ఢిల్లీ: లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైయస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజుపై రెండు సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ థర్మల్ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఆయన బ్యాంకులను మోసం చేశాడు. వాటి నుంచి బయట పడటం కోసం కేంద్రంలోని అధికార(బీజేపీ) పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు మా పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు. బ్యాంకులను మోసం చేశాడు కాబట్టే.. ఆ కేసుల నుంచి బయటపడటానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుపై కేసులను వీలైనంత త్వరగా తేల్చండి. భారత్ థర్మల్ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని’’ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరదసాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి: మార్గాని భరత్ ఇటీవల వరద కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ గ్రాంటు కింద తక్షణమే రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ కోరారు. జీరోఅవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇటీవలి వరదలతో రాష్ట్రంలో రూ.6 వేలకోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉందన్నారు. కిసాన్‌రైల్ రాయితీని రూ.150 కోట్లకు పెంచండి: చంద్రశేఖర్ కరోనా మహమ్మారి సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్‌రైల్ సేవలకు ప్రభుత్వం ఏటా ఇస్తున్న రాయితీని రూ.50 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కేంద్రాన్ని కోరారు. ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ రవాణా ఖర్చును టన్నుకు రూ.వెయ్యి, ప్రయాణ సమయాన్ని దాదాపు 15 గంటలు తగ్గించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ సేవలు ప్రయోజనం కలిగిస్తున్నాయని చెప్పారు. దిశ బిల్లు త్వరగా ఆమోదించండి: వంగా గీత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ బిల్లును త్వరితగతిన ఆమోదించి మహిళలు, బాలికలకు భరోసా కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఏపీ దిశ బిల్లు ఒక మైలురాయిగా పేర్కొంటూ 2019లో శాసనసభ ఆమోదించిందని చెప్పారు. మహిళలు,బాలికలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించి ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తిచేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్రం ఆమోదించాలన్నారు. ఇటువంటి కేసుల్లో సత్వర న్యాయం, కఠిన శిక్షల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయని చెప్పారు. వీటన్నింటని పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.