రాజమండ్రి: న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించిన బాధితులను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను ముద్దాయిలుగా చిత్రీకరించి జైలు పాలుజేస్తున్న దుర్మార్గమైన విధానం ఏపీలో కొనసాగుతోందని తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వేణుగోపాల కృష్ణ.. చంద్రబాబు పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, చట్టాలు చేయాల్సిన ప్రభుత్వమే యథేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లను బెదిరించడం, ప్రలోభపెట్టడం ద్వారా మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంటున్న టీడీపీ.. దాంతో ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేక, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్‌తో ఈ ఐదేళ్లు పాలన చేయడం కుదరదని హెచ్చరించారు. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదన్న మాజీ మంత్రి, ఆడబిడ్డపై యాసిడ్ దాడి జరిగితే ఈయన మాత్రం మ్యూజికల్ నైట్‌లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానని చెప్పిన విజనరీ, తలసేమియా బాధితులను ఆదుకోవడం కోసమంటూ చందాలు అడగడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఇంకా ఏమన్నారంటే.. - రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కూటమి ప్రభుత్వం తన 9 నెలల పాలనతో రాజ్యాంగాన్ని గౌరవించి, ఫాలో అయ్యేవారికి హెచ్చరికలు పంపినట్టుగా ఉంది. ఫిర్యాదుదారుల్ని ముద్దాయిలుగా చిత్రీకరించి బలిచేస్తున్న వింతపోకడ కనిపిస్తుంది. - చట్టాలను గౌరవించి బాధితులకు న్యాయం కల్పించాల్సిన ప్రభుత్వమే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించడం చూస్తే సామాన్యులకు చట్టాల పట్ల ఇంకేం గౌరవం ఉంటుంది? - గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్సీపీ సభ్యులు 90 శాతం స్ధానాల్లో విజయం సాధించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు, దౌర్జన్యాలతో వైఎస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ స్ధానాలను కైవసం చేసుకుంటోంది. వైయస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేసిన మున్సిపాలిటీలను సున్నా స్థానాలతో ఉన్న టీడీపీ గెలుచుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందా? రాజ్యాంగాన్ని ధిక్కరించి చంద్రబాబు అనుసరిస్తున్న అనైతిక విధానాలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు విధానాలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. - వైయస్ఆర్‌సీపీ సభ్యులను భయపెట్టి, కొనుగోలు చేసి వైస్ చైర్మన్ స్ధానాలను కైవసం చేసుకోవడం ద్వారా చంద్రబాబు సాధించేదేమిటి? - అడ్డదారిన అధికారాన్ని దక్కించుకునే విధానాలకు ఆద్యుడు చంద్రబాబు. కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబు ప్రథముడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ని రాత్రికి రాత్రే వదిలేసి ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేశాడు. చంద్రబాబు చేసిన ఈ తప్పిదం వల్ల విభజన హామీలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్రం ఏకంగా రూ. 1.10 లక్షల కోట్లు నష్టపోయింది. - అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అవే అబద్ధాలతో పాలనలోనూ నెట్టుకు రావాలని ఆలోచిస్తున్నాడు. వైయస్ జగన్ సీఎంగా ఉండగా రాష్ట్రం అప్పులు రూ. 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు. తీరా అదంతా అబద్ధమేనని, రాష్ట్రం అప్పులు రూ. 4.60 లక్షల కోట్లేనని బడ్జెట్ ప్రవేశపెట్టడంతోనే తేలిపోయింది. - మంగళవారం అప్పులంటూ వైయస్ జగన్‌ని విమర్శించిన చంద్రబాబుకి అప్పులు చేయకుండా మంగళవారం గడవడం లేదు. అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో ఒక్క హామీ అమలు చేయకుండానే రూ. 1.43 లక్షల కోట్లు అప్పులు చేశాడు. - 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఖజానాలో రూ. 100 కోట్లే ఉన్నా, క్రమం తప్పకుండా అన్ని హామీలను అమలు చేసి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. జగన్ పాలన కారణంగా కరోనా నియంత్రణలో దేశంలో ఏపీ అగ్రగామిగా నిలిచింది. - మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో రూ. 7 వేల కోట్లు ఉన్నా, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదు, దాదాపు రూ. 4 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టారు. విద్య వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. బిల్లులు చెల్లించకపోగా విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై రూ. 17 వేల కోట్లు భారం మోపారు. - ఆఖరుకి ఈ రాష్ట్రంలో ప్రజలకు భద్రత, భరోసా కరువైంది. ప్రజల అవసరాలు తీర్చకుండా తప్పించుకునే కుట్ర జరుగుతోంది. అందులో భాగంగా ప్రతిపక్షం మీద నిందలు మోపడంతోనే చంద్రబాబుకి సరిపోతుంది. - చంద్రబాబు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనే ఉండటం లేదు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇదే ఆఖరి రోజన్న చంద్రబాబు.. అన్నమయ్య జిల్లాలో యువతి మీద యాసిడ్ దాడి జరిగితే ముఖ్యమంత్రి మాత్రం మ్యూజికల్ నైట్‌లో సరదాగా గడుపుతున్నాడు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానని చెప్పిన మేథావి, తలసేమియా బాధితులను ఆదుకోవడం కోసం ప్రజలను చందాలు అడుగుతున్నాడు. ఇదేనా ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు. - ప్రశ్నించే వారిని జైలుపాలు చేస్తే అధికారం శాశ్వతంగా ఉంటుందనే దుర్మార్గపూరిత ఆలోచన చేస్తున్నారు. ఇది ఎంత తప్పో త్వరలోనే చంద్రబాబు తెలుసుకుంటారు. - ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును కాసుల కోసం కక్కుర్తిపడి తీసుకోవడమే కాకుండా ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నా ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాడు. - చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హెరిటేజ్ షేర్లు పెరిగాయి. టీడీపీ ఎమ్మెల్యేల ఆస్తులు పెరుగుతున్నాయి. సామాన్యుడు మాత్రం పెరిగిన ధరలతో నానాటికీ చితికి పోతున్నాడు.