తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు దళిత ద్రోహి అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచే అవకాశం ఉన్నప్పుడు అగ్ర వర్ణాలకు సీటు ఇచ్చి..ఇప్పుడు ఓడిపోయే స్థానంలో దళిత నేత వర్ల రామయ్యను బలి పశువును చేయాలని బాబు ఆలోచన అని వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలంటే చంద్రబాబుకు చులకన అంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో టీడీపీ దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన ఆ రోజు అంతా రెడీ చేసి..ఫ్యామిలీతో ప్రకాశం బ్యారేజీ వరకు వెళ్లిన తరువాత ఈ సారికి కుదరదని చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. ఆ రోజు మూడు రాజ్యసభ సీట్లు అవకాశం ఉంటే గుంటూరు జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పుష్పరాజ్‌కు సీటు ఇస్తామని చెప్పి అప్పుడూ మోసం చేశాడు. అలాగే మోత్కుపల్లి నరసింహులును గవర్నర్‌ను చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారు. గెలిచే అవకాశం ఉన్న రోజుల్లో దళితులకు అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎస్సీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. ఓడిపోయే సీటుకు వర్ల రామయ్యను బలి పశువును చేయడం ఎందుకు. గెలిచే సమయంలో చంద్రబాబు ఆయన సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చారు. ఇవాళ ఓడిపోయే సీటుకు పోటీ పెట్టి దళితులపై కపట ప్రేమ చూపుతున్నారు. ఇది దుర్మార్గం. బలి ఇవ్వడానికి దళితులు మాత్రమే ఆయనకు దొరికారు. ఇది గెలిచే సీటు అయితే చంద్రబాబు ఆయన కుమారుడినే పెట్టేవారు. ఎందుకంటే మంగళగిరి మాలోకం రేపోమాపో ఎమ్మెల్సీ పదవి పోతుంది. చంద్రబాబు ఎప్పుడు కూడా దళితులను ఓటు బ్యాంకుగానే చూశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. టీడీపీలో ఉన్న దళితులు ఎందుకు అందులో ఉంటున్నారో అర్థం కావడం లేదు. స్వార్థ ప్రయోజనాలు వీడి ఇకనైన బయటకు రండి. టీడీపీకి 23 ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ఇద్దరు బయటకు వెళ్లారు. 21 మంది ఎమ్మెల్యేలతో ఎలా గెలుస్తారో అర్థం కావడం లేదు. బలి పశువును చేస్తున్నా కూడా వీళ్లంతా కూడా ఆ పార్టీని పట్టుకొని వేలబడటం బాధాకరం. నిన్ననే చంద్రబాబు తీరు చూసి తట్టుకోలేక, ఆత్మగౌరవం కోసం ఆపార్టీ వీడి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆత్మగౌరవం చంపుకొని టీడీపీలో ఉండాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నా. ఆయన సామాజిక వర్గానికి మాత్రమే ఆయన న్యాయం చేసుకుంటున్నారు. చంద్రబాబు పచ్చి మోసకారి, అవకాశవాది.