కోవిడ్ నుంచి ఎన్నో ప్రాణాలు కాపాడిన ఘనత వైజాగ్ స్టీల్ దే 

స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటికరిస్తే దేశానికి ఇంత సేవ చేయగలిగి ఉండేదా? 

 స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ సభలో  ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ‌:  కోవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ ని దేశానికి ఇచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడిన ఘ‌న‌త విశాఖ స్టీల్ ప్లాంట్‌దేన‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కొనియాడారు.  దేశం మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ సంక్షోభంతో కొట్టమిట్టాడుతోన్న సమయంలో నేనున్నానంటూ దేశానికి ప్రాణవాయువు అందించిన ఘనత ఆర్ ఎన్ ఐ ఎల్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ దే నని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి ప్రశంశించారు. రాష్ట్రానికే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు ప్రాణవాయువు అందించి ఎందరో ప్రాణాలను కాపాడిన స్టీల్ ప్లాంట్ ని ప్రతిఒక్కరూ అభినందించి తీరాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ లో మొదటిదశగా ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ కేర్ హాస్పిటల్ ని కేంద్ర స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాని తో కలిసి వర్చ్యువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాయిరెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటికరించి ఉంటే దేశానికి ఇంత సేవలు అందించగలిగేదా? ఒక్కసారి ఆలోచించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించాల్సిన సందర్భం కాకపోయినప్పటికీ మరొక్కసారి ఆ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. 

కోవిడ్ రోగుల చికిత్స కోసం స్టీల్ ప్లాంట్ 1000 పడకల కోసం ప్రణాళిక చేయడం, అందులో భాగంగా మొదటి దశలో 300 పథకాలను పూర్తి చేసి కేంద్ర స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత ప్రారంభించబడడం ఆనందాన్ని కలిగించందన్నారు సాయిరెడ్డి. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విజయవంతంగా అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్ళలో మిళితం చేస్తూ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలోనే ఈ కార్యక్రమం జరగడం సంతోషాన్ని కలిగిస్తోందని విజయసాయిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ జంబో కోవిడ్-కేర్ సౌకర్యం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలు పరిష్కారం కానున్నాయని, వైజాగ్‌లో కోవిడ్ చికిత్స కోసం అందుబాటులో ఉన్న పడకల సంఖ్య పెరగడం అందులో ఒకటి అని  విజయసాయిరెడ్డి అన్నారు..  నిన్నటి బులిటెన్ నే చూస్తే వైజాగ్ లో 1004 కోవిడ్ కేసులు, ఇతర ఉత్తర-ఆంధ్ర జిల్లాల్లో 2067 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, దీంతో శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం లో ఆక్టివ్ కేసుల మొత్తం 32,810 కి చేరిందని పేర్కొన్న సాయిరెడ్డి తాజాగా ఈ 300 పడకల కేర్ సెంటర్ తో పాటు త్వరలో రెండో దిశగా అందుబాటులోకి తేనున్న మరో 700 పడకల వల్ల అనేక మందికి బెడ్స్ లభ్యత పెరిగి ఒత్తిడి తగ్గుతుందన్నారు. అలాగే ఆక్సిజన్ లభ్యత లో కూడా వేగం పెరిగి అవసరమైన వారికి తక్షణం ప్రాణవాయువు ని అందించే అద్భుత అవకాశం ఈ జంబో కేర్ సెంటర్ ద్వారా కలగనుందన్నారు సాయిరెడ్డి. 

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్సిజన్ పంపిణీ సమస్యలను ఎదుర్కొంటోందని,  మాకు రాష్ట్రంలో తగినంత ఆక్సిజన్ ట్యాంకర్లు లేవని, రాష్ట్రంలో మొత్తం 160 ఆక్సిజన్ ట్యాంకర్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ అవసరాలకు 60 ట్యాంకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి ధర్మాన ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు.  సగటున ఒక్కో ఆక్సిజన్ ట్యాంకర్ ఒక లోడ్ ను దిగుమతి చేయడానికి 3-4 రోజులు సమయం పడుతుందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ సమర్ధ నాయకత్వంలో ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తుందని  విజయసాయిరెడ్డి వివరించారు.

అలాగే కోవిడ్ కి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క సహకారం విశిష్టమైనదిగా అభివర్ణించిన విజయసాయిరెడ్డి దేశంలో మొట్టమొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 19 న వైజాగ్ నుండి ముంబై వరకు వెళ్లిందని గుర్తు చేశారు. అందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియచేస్తోందని అన్నారు సాయిరెడ్డి. ఈ సందర్భంగా సంక్షేమం అభివృద్ధిలో దూసుకెళ్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు.
 

Back to Top