తాడేపల్లి: వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయి అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్‌కు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా అందజేశారు. భారత ప్రభుత్వం అందజేసిన జ్ఞాపికను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్ అందజేశారు. ఈ మేరకు అధికారులను సీఎం వైయస్ జగన్ అభినందించారు. భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేయాలని, దిగుబడుల అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని సీఎం దిశానిర్ధేశం చేశారు. సాగుచేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్ నమోదు ఆధారంగా అమలుచేయడం ద్వారా యూనివర్శల్ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించింది.