పాదయాత్రలో రాహుల్‌ గాంధీ ఎలాగైనా మాట్లాడవచ్చా?

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విజ‌య‌వాడ‌:కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ కమ్యూనికేషన్, మీడియా విభాగం అధిపతి జైరామ్‌ రమేష్‌ కీలక అంశాలపై పరస్పర విరుద్ధంగా మాట్లాడారు. భారత్‌ జోడో అనే ఈ కాలినడక పయనానికి తాను నాయకత్వం వహించడం లేదని, కాంగ్రెస్‌ సభ్యుడిగా మాత్రమే పాదయాత్రలో పాల్గొంటున్నాని రాహుల్‌ గాంధీ మొన్న కన్యాకుమారిలో స్పష్టంచేశారు. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ అధిష్ఠానానికి అత్యంత నమ్మకస్తుడు అయిన జైరామ్‌ రమేష్‌ చాలా పద్ధతిగా ఉన్న విషయం చెప్పారు. రాహుల్‌ యాత్ర ప్రారంభ సమయంలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘బలమైన కాంగ్రెస్‌ మాత్రమే ప్రతిపక్షాలను ఏకం చేయగలదు. పాదయాత్ర కాంగ్రెస్‌ పార్టీకి సంజీవని వంటిది. పాదయాత్ర తర్వాత కాంగ్రెస్‌ దూకుడుగా వ్యవహరిస్తుంది. 3750 కిలోమీటర్ల భారత యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్‌ కొత్త అవతారం ఎత్తుతుంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ పార్టీని మిత్రపక్షాలే కాదు, రాజకీయ ప్రత్యర్ధులు, శత్రువులు కూడా తేలికగా తీసుకున్నారు. చులకనగా చూశారు. ఇక మాది ‘వీధుల్లో పోరాడే’ కాంగ్రెస్‌ అవుతుంది,’ అని రమేష్‌ తేల్చిచెప్పారు. మిగిలిన ప్రతిపక్షాలు లేదా మిత్రపక్షాలు ఏమనుకుంటాయనే మొహమాటం లేకుండా ఆయన మాట్లాడారు. రాహుల్‌ మాత్రం తెచ్చిపెట్టుకున్న లౌక్యంతో, ‘ప్రతిపక్షాలన్నింటినీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క తాటిపై నడిపించడం కాంగ్రెస్‌ బాధ్యత మాత్రమే కాదు. పాలకపక్షానికి వ్యతిరేకంగా చేతులు కలపాల్సిన బాధ్యత మిగిలిన ప్రతిపక్షాలకూ ఉంది. కాంగ్రెస్‌ ఒక్కటే ప్రతిపక్షం కాదు. ప్రతి పార్టీకీ ఇందులో పాత్ర ఉంటుంది,’ అని రాహుల్‌ ఎంతో వినమత్రతతో చెప్పారు. పార్టీ అధికార ప్రతినిధిగా, కమ్యూనికేషన్‌ విభాగం అధిపతిగా జైరామ్‌ రమేష్‌ మాత్రం కాంగ్రెస్‌ మిగిలిన అన్ని పార్టీలతో పోల్చితే ప్రధానమైనది, ప్రాచీనమైనదని చెబుతూ, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే శక్తిస్వరూపాలు కాంగ్రెస్‌ కు మాత్రమే ఉన్నాయని సూచనప్రాయంగా తెలిపారు. రాజీవ్‌ భారత యాత్రలో మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే–2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ, ‘‘ఇంత ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్‌ ఇక చచ్చిపోవడం మేలు. కాంగ్రెస్‌ పార్టీ ఉన్నంతకాలం ప్రతిపక్షాల ఐక్యతకు అది అడ్డంకిగానే ఉంటంది. అందుకే అది చావాలి,’’ అని ప్రకటించారు. అయితే, పాదయాత్రకు ముందు దాని ఏర్పాట్లకు సంబంధించి ఢిల్లీ కాన్సిస్ట్యూట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో యోగేంద్ర పాల్గొన్నారు. అంతేకాదు, మొన్న కన్యాకుమారిలో భారత్‌ జోడో మొదలైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యోగేంద్ర యాదవ్‌ కనిపించడం విశేషం. ఏదేమైనా, పార్టీ పాలసీకి అనుగుణంగా మాట్లాడే జైరామ్‌ రమేష్‌ వంటి సీనియర్ల ప్రకటనలకు విరుద్ధంగా రాహుల్‌ జీ మాట్లాడితే పోయేది కాంగ్రెస్‌ పరువే. 2013లో కూడా ఇదే తరహాలో తన సొంత పార్టీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ సర్కారు జారీ చేసిన ఓ ఆర్డినెన్స్‌ ప్రతిని రాహుల్‌ ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌లో వందలాది విలేఖరుల ముందు చింపి ముక్కలు చేసి పారేయడం ఇంకా ప్రజలకు గుర్తుంది.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top