విశాఖ: పోలవరం ప్రాజెక్టు వద్ద దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పెడతామంటే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేత, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖలో శుక్రవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. పోలవరానికి వైయస్ఆర్ పునాది వేశారని, ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ అత్యంత వేగంగా నిర్వహిస్తున్నారని, షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఓ నెగిటివ్ పర్సన్ అన్నారు, పేదలకు ఇల్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తొత్తుగా నిమ్మగడ్డ వ్యవహారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. నిమ్మగడ్డకు ప్రజా శ్రేయస్సు కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని ధ్వజమెత్తారు. టీడీపీ శ్రేణులు చంద్రబాబు కంటే నిమ్మగడ్డనే ఎక్కువగా నమ్ముతున్నారని, టీడీపీ పెద్దలు చంద్రబాబును దించి నిమ్మగడ్డను ఆ పార్టీ అధ్యక్ష పీఠంపైకి ఎక్కిస్తారేమో అన్నారు. నిమ్మగడ్డ రిటైర్డు అయిన తరువాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. స్టార్‌హోటల్స్‌లో నిమ్మగడ్డ టీడీపీ నేతలతో మంతనాలు చేస్తున్నారని తప్పుపట్టారు. జర్నలిస్టులు ఒకే విధంగా ఉండాలి జర్నలిస్టులకు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకే విధంగా ఉండాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. ఓ పార్టీ ప్రయోజనాల కోసం జర్నలిస్టులు పని చేయకూడదన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ జర్నలిస్టుగా అనర్హుడని పేర్కొన్నారు. రామోజీ రావు జర్నలిజం విలువలు కాపాడేలా పని చేయాలన్నారు. త్వరలోనే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.