తెలుగు పుస్తకాల విక్రయాల్లో ‘నాలో.. నాతో.. వైయ‌స్ఆర్‌’ సరికొత్త రికార్డు

మొదటి ఎడిషన్‌ ప్రతులన్నీ తొలిరోజే అమ్మకం

5 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చిన పాఠకులు 

ఆంగ్లానువాదానికి ముందుకు వచ్చిన పెంగ్విన్‌ 

తాడేప‌ల్లి: దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గురించి ఆయన సతీమణి, వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైయ‌స్సార్‌’ పుస్తకం తెలుగు పుస్తకాల విక్రయాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి పట్ల తెలుగు వారిలో వెల్లువెత్తుతున్న విశేష జనాదరణకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ మహానేత గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే.. ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సుకత సర్వత్రా వ్యక్తమవుతోందనడానికి అశేష పాఠకాదరణే నిదర్శనం. అందులోనూ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గురించి ఆయన సతీమణి విజయమ్మ రాయడంతో పాఠకులకు మరింత ఆసక్తి కలిగిస్తోంది. అందుకే ఎమెస్కో పబ్లిషర్స్‌ ప్రచురించి ఆన్‌లైన్‌ పోర్టల్‌ అమెజాన్‌ ఇండియా సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన ఈ పుస్తకం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. 

మొదటి ఎడిషన్‌ ప్రతులన్నీ తొలిరోజే విక్రయం 
► ‘నాలో నాతో వైయ‌స్సార్‌’ పుస్తకాన్ని ఆ మహానేత జయంతి సందర్భంగా ఈ నెల 8న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఎమెస్కో పబ్లికేషన్స్‌ ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే విక్రయించాలని నిర్ణయించింది.  
► మొదటి ఎడిషన్‌ కింద ముద్రించిన 5 వేల కాపీలన్నీ తొలిరోజే అమ్ముడైపోయాయి. ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించిన కాసేపటికే అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 24 గంటలు తిరగకముందే అన్నీ కాపీలు అమ్ముడైపోయాయి. ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాల్లో ఓ తెలుగు పుస్తకం మొదటి ఎడిషన్‌ కాపీలన్నీ తొలి రోజే అమ్ముడవ్వడం ఇదే తొలిసారని ఎమెస్కో పబ్లికేషన్స్‌ ప్రకటించింది. 
పాఠకుల కితాబు 
► ‘నాలో నాతో వైయ‌స్సార్‌’ పుస్తకం అమ్మకాల్లో బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసి, చదివిన పాఠకులు.. ‘పుస్తకం చాలా బావుంది.. అద్భుతం’ అంటూ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. దీంతో తమకు ప్రతులు కావాలని పాఠకుల నుంచి విపరీతమైన డిమాండ్‌ వ్యక్తమవుతోంది.  
► దాంతో ఎమెస్కోపబ్లికేషన్స్‌ ఈ పుస్తకం రెండో ఎడిషన్‌ ముద్రణ చేపట్టింది. సోమవారం నాటికి రెండో ఎడిషన్‌ పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి.  
► ఈ పుస్తకాన్ని ఇంగ్లిష్‌ పాఠకులకు అందుబాటులోకి తేవడానికి పెంగ్విన్‌ పబ్లికేషన్స్‌ ముందుకు వచ్చింది.

Back to Top