అమరావతి: అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారు అంటూ ట్వీట్టర్ వేదికగా వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారని పేర్కొన్నారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు బాబూ అని నిలదీశారు. భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోందా అని ప్రశ్నించారు. ప్రజా తీర్పు వచ్చిన మూడు నెలల తరువాతైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించడం లేదా అని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభించారని తెలిపారు. పట్టుదలతో చేస్తే ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తయ్యేదని చెప్పారు. 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్ తయారయ్యేదని తెలిపారు. ప్రధాని అన్నట్లు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప..పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదని విమర్శించారు. పాడి ఆవు లాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా?..ప్రజల నోటి కాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా వర్ణించుకోవడం పెద్ద జోక్ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.