదంతో గెలవలేక అధికారాన్ని అడ్డం పెట్టుకుని వింతపోకడలతో అడ్డదారులు తొక్కుతోంది. ఇలాంటి విధానాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓటర్ లిస్ట్ అవకతవకలపై వైయస్ఆర్‌సీపీ తరఫున హైకోర్టును ఆశ్రయిస్తాం.