ప్రతాప్ కుమార్ రెడ్డిపై మర్డర్ కేసు పెట్టటం దారుణం 

మాజీ  మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  

నెల్లూరు: కావలిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సౌమ్యుడు అయిన వైయ‌స్ఆర్‌సీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై మర్డర్ కేసు పెట్టటం దారుణమ‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. శ‌నివారం కావ‌లిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇంటిని కాకాణి ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..`కూటమి ప్రభుత్వం వచ్చాక వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త నుంచి మాజీ మంత్రులు దాకా అక్రమ కేసులు పెట్టటం సర్వసాధారణం అయిపోయింది. కావలిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సౌమ్యుడు అయిన ప్రతాప్ కుమార్ రెడ్డి పై మర్డర్ కేసు పెట్టటం దారుణం. ఎమ్మెల్యే పై హత్యాయత్నం చేయబోయారు అంటూ చెప్పటం సిగ్గుచేటు. దొంగ మాటలు చెప్పినా అబ‌ద్దాలు చెప్పినా అతికినట్లు ఉండాలి. అన్నవరం దగ్గర క్వాడ్జ్ లో అక్రమాలు జరుగుతుంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉంది. అందుకే డ్రోన్ ఎగరవేయటం జరిగింది. పోలీసులు శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యారు. అక్రమ కేసులు పెట్టటంలో హూషారు గా ఉన్నారు. జిల్లా ఎస్పీ గా కృష్ణకాంత్ వచ్చాక లా అండ్ ఆర్డర్ అదుపు త‌ప్పింది. ఆయనకు ప్రభుత్వం జీతం ఇవ్వటం దండుగ.  కావలిలో 800 కోట్ల రూపాయలు మనీ స్కాం జరిగిందని ప్రశ్నిస్తే పోలీసులు దొంగ కేసులు పెడతారా? ఎప్పటికీ ఈ ప్రభుత్వమే ఉంటుందాని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఇల్లీగ‌ల్ మైనింగ్ జరుగుతుంటే   డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని తీస్తే అక్రమ కేసులు పెడతారా. ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలు గా మారక తప్పవు. రెడ్ బుక్ అనే పేరుతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి పై దాడి చేస్తే ఇంతవరకు వాళ్ల పేర్ల ను కూడా పోలీసులు గుర్తించలేక పోవటం శోచనీయం. అభివృద్ధి చేసి చుపించలేకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో గ్రావెల్ ఇసుక మాఫియా దర్జాగా కొనసాగుతుంది` అని కాకాణి ఆక్షేపించారు.

Back to Top