నెల్లూరు, హిందూపురం: ఆరు జిల్లాలకు చెందిన రైతులకు ప్రాణాధారమైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణం ప్రారంభించి పూర్తి చేసేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, సీఎం చంద్రబాబు మెడలు వంచైనా ప్రాజెక్టును పూర్తి చేయిస్తామని వైయస్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు నెల్లూరు, హిందూపురంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇప్పటికే కర్నూలులో సభ నిర్వహించామని, వచ్చేనెల 1న కడపలో ఆరు జిల్లాల నాయకులు సమావేశమై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో కూటమి నాయకులను రాయలసీమలో తిరగనివ్వమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమకి జీవనాధారమైన ప్రాజెక్టును ఆపేసిన చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ కి మంచి పేరొస్తుందనే భయంతోనే 80 శాతం పూర్తయిన ప్రాజెక్టును చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశాడని ఆరోపించారు. తాను కోరినందువల్లే రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు ఆపేశాడని రేవంత్ రెడ్డి చెప్పినా.. దాన్ని ఖండించలేక కూటమి నాయకులు తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టే ఉద్యమంలో అందర్నీ కలుపుకొంటూ ముందుకుసాగుతామని వైయస్ఆర్‌సీపీ నాయకులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్తలు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూపూరం పార్టీ కార్యాలంలో జరిగిన సమావేశంలో పార్టీ పుట్టపర్తి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలోమీడియాతో మాట్లాడిన నాయకులు ఆరు జిల్లాలకు రాయలసీమ లిప్టు ప్రాణాధారం : నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు సాధనే ధ్యేయంగా వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుంది. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు ప్రాంతానికి కూడా వరప్రదాయని లాంటిది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ రాష్ట్రం రోజుకు 8 టీఎంసీలు నీటిని అక్రమంగా తరలించడం ద్వారా మన రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. రైతులకు న్యాయం చేయడానికి వైయస్ జగన్ గారు సీఎంగా ఉండగా శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా రూ. 3,800 కోట్లతో రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టేసింది. 20 నెలలుగా ఈ ప్రాజెక్టులో తట్ట మట్టి కూడా తీసిన పాపానపోలేదు. దీనిపై ఎన్నోసార్లు ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ ప్రశ్నించినా ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. పర్యావరణ అనుమతులు లేవనేది కేవలం సాకు మాత్రమేనని, రేవంత్ రెడ్డి కోసమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఆపేశాడని తేలిపోయింది. చంద్రబాబు కుట్రల కారణంగా రాయలసీమ రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రాజెక్టు పూర్తి కాకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు సాధనే ధ్యేయంగా వైయస్ఆర్‌సీపీ ముందడుగు వేసింది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాం. ప్రతి జిల్లాలో మేధావులు, సాగునీటి రంగ నిపుణులతో చర్చించి ప్రాజెక్టు ఆవశ్యకతను ప్రజలకు యువతకు వివరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోనూ ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన చేస్తాం. మీడియా ద్వారా ప్రజలకు ప్రాజెక్టు వివరాలను అందిస్తున్నాం. వ్యవసాయం, రైతులను గాలికొదిలేశాడు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను సోమశిలకు అక్కడ్నుంచి కండలేరు జలాశయానికి తరలించి నెల్లూరులో వ్యవసాయం చేస్తున్న పరిస్థితి. నీటి తరలింపు విషయంలో కండలేరు, సోమశిల జలాశయాల పక్షాన జిల్లా పరిషత్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయి తగాదాలు పెట్టుకున్న పరిస్థితులు చూశాం. జలాశయాల్లో నీటిని చూసి పంటలేసిన రైతులు చివరికి పంట చేతికొచ్చే సమయానికి నీరు లేక నష్టపోతున్న పరిస్థితులు చూశాం. రాయలసీమ లిఫ్టు ద్వారా రోజుకు 3 టీఎంసీలు నీటిని తీసుకురాగలిగితే ఈ నీటి సమస్యలు లేకుండా చేయొచ్చనేది వైయస్ జగన్ గారి ఆలోచన. ప్రతి రైతుకూ చివరి సెంట్ వరకు నీటిని అందించే వీలు కలుగుతుంది. చంద్రబాబు సీఎంగా ఉండగా ఏనాడూ నెల్లూరు, సంగం బ్యారేజీలని పట్టించుకోకపోతే వైయస్ జగన్ సీఎం అయ్యాక కరోనా కష్టకాలాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు. 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరులో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదు. ఒక్క సీజన్‌లో సోమశిల- కండలేరు ప్లడ్ ఫ్లో కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు.. నాలుగు సీజన్‌లు గడిచినా ఇంతవరకు దాని సంగతే పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబు వ్యవసాయం, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును సాధిస్తాం. రైతుల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు : గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేయడం ద్వారా రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యవసాయం ఉనికినే ప్రశ్నార్థకం చేసే దుస్థితి తీసుకొచ్చాడు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వైయస్ జగన్ గారికి మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే చంద్రబాబు పూర్తిగా పక్కనపెట్టేశాడు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం లక్షల కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాడు. పక్కనే ఉన్న కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే, చంద్రబాబు మాత్రం వైయస్ జగన్ గారు 80 శాతం పూర్తి చేసిన రాయలసీమ లిప్టును కుట్రపూరితంగా ఆపేశాడు. చంద్రబాబు సీఎం అయనప్పుడల్లా కర్నాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుకుంటూ పోతున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల భవిష్యత్తును చంద్రబాబు పణంగా పెట్టాడు. శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరే వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకోలేని దుస్థితి. అయితే పక్కనే ఉన్న తెలంగాణలో 841 అడుగులకు చేరనీయకుండా 800 అడుగుల నుంచే నీటిని తరలించేస్తూ ఏపీకి అన్యాయం చేస్తున్నారు. ఈ దుస్థితిలోనూ మన రాష్ట్ర రైతులకు నీరందించే లక్ష్యంతో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీలు నీటిని తరలించేలా వైయస్ జగన్ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా బనకచర్ల క్రాస్‌కి 3 టీఎంసీలు నీటిని తీసుకొస్తే వెలిగొండ, సోమశిల, కండలేరు, చెన్నైకి తాగునీరు, గాలేరు-నగరికి నీరివ్వాలన్నా ఏకైక మార్గం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పూర్తి చేయడమే. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 6 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఈ నీరు అందకపోతే ఆ రైతుల పరిస్థితి ఏంటి అనేది కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అసలు ఆ ప్రాజెక్టే అవసరం లేదని చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గం. చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వచ్చే నెల 1వ తేదీన కడపలో ఆరు జిల్లాల నాయకులతో సమావేశమై కార్యాచరణ రూపొందింస్తాం. రైతులకు చంద్రబాబు మోసాలను వివరించే ప్రణాళికలు తయారు చేస్తాం. రైతుల తరఫున వైయస్ఆర్‌సీపీ ఉద్యమం: నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త తాను కోరినందువల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడని రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటికీ చంద్రబాబు ఖండిచడం లేదు. పైగా రేవంత్ మాటలను సమర్థించేలా, రాష్ట్ర రైతాంగానికి నష్టం చేసేలా 20 టీఏంసీలతో ఏమవుతుందని ఎదురు ప్రశ్నించడం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు రైతుల భవిష్యత్తును పూర్తిగా గాలికొదిలేశాడు. ఆయన విధానాలను నిరసిస్తూ వ్యవసాయాన్ని కాపాడుకోవడం కోసం వైయస్ఆర్‌సీపీ రైతుల తరఫున ఉద్యమిస్తుంది. ప్రాజెక్టు పూర్తి చేసేదాకా పోరాడుతాం: ఆనం విజయ్‌కుమార్ రెడ్డి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితేనే నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రధానమైన సోమశిల, కండలేరు జలాశయాలకు నీరందుతుంది. అలాంటి ముఖ్యమైన ప్రాజెక్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు పూర్తిగా పక్కనపెట్టేశాడు. రైతులకు నష్టం జరుగుతుంటే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబు మెడలు వంచైనా సరే రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయిస్తాం. వ్యవసాయం దండగ అనేలా చంద్రబాబు పాలన : మాజీ మంత్రి సాకె శైలజానాథ్ చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా వ్యవసాయం దండగ అనే ఆలోచనతోనే పాలన సాగిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఆఖరుకి వైయస్ జగన్ గారు 80 శాతం పనులు పూర్తి చేసిన రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేశాడు. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ఏపీ ప్రజయోజనాలను తాకట్టుపెట్టాడు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరందింది అంటే అది ఖచ్చితంగా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం వైయస్ జగన్ ల పుణ్యమే. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రాజెక్టు పూర్తయితే వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుందనే ఉద్దేశ్యంతో ఆయకట్టు చివరి వరకు నీరిచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకున్నాడు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు నిలిపివేతపై రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. *హిందూపూరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ నాయకులు* తక్షణమే ప్రాజెక్టు పూర్తి చేయాలి: పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆరు జిల్లాలకు చెందిన రైతులకు ప్రాణాధారమైన రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేసింది. రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు, చెన్నైకి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును వైయస్ఆర్‌సీపీ హయాంలో చేపట్టి 80 శాతం పనులు కూడా పూర్తి చేస్తే.. సీఎం చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశాడు. రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టాడు. తన వల్లే ప్రాజెక్టు ఆగిపోయిందని రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు నిజమో కాదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారంటే ఆయన చెప్పిన మాటలు నిజమేనని అనుకోవాల్సి వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు రావాల్సిన నీటిని తెలంగాణ రాష్ట్రం తోడేస్తుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదు. గతంలోనూ ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌కి భయపడి చంద్రబాబు హైదరాబాద్ వదిలి విజయవాడకి పారిపోయి వచ్చాడు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు చేస్తున్నా నోరు మెదపలేదు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నాడు. ఈ ప్రాంత ప్రాజెక్టుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. రాయలసీమకు జరిగిన ద్రోహం గురించి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక తిరుమల లడ్డూ కల్తీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం చేపట్టి పెండింగ్ పనులు పూర్తి చేయాలి. రాయలసీమ ఎత్తిపోతల పూర్తి చేయకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. లిప్టు ఇరిగేషన్‌ను పూర్తి చేయకపోతే కూటమి నాయకులను రాబోయే రోజుల్లో రాయలసీమలో తిరగనివ్వం.