తాడేపల్లి: కల్తీ నెయ్యి అని ఆరోపణలు చేసి, టీటీడీ నిధులు హెరిటేజ్‌కి అడ్డగోలుగా దోచి పెడుతున్నట్లు ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు.. దానిపై చర్చిస్తే అవినీతి బాగోతం బయటపడుతుందనే భయంతోనే ఇన్నాళ్లూ మండలిలో చర్చకు ఒప్పుకోలేదని వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. ప్రజల్లో హెరిటేజ్ అవినీతిపై చర్చ జరుగుతుందని ఐవీఆర్‌ఎస్ కాల్స్ సర్వే ద్వారా తెలుసుకున్న చంద్రబాబు.. అసెంబ్లీలో ఏకధాటిగా 4 గంటల పాటు చర్చ జరిపి వైయస్ఆర్‌సీపీ మీద బురద జల్లడమే లక్ష్యంగా ఇప్పుడు చర్చకు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేసే అవినీతి, తప్పులను బ్రేకుల్లేకుండా అబద్ధాలతో డైవర్ట్ చేయడానికే వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మేరుగు నాగార్జున తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో మేరుగు నాగార్జున ఇంకా ఏం మాట్లాడారంటే..: బాబు అవినీతికి ఈ ఒక్క ఉదాహరణ చాలు: వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా నిలదీసేవాళ్లం. సోనాయ్ పేరుతో ఇందాపూర్ డెయిరీ నెయ్యిని తయారు చేసి హైదరాబాద్‌లో కేజీ రూ.560కి విక్రయిస్తున్నారు. మరి అదే నెయ్యిని టీటీడీకి అదే ఇందాపూర్ డెయిరీ కేజీ రూ.685కి సరఫరా చేస్తోంది. ఆ రకంగా టీటీడీ నిధుల్ని ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కు దోచి పెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేశారు. చంద్రబాబు భారీ అవినీతికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. చర్చకు వైయస్ఆర్‌సీపీ పట్టుబడుతూనే ఉంది: కల్తీ నెయ్యి పేరుతో తిరుమల లడ్డూ వ్యవహారంలో జరిగిన తెరవెనుక బాగోతాలను వైయస్ఆర్‌సీపీ బయటపెడుతుందనే భయంతోనే దానిపై చర్చకు వైయస్ఆర్‌సీపీ పట్టుబడితే ఇన్నాళ్లూ కూటమి ప్రభుత్వం భయంతో పారిపోతూ వచ్చింది. తిరుమల లడ్డూ వ్యవహారం, ఇందాపూర్–హెరిటేజ్ డెయిరీల అనుబంధం గురించి మండలిలో చర్చించాలని వైయస్ఆర్‌సీపీ పట్టుబడుతూనే ఉంది. వైయస్ఆర్‌సీపీ వాయిదా తీర్మానాలను ఐదు రోజులుగా తిరస్కరిస్తూనే ఉన్నారు. శాసనమండలి చైర్మన్ వద్ద చర్చకు అంగీకరించి, సభలో మాత్రం చర్చించకుండా పారిపోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబే రాజకీయ లబ్ధి కోసం ఏదో చేసి ఉంటాడనే అనుమానాలు ప్రజల్లో ఎక్కువైపోయాయి. ఎట్టకేలకు దిగి వచ్చిన ప్రభుత్వం. అక్కడా కుట్రే!: ఇందాపూర్ డెయిరీ ముసుగులో చంద్రబాబు తన కుటుంబ సంస్థ హెరిటేజ్ కి టీటీడీ నిధులు దోచిపెట్టారని ప్రజలు చర్చించడం మొదలయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చింది. ఐవీఆర్‌ఎస్ కాల్స్ పెట్టి తద్వారా వచ్చిన రిపోర్టు ఆధారంగానే ప్రభుత్వం చర్చకు దిగి వచ్చింది. సభలో చర్చకు అంగీకరించింది. కానీ, అక్కడా చంద్రబాబు మరో కుట్ర చేశారు. అసెంబ్లీలో తమకు బలం ఉంది కాబట్టి, ప్రజల్లోకి ఏకపక్షంగా అబద్ధాలను వ్యాప్తి చెందించాలనే ఉద్దేశంతోనే అక్కడ నాలుగు గంటల పాటు చర్చిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బ్రేకులు లేకుండా నాన్ స్టాప్‌గా వైయస్ఆర్‌సీపీ మీద బురద జల్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ కుట్రకు తెర లేపింది. వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించి ఉంటే కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు చేసిన కుట్రలు ఎండగట్టేవాళ్లం. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ చార్జిషీట్‌లో స్పష్టంగా చెప్పినా చంద్రబాబు మాత్రం దుష్ప్రచారం ఆపలేదు. సిట్ నివేదిక తమకు అనుకూలంగా వచ్చిందనే ఆవేదనతో లడ్డూ తయారీలో బాత్రూమ్‌లు క్లీనింగ్‌కి వాడే కెమికల్స్ కలిపారని చంద్రబాబు మరింత దిగజారి ప్రచారం చేశాడు. వైయస్ జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన మీద కోపంతో తిరుమలను రాజకీయాల్లోకి శ్రీవారి మహాప్రసాదం గురించి లేనిపోని అబద్ధాలను ప్రచారం చేశారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపర్చారని మేరుగు నాగార్జున ఆక్షేపించారు. Bapatla District President & Former Minister Dr. Merugu Nagarjuna Press Meet