తాడేపల్లి: తన సొంత పార్టీలోని ఎమ్మెల్యేల అరాచకాలను చూస్తూ కూడా వారిని అదుపు చేసే స్థితిలో సీఎం చంద్రబాబు లేడని వైయస్ఆర్‌సీపీ నేత, పార్టీ గుంటూరు పార్లమెంట్ నియెజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వారి ఆగడాలపై కేబినెట్‌లో చంద్రబాబు సీరియస్ డ్రామాలు తాటాకు చప్పుళ్ళేనని అన్నారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న కూటమి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎక్కడ తిరగబడతారోననే చంద్రబాబు భయం అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెచ్చుమీరిన కూటమి ఎమ్మెల్యేల అవినీతి, మహిళలపై దాష్టీకాలకు చంద్రబాబే కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ఎక్కడ తన అవినీతిని ప్రశ్నిస్తారనే భయంతో చంద్రబాబు నేతలపై ఉత్తుత్తి వార్నింగ్‌లతో, ప్రజలను మభ్యపెట్టేలా బిల్డప్‌లు ఇస్తున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... కేబినెట్ మీటింగ్‌లో గలీజు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అంటూ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలను రాయించుకుంటున్నారు. అరాచకాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకి లేదు. చంద్రబాబు నిజంగా ప్రజల బాగోగులు గురించి రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించే వారే అయితే ఇప్పటికి ఒక్కరిమీదైనైనా కేసు పెట్టారా? ఇవన్నీ చూస్తుంటే కూటమి నాయకులకు దౌర్జన్యాలకు, గలీజు కార్యక్రమాలను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారని అర్థమైపోతోంది. కాబట్టే వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఆఖరుకి పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. తన అటవీశాఖలోని అధికారులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా కొట్టి వేధిస్తే ఆయనపై చర్యలు తీసుకునేలా చంద్రబాబుని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? సుగాలి ప్రీతి కేసు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలను ఆయన గెలవగానే వదిలేశారా? ఎమ్మెల్యేల దాష్టీకాలపై చర్యలేవీ..? చంద్రబాబు అండ చూసుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న గలీజు పనులు, దాడులు చూసి రాష్ట్ర ప్రజలంతా చీదరించుకుంటున్నా వారిపై చర్యలు తీసుకోవడానికి ఆయన సాహసించడం లేదు. ప్రజలను పక్కదారి పట్టించడానికి మాత్రం గలీజు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అంటూ ఎల్లో మీడియాలో ఊకదంపుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అసలీ చంద్రబాబు ఎవరి మీద సీరియస్ అయ్యారు? సీరియస్ అయ్యారు, నిప్పులు చెరిగారు, ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. లాంటి డైలాగులకు అర్థమేంటి? ఈ సీరియస్ డ్రామాలతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కర్నయినా భయపెట్టగలిగారా? ఒక్కరి మీదనైనా కేసు పెట్టారా? చట్టపరంగా ఒక్కరి మీదనైనా చర్యలు తీసుకున్నారా? కనీసం విచారణకు ఆదేశించిన దాఖలాలైనా ఉన్నాయా అంటే అదీ లేదు. ప్రజలను పక్కదారి పట్టించడానికి తప్ప ఈ సీరియస్ డ్రామా వల్ల జరిగిన ప్రయోజనం ఏంటి బాబూ? ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తున్న టీడీపీ నాయకులు ఒక్కరికైనా 14 నెలల కూటమి పాలనలో శిక్షలు పడ్డాయా? పేపర్ల నిండా టీడీపీ ఎమ్మెల్యేల అరాచాల గురించే: గడిచిన వారం రోజులుగానే టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న దారుణాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి వంటి వ్యవహారాల మీద టీవీలు, పేపర్ల నిండా కథనాలు వస్తున్నా ఒక్కరి మీద కూడా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోలేదు. ఫారెస్ట్ అధికారులను కారుల్లో అర్ధరాత్రి వరకూ తిప్పుతూ కొట్టి వేధించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీద తీసుకున్న చర్యలేంటి? ఎస్సీఎస్టీ అధికారుల మీద దాడులు చేసి వేధిస్తే ఆ ఎమ్మెల్యేనున జైల్లో పెట్టారా? ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? డీలర్లతో కమీషన్ల గురించి మధ్యవర్తిత్వం వహించనందుకు మంత్రి అచ్చెన్నాయుడు తనని బదిలీ చేశాడని ఏకంగా చీఫ్ సెక్రటరీకి ఆగ్రోస్ జీఎం రాజమోహన్ లేఖ రాస్తే కనీసం పిలిచి విచారించారా? ఒక ఉన్నతాధికారి ఫిర్యాదు చేస్తే కనీసం దర్యాప్తు కైనా ఆదేశించారా? రౌడీ షీటర్ శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్ లు తప్పుడు సిఫార్సు లేఖలిచ్చారు. హోంశాఖ రిజెక్టు చేసినా 'వీటో' చేస్తూ ఏకంగా హోంమంత్రి అనిత పెరోల్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? దాన్ని పక్కదారి పట్టించడానికి వైయస్సార్సీపీ నాయకుల గురించి ప్రజల ముందు పచ్చి అబద్ధాలు చెప్పారు. పెరోల్ రిజెక్ట్ చేస్తూ 16.07.2025న హోంశాఖ లేఖ ఇచ్చింది. అయినా 30.07.2025 రౌడీషీటర్ శ్రీకాంత్‌కి పెరోల్ ఇస్తూ ఉత్తర్వులిచ్చిన హోంశాఖ మంత్రి అనిత మీద ఏం చర్యలు తీసుకున్నారో సీఎం చంద్రబాబు చెప్పాలి. ఒక మహిళతో గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అసభ్య చేష్టల వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆ వ్యవహారం బయటపెట్టారనే అనుమానంతో ఒక మహిళను వేధిస్తుంటే ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? బాధిత మహిళకు అండగా నిలిచారా? దళిత మహిళ, కేజీబీవీ ప్రిన్సిపల్ ని వేధించి వెంటాడి ఆమె మీద కక్ష తీర్చుకున్న ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ప్రిన్సిపల్ ని కాపాడాల్సిన ప్రభుత్వం ఆమెకి ఎందుకు అండగా నిలబడలేకపోయింది. కేబినెట్ మీటింగ్‌లో మాత్రం ఎమ్మెల్యేల చర్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అంటూ హైడ్రామా నడిపారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని నారా లోకేష్‌కి అత్యంత సన్నిహితుడైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్.. అత్యంత దారుణంగా దుర్భాషలాడితే ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? జూనియర్ ఎన్టీఆర్‌ని బండ బూతులు తిట్టిన తర్వాతనే సీఎం చంద్రబాబుని ఆ ఎమ్మెల్యే రెండుసార్లు కలిశాడు. ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నట్టు? ఏమీ సంబంధం లేని మహిళ గురించి అత్యంత హేయంగా మాట్లాడితే ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఏమైంది? మీడియాలో బిల్డప్ బ్రేకింగులు తప్పించి ఏం చేశారు. బాధితులపై కేసులు పెడుతున్నారు: చంద్రబాబు పాలనలో రౌడీలు, గూండాలు, దళారులదే రాజ్యం. వారు ఇష్టమొచ్చినట్టు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్న దారుణ పరిస్థితులను సృష్టించారు. పబ్లిగ్గా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ఇష్టానుసారం తప్పుడు పనులు చేస్తుంటే కేబినెట్‌లో కూర్చుని బ్రేకింగ్‌లు ఇప్పించుకోవడం తప్పించి, నిందితులపై చర్యలు తీసుకునే ధైర్య చంద్రబాబుకి లేదని అర్థమైపోతోంది. వారు చంద్రబాబుని ఎప్పుడో లెక్కచేయడం మానేశారు. చంద్రబాబుకి ఎమ్మెల్యేలపై నిజంగా సీరియస్ అయ్యే సీనే ఉంటే, వీరంతా ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోయేవారేనా. సీరియస్ కావడం అంటే బాధితుల మీదనే కేసులు పెట్టడమా? అంటే ఇలాంటి వారిని చంద్రబాబే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారా? రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ పేరిట రాష్ట్రంలో నడుస్తున్న అరాచకాలకు చంద్రబాబే రాజగురువు. ఆయన డైరెక్షన్‌లో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చెలరేగిపోతున్నారు. చంద్రబాబు నిజస్వరూపం ప్రజలకు అర్థమైపోయింది. వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధించి పైశాచిక ఆనందం పొందడం మినహా చేస్తున్నదేమీ లేదు. ఎవరి పాలన ఎంత కిరాతకంగా ఉందో ప్రజలకు ఈజీగా అర్థమైపోయింది. చంద్రబాబుకి అతి తొందర్లోనే ప్రజలు బుద్ధి చెబుతారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు..? అటవీశాఖ అధికారుల మీద దాడులు చేస్తే పవన్ కళ్యాణ్ కూడా చిన్న ట్వీట్‌తో సరిపెట్టడం దారుణం. టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేదాకా ఊరుకోను అని గట్టిగా చెప్పలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యం. విశాఖ స్టీల్ ప్లాంట్ కావొచ్చు, సుగాలి ప్రీతి కేసు కావొచ్చు.., ఏ విషయం లోనూ పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే మనిషి కాదు. రాష్ట్రం గురించో, జనసేన కోసమో ఆయన ఆలోచించడం లేదు. ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం, సీఎం చంద్రబాబు ప్రయోజనాల కోసం ఆయన పోరాడతారని ఈ సంఘటనలే రుజువు చేస్తున్నాయి.